
ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో 103 పతకాలతో అగ్రస్థానం
షిమ్‌కెంట్ (కజకిస్తాన్): గురి తప్పని లక్ష్యంతో అదరగొట్టిన భారత షూటర్లు ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌ను దిగ్విజయంగా ముగించారు. శుక్రవారం తెర పడిన ఈ మెగా ఈవెంట్‌లో సీనియర్, జూనియర్, యూత్ విభాగాల్లో కలిపి భారత షూటర్లు మొత్తం 103 పతకాలు నెగ్గి అగ్రస్థానంలో నిలిచారు. ఇందులో 52 స్వర్ణాలు, 26 రజతాలు, 25 కాంస్యాలు ఉండటం విశేషం. ఆఖరి రోజు నాన్ ఒలింపిక్ కేటగిరీ పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్‌లో ప్రపంచ మాజీ చాంపియన్ అంకుర్ మిట్టల్ స్వర్ణ పతకం గెలిచాడు. 18 మంది షూటర్లు పోటీపడ్డ ఈ ఈవెంట్‌లో అంకుర్ 107 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచాడు.
అంకుర్, భానుప్రతాప్ సింగ్, హర్షవర్ధన్‌లతో కూడిన భారత జట్టు 264 పాయింట్లతో టీమ్ విభాగంలో కాంస్యం సాధించింది. మహిళల డబుల్ ట్రాప్ వ్యక్తిగత ఈవెంట్‌లో భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. అనుష్క సింగ్ (93 పాయింట్లు), ప్రాణిల్ ఇంగ్లే (89), యెశాయ హఫీజ్ కాంట్రాక్టర్ (87) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు గెలిచారు. అనుష్క, ప్రాణిల్, యెశాయ బృందం టీమ్ విభాగంలోనూ బంగారు పతకం సొంతం చేసుకుంది.
పురుషుల 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ ఈవెంట్‌లోనూ భారత షూటర్లు మెరిశారు. వ్యక్తిగత విభాగంలో రాజ్‌కన్వర్ సింగ్ సంధూ 583 పాయింట్లతో స్వర్ణ పతకం నెగ్గాడు. టీమ్ విభాగంలో రాజ్‌కన్వర్, గుర్‌ప్రీత్ సింగ్, అంకుర్ గోయల్‌లతో కూడిన భారత బృందం 1733 పాయింట్లతో బంగారు పతకాన్ని దక్కించుకుంది.
సురభి బృందానికి రజతం
మహిళల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ మానిని కౌశిక్ (617.8 పాయింట్లు) కాంస్య పతకం గెలిచింది. తెలంగాణ షూటర్ రాపోలు సురభి భరద్వాజ్, మానిని, విదర్శలతో కూడిన భారత బృందం 1846 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సొంతం చేసుకుంది.