ఇషాన్ కిషన్‌కు భారీ షాకిచ్చిన ముంబై ఇండియన్స్‌ అనామకుడు | Mumbai Indians Player Beats Ishan Kishan For Costliest Buy In Jharkhand T20 League Auction, Read Story Inside | Sakshi
Sakshi News home page

ఇషాన్ కిషన్‌కు భారీ షాకిచ్చిన ముంబై ఇండియన్స్‌ అనామకుడు

May 31 2026 1:02 PM | Updated on May 31 2026 3:15 PM

Mumbai Indians Player Beats Ishan Kishan For Costliest Buy In Jharkhand T20 League Auction

ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న స్టార్ వికెట్‌కీపర్ బ్యాటర్ ఇషాన్‌ కిషన్‌కు జార్ఖండ్ టీ20 లీగ్ వేలంలో ఊహించని షాక్ తగిలింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఈ సీజన్‌లో పరుగుల వరద పారించిన ఇషాన్‌ను వెనక్కినెట్టి, ముంబై ఇండియన్స్‌ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ రాబిన్‌ మింజ్‌ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు.

జార్ఖండ్ రాష్ట్ర క్రికెట్ సంఘం నిర్వహించిన తొలి జార్ఖండ్ టీ20 లీగ్ మెగా వేలం మే 30న ఘనంగా జరిగింది. రాంచీ వేదికగా జరిగిన ఈ వేలంలో ఆరు జట్లు పాల్గొన్నాయి. రాంచీ టైటాన్స్‌, జంషెడ్‌పూర్‌ స్టీలర్స్‌, చోటా నాగ్‌పూర్‌ రాయల్స్‌, కోయలాంఛల్‌ సూపర్‌కింగ్స్‌, థన్‌బాద్‌ డైమాండ్స్‌, సంథల్‌ స్ట్రయికర్స్‌ ఫ్రాంచైజీలు తలో రూ.50 లక్షల బడ్జెట్‌తో ఆటగాళ్లను కొనుగోలు చేశాయి.

ఈ వేలంలో రాబిన్ మింజ్‌ను దక్కించుకునేందుకు తీవ్రమైన పోటీ నెలకొంది. చివరకు కోయలాంఛల్ సూపర్ కింగ్స్ అతడిని రూ.15.25 లక్షలకు సొంతం చేసుకుంది. దీంతో టోర్నీ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రాబిన్ మింజ్ రికార్డు సృష్టించాడు.

మరోవైపు ఇషాన్ కిషన్‌ను సంథల్ స్ట్రయికర్స్ రూ.14.70 లక్షలకు కొనుగోలు చేసింది. రాబిన్ మింజ్‌తో పోలిస్తే ఇషాన్ ధర రూ.55 వేల తక్కువగా ఉండటం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

వాస్తవానికి ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026లో ఇషాన్ కిషన్ అద్భుత ఫామ్‌లో కనిపించాడు. 15 ఇన్నింగ్స్‌ల్లో 40.13 సగటు, 182.42 స్ట్రయిక్‌రేట్‌తో 602 పరుగులు చేసి సన్‌రైజర్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు రాబిన్ మింజ్ మాత్రం ముంబై ఇండియన్స్ తరఫున కేవలం రెండే మ్యాచ్‌లు ఆడి ఆరు పరుగులు మాత్రమే చేశాడు.

అయినా, దేశీయ క్రికెట్‌లో రాబిన్ మింజ్‌కు ఉన్న పవర్ హిట్టర్ ఇమేజ్ అతడిని ఇషాన్‌ కంటే ఎక్కువ మొత్తానికి అమ్ముడుపోయేలా చేసింది. ఇషాన్ జాతీయ జట్టు బాధ్యతల కారణంగా టోర్నీలో కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉండటం కూడా వేలంపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.

కాగా, తొలి జార్ఖండ్‌ టీ20 లీగ్‌ జూన్ 10 నుంచి ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో మొత్తం 27 మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్ దశ అనంతరం అగ్ర జట్లు నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి. అయితే టోర్నీ ప్రారంభానికి ముందే ఇషాన్ కిషన్‌ను అధిగమించి రాబిన్ మింజ్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement