breaking news
Asia shooting championship
-
భారత షూటర్ల పసిడి పంట
షిమ్కెంట్ (కజకిస్తాన్): ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ఇటు సీనియర్లు, అటు జూనియర్లు పసిడి పంట పండిస్తున్నారు. సీనియర్ మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్లో ఒలింపియన్ సిఫ్ట్ కౌర్ సమ్రా వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లో బంగారు పతకాలు గెలుచుకుంది. ఫైనల్లో 23 ఏళ్ల సిఫ్ట్ కౌర్ 459.2 స్కోరుతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. టీమ్ విభాగంలో సిఫ్ట్ కౌర్ సమ్రా (589), ఆషి చౌక్సీ (586), అంజుమ్ మౌద్గిల్ (578)లతో కూడిన భారత బృందం మొత్తం 1753 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. క్వాలిఫయింగ్‌లో భారత్‌కే చెందిన శ్రీయాంక సదండి ‘టాప్’లో నిలిచింది. అయితే శ్రీయాంక ‘ర్యాంకింగ్ పాయింట్స్ ఓన్లీ’ (ఆర్పీఓ)లో పోటీపడటంతో పతకం బరిలో నిలిచే అవకాశం దక్కలేదు. ఆర్పీఓ షూటర్లకు మెడల్ రౌండ్ చాన్స్ ఉండదు. జూనియర్ ఈవెంట్లో షూటర్ అనుష్క ఠాకూర్ పసిడిపై గురిపెట్టి తొలిసారి అంతర్జాతీయ పతకాలతో డబుల్ ధమాకా సాధించింది. జూనియర్ మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్లో 18 ఏళ్ల అనుష్క 460.7 స్కోరుతో ప్రథమ స్థానంలో నిలిచింది. అనుష్క (583), ప్రాచీ గైక్వాడ్ (588), మహిత్ సంధూ (587) బృందం 1758 స్కోరుతో పసిడి పతకాన్ని గెల్చుకుంది. జూనియర్ పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో సమీర్ కాంస్యం నెగ్గాడు. ఫైనల్లో సమీర్ 21 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. సమీర్, సూరజ్ శర్మ, అభినవ్ కలిసి టీమ్ ఈవెంట్లో పసిడి పతకం నెగ్గారు. జూనియర్ మహిళల ట్రాప్ ఈవెంట్లో హరీస్ సబీరా స్వర్ణం, ఆద్య రజతం నెగ్గారు. టీమ్ ఈవెంట్లో సబీర–ఆద్య–భవ్యలతో కూడిన త్రయం కూడా బంగారు పతకం గెలిచింది. ఆర్యవంశ్–అర్జున్–ఉద్ధవ్‌లతో కూడిన జూనియర్ పురుషుల టీమ్ కూడా పసిడి పతకం నెగ్గింది. ఓవరాల్‌గా భారత్ 31 స్వర్ణాలు, 11 రజతాలు, 14 కాంస్యాలతో కలిపి 56 పతకాలతో ‘టాప్’ ర్యాంక్‌లో కొనసాగుతోంది. -
నీరూ ‘డబుల్’ ధమాకా
షిమ్కెంట్ (కజకిస్తాన్): ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. సోమవారం సీనియర్ విభాగంలో భారత్‌కు రెండు స్వర్ణాలు, ఒక రజతం, రెండు కాంస్యాలు లభించాయి. మహిళల ట్రాప్ ఈవెంట్లో నీరూ ధండ రెండు బంగారు పతకాలతో అదరగొట్టింది. ఆరుగురు పోటీపడ్డ మహిళల ట్రాప్ ఫైనల్లో భారత షూటర్ నీరూ ధండ 43 పాయింట్లు స్కోరు చేసి చాంపియన్‌గా అవతరించింది. భారత్‌కే చెందిన ఆషిమా అహ్లావత్ 29 పాయింట్లు సాధించి కాంస్య పతకాన్ని సంపాదించింది. నీరూ, ఆషిమా, ప్రీతి రజక్‌లతో కూడిన భారత జట్టు 319 పాయింట్లతో టీమ్ విభాగంలో బంగారు పతకాన్ని సాధించింది. పురుషుల ట్రాప్ వ్యక్తిగత ఈవెంట్లో భౌనీశ్ మెండిరట్టా రజత పతకాన్ని దక్కించుకున్నాడు. ఫైనల్లో భౌనీశ్ 45 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచాడు. ఇషా బృందానికి కాంస్యం మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లో తెలంగాణ షూటర్ ఇషా సింగ్ సభ్యురాలిగా ఉన్న భారత జట్టు కాంస్య పతకం నెగ్గింది. ఇషా సింగ్, మనూ భాకర్, సిమ్రన్ప్రీత్ కౌర్ బృందం 1749 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. 25 మీటర్ల వ్యక్తిగత విభాగం ఫైనల్లో మనూ భాకర్ 25 పాయింట్లతో నాలుగో స్థానంలో, ఇషా సింగ్ 18 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచి పతకాలకు దూరమయ్యారు. జూనియర్ మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్లు క్లీన్‌స్వీప్ చేశారు. పాయల్ స్వర్ణం, నామ్యా కపూర్ రజతం, తేజస్విని కాంస్యం గెలిచారు. ప్రస్తుతం భారత్ 29 స్వర్ణాలు, 11 రజతాలు, 14 కాంస్యాలతో కలిపి 54 పతకాలతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతోంది. -
Asian Shooting Championships 2023: అనీశ్ డబుల్ ధమాకా
