Neeraj Chopra: ప్యారిస్‌ డైమండ్‌ లీగ్‌ విజేతగా భారత సూపర్‌ స్టార్‌ | Neeraj Chopra Beats Julian Weber To Win First Diamond League Title, Watch Video Went Viral | Sakshi
Sakshi News home page

Neeraj Chopra: ప్యారిస్‌ డైమండ్‌ లీగ్‌ విజేతగా భారత సూపర్‌ స్టార్‌

Jun 21 2025 11:07 AM | Updated on Jun 21 2025 12:52 PM

Neeraj Chopra Beats Julian Weber To Win First Diamond League Title

భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా (Neeraj Chopra) డైమండ్‌ లీగ్‌ విజేతగా నిలిచాడు. జర్మనీ బల్లెం వీరుడు జూలియన్‌ వెబర్‌ను ఓడించి చాంపియన్‌గా అవతరించాడు. ప్యారిస్‌ (Paris Diamond League)లో జరిగిన ఈ పోటీలో భారత సూపర్‌స్టార్‌ నీరజ్‌ చోప్రా తన తొలి ప్రయత్నంలో ఈటెను 88.16 మీటర్ల దూరం విసిరాడు. ఇదే ఈ పోటీలో అత్యుత్తమం కావడంతో అతడు టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.

ఇక రెండో ప్రయత్నంలో 85.10 మీటర్లు విసిరిన ఈ హర్యానా అథ్లెట్‌.. తదుపరి మూడు ప్రయత్నాల్లో ఫౌల్‌ అయ్యాడు. అయితే, ఆఖరిదైన ఆరో త్రోలో 82.89 మీటర్ల దూరం బల్లాన్ని విసిరాడు. 

మరోవైపు.. వెబర్‌ తన తొలి ప్రయత్నంలో 87.88 మీటర్లు విసరగా అదే అతడి బెస్ట్‌గా నిలిచింది. దీంతో నీరజ్‌ తర్వాతి స్థానాన్ని వెబర్‌ ఆక్రమించగా.. బ్రెజిల్‌కు చెందిన లూయిజ్‌ మారీషియో డా సిల్వా 86.62 మీటర్ల దూరం (రెండో ప్రయత్నం) ఈటెను విసిరి మూడో స్థానంలో నిలిచాడు.

కాగా నీరజ్‌ చోప్రా టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన విషయం తెలిసిందే. అయితే, ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో మాత్రం ఈ గోల్డెన్‌ బాయ్‌ రజతంతో సరిపెట్టుకున్నాడు. ఇదిలా ఉంటే... గత నెలలో దోహా డైమండ్‌ లీగ్‌ జరగగా నీరజ్‌ చోప్రా 90.23 మీటర్ల దూరం బల్లెం విసిరి రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 

నాడు జూలియన్‌ వెబర్‌ 91.06 మీటర్ల దూరం ఈటెను త్రో చేసి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత పోలండ్‌ మీట్‌లోనూ ఈ ఇద్దరే తొలి రెండు స్థానాల్లో నిలిచారు. తాజాగా ప్యారిస్‌ డైమండ్‌ లీగ్‌లోనూ ఇదే పునరావృతం చేశారు.

చదవండి: యశస్వి జైస్వాల్‌ ప్రపంచ రికార్డు.. బ్రాడ్‌మన్‌నే అధిగమించాడు!

Advertisement
 
Advertisement
Advertisement