పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై గత కొంతకాలంగా విమర్శల వర్షం కురుస్తోంది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో పాక్ సూపర్-8 దశలోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ మెగా ఈవెంట్ తర్వాత బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుకు దాదాపు పదకొండేళ్ల తర్వాత వన్డే సిరీస్‌ను కోల్పోయింది.
ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు రషీద్ లతీఫ్ (Rashid Latif), అహ్మద్ షెజాద్ పాక్ బోర్డు యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ, సెలక్టర్ల అనుచిత నిర్ణయాల వల్లే పాక్ క్రికెట్ నాశనమవుతోందని మండిపడ్డారు.
ఐపీఎల్‌తో పోటీపడి.. బొక్కబోర్లా
ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) ద్వారా పాక్ బోర్డు మెరుగైన ఆదాయం వచ్చేది. అయితే, గత కొన్ని సీజన్లుగా ఐపీఎల్‌కు పోటీగా పీఎస్‌ఎల్ షెడ్యూల్‌ను ఖరారు చేస్తోంది పీసీబీ. ఈ నేపథ్యంలో విదేశీ ఆటగాళ్లు ఎక్కువగా ఐపీఎల్ వైపే మొగ్గుచూపుతుండగా.. ఇక్కడ అమ్ముడుపోని ప్లేయర్లు పీఎస్‌ఎల్‌లో ఆడేందుకు వెళ్తున్నారు.
పీఎస్‌ఎల్‌ను వీడి ఐపీఎల్‌లో..
అయితే, ఐపీఎల్ జట్లలోని ఆటగాళ్లు గాయాలు, ఇతరత్రా కారణాల వల్ల దూరమైతే పీఎస్‌ఎల్‌ను వీడి.. ఐపీఎల్‌లో చేరడానికి వారు ఏమాత్రం వెనుకాడటం లేదు. జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజర్‌బానీ పీఎస్‌ఎల్‌ను వీడి ఐపీఎల్‌లో కేకేఆర్ జట్టులో చేరగా.. శ్రీలంక కెప్టెన్ దసున్ షనక సైతం ఇదే బాటలో నడిచాడు.
సామ్ కర్రాన్ స్థానంలో షనక రాజస్తాన్ రాయల్స్ జట్టులో చేరాడు. మరోవైపు.. ఆస్ట్రేలియా పేసర్ స్పెన్సర్ జాన్సన్ నాథన్ ఎల్లిస్ స్థానంలో సీఎస్‌కేలోకి వచ్చాడు. ఓవైపు పశ్చిమాసియా యుద్ధ ప్రభావం వల్ల స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లే నిర్వహిస్తున్న పీసీబీకి.. ఆటగాళ్లు అర్ధంతరంగా వెళ్లిపోవడం తలనొప్పిగా మారింది.
కామెంటేటర్లు సైతం అదే బాటలో
ఈ నేపథ్యంలో ఇలాంటి ఆటగాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యామని పీసీబీ లీకులు ఇచ్చింది. అయినప్పటికీ పీఎస్‌ఎల్‌ను వీడి ఐపీఎల్‌లో చేరే ఆటగాళ్లు వెనుకడుగు వేయడం లేదు. ఇక ఈ జాబితాలో ఇప్పుడు కామెంటేటర్లు కూడా చేరినట్లు తెలుస్తోంది.
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ నిక్ నైట్ తొలుత పీఎస్‌ఎల్ కామెంట్రీ ప్యానెల్‌లో ఉన్నాడు. తాజాగా అతడి పేరు ఐపీఎల్ కామెంట్రీ ప్యానెల్‌లో దర్శనమిచ్చింది. దీనర్థం ఇప్పుడు కామెంటేటర్లు కూడా పీఎస్‌ఎల్ వీడి ఐపీఎల్‌తో జట్టు కడుతున్నారు.
స్టార్ స్పోర్ట్స్ ఐపీఎల్ కామెంట్రీ ప్యానెల్‌లో భారత దిగ్గజాలు సునిల్ గావస్కర్, రవిశాస్త్రి, వీరేందర్ సెహ్వాగ్, అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్ తదితరులతో కలిసి నిక్ నైట్ వ్యాఖ్యానం చేయనున్నాడు. కాగా మార్చి 26న పీఎస్‌ఎల్ ఆరంభం కాగా.. మార్చి 28న ఐపీఎల్-2026 సీజన్‌కు తెరలేవనుంది.