చాంగ్వాన్ (దక్షిణ కొరియా): ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. సోమవారం జరిగిన పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో భారత యువ షూటర్ అనీశ్ భన్వాలా కాంస్య పతకం సాధించాడు. ఆరుగురి మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో 21 ఏళ్ల అనీశ్ 28 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంతో ముగించాడు. ఈ ప్రదర్శనతో అనీశ్ వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌ను కూడా ఖరారు చేసుకున్నాడు. ఇప్పటి వరకు షూటింగ్లో భారత్‌కు 12 ఒలింపిక్ బెర్త్‌లు లభించాయి. మరోవైపు పురుషుల ట్రాప్ టీమ్ ఈవెంట్లో హైదరాబాద్ షూటర్ కైనన్ షెనాయ్, జొరావర్ సింగ్ సంధూ, పృథ్వీరాజ్ తొండైమన్‌లతో కూడిన భారత జట్టుకు రజత పతకం దక్కింది. కైనన్, జొరావర్, పృథీ్వరాజ్ బృందం 341 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో భారత్ 30 పతకాలు సాధించింది. -
సరబ్‌జోత్‌కు కాంస్య పతకంం
చాంగ్వాన్ (దక్షిణ కొరియా): ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ పతకాల బోణీ చేసింది. మంగళవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ సరబ్జోత్ సింగ్ కాంస్య పతకం సాధించాడు. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో సరబ్జోత్ 221.1 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచాడు. సరబ్జోత్ కాంస్య పతక ప్రదర్శనతో భారత్‌కు షూటింగ్ క్రీడాంశంలో ఎనిమిదో ఒలింపిక్ బెర్త్ ఖరారైంది. అంతకుముందు క్వాలిఫయింగ్ సరబ్జోత్ 581 పాయింట్లు స్కోరు చేసి ఎనిమిదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఇప్పటి వరకు భారత్ నుంచి పారిస్ ఒలింపిక్స్‌కు రుద్రాం„ పాటిల్ (పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్), స్వప్నిల్, అఖిల్ షెరాన్ (పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్), భౌనీష్ మెండిరట్టా (పురుషుల ట్రాప్), మెహులీ ఘోష్ (మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్), సిఫ్ట్ కౌర్ (మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్), రాజేశ్వరి కుమారి (మహిళల ట్రాప్) అర్హత పొందారు. మరోవైపు మహిళల జూనియర్ విభాగం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భారత్‌కు చెందిన సంయమ్ 240.6 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. -
హీనా సిద్ధూకు స్వర్ణం
కువైట్ సిటీ: వరుసగా రెండో రోజు ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల గురి అదిరింది. సోమవారం జరిగిన రెండు ఈవెంట్స్‌లో భారత్‌కు మొత్తం నాలుగు పతకాలు లభించాయి. ఇందులో రెండు స్వర్ణాలు, రజతం, కాంస్యం ఉన్నాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో హీనా సిద్ధూ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. క్వాలిఫికేషన్ రౌండ్లో 400 పాయింట్లకు 386 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానం పొందిన హీనా... ఫైనల్లో 200.3 పాయింట్లతో విజేతగా నిలిచింది. వూ చియా యింగ్ (చైనీస్ తైపీ-198.3 పాయింట్లు) రజతం... అల్ బాలూషీ వధా (ఒమన్-177.3 పాయింట్లు) కాంస్యం సాధించారు. హీనా సిద్ధూ, శ్వేతా చౌదరీ, హర్వీన్‌లతో కూడిన భారత బృందం 1138 పాయింట్లతో టీమ్ విభాగంలో రజతం నెగ్గింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో చెయిన్ సింగ్ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. క్వాలిఫికేషన్ రౌండ్లో 619.6 పాయింట్లు స్కోరు చేసిన చెయిన్ సింగ్... ఫైనల్లో 206 పాయింట్లు సాధించి స్వర్ణాన్ని దక్కించుకున్నాడు. టీమ్ విభాగంలో చెయిన్ సింగ్, రవి కుమార్, రఘునాథ్‌లతో కూడిన భారత జట్టుకు కాంస్యం లభించింది. ఓవరాల్‌గా ఈ పోటీల్లో ఇప్పటివరకు భారత్ ఖాతాలో మూడు స్వర్ణాలు, రెండు రజతాలు, రెండు కాంస్యాలు చేరాయి. -
పూజ పసిడి గురి
ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్ కువైట్: ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా షూటర్ పూజా ఘోట్కర్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణం సాధించిం ది. క్వాలిఫికేషన్ రౌండ్లో 413.1 స్కోరు నమోదు చేసి ఫైనల్‌కు చేరిన పూజ... 208.8 స్కోరుతో విజేతగా నిలిచింది. చైనా షూటర్లు దూ బెజ్ 207.2, యి సైలింగ్ 186.2తో వరుసగా రజత, కాంస్య పతకాలు సాధించారు. పూజ అద్భుత ప్రతిభకు తోడు అపూర్వి చందేలా, అయోనికా పాల్ల స్కోరు జత కలవడంతో టీమ్ విభాగంలో భారత్‌కు కాంస్యం లభించింది. చైనా స్వర్ణం, సౌదీ అరేబియా కాంస్యం దక్కించుకున్నాయి. పురుషుల ఎయిర్ పిస్టల్ విభాగం ఫైనల్లో భారత షూటర్లు సమరేశ్ జంగ్ 119.4తో 6వ, పి.ఎన్.ప్రకాశ్ 98.2తో 7వ స్థానాలతో సరిపెట్టుకున్నారు. అయితే జట్టుగా జీతూ రాయ్‌తో కలిసి 1800కుగాను 1732 స్కోరుతో భారత్‌కు రజతం సాధించి పెట్టారు.