
యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం అంతర్జాతీయ టీ20ల్లో చరిత్ర సృష్టించాడు. బంతుల పరంగా అత్యంత వేగంగా 3000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వసీంకు ముందు ఈ రికార్డు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ పేరిట ఉండేది.
బట్లర్ 3000 పరుగులు పూర్తి చేసేందుకు 2068 బంతులు తీసుకోగా.. వసీం కేవలం 1947 బంతుల్లోనే ఈ ల్యాండ్ మార్క్‌ను తాకాడు. ఈ జాబితాలో వసీం, బట్లర్ తర్వాతి స్థానాల్లో ఆరోన్ ఫించ్ (2077), డేవిడ్ వార్నర్ (2113), రోహిత్ శర్మ (2149) ఉన్నారు.
మ్యాచ్‌ల పరంగా చూస్తే.. వసీం మొహమ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్), విరాట్ కోహ్లి (భారత్), బాబర్ ఆజమ్ (పాకిస్తాన్) తర్వాత అత్యంత వేగంగా 3000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ మైలురాయిని చేరుకునేందుకు రిజ్వాన్‌కు 79, విరాట్ కోహ్లికి 81, బాబర్ ఆజమ్‌కు 81 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా.. వసీం తన 84వ ఇన్నింగ్స్‌లో 3000 పరుగుల మైలురాయిని తాకాడు.
ఆసియా కప్-2025లో భాగంగా ఒమన్‌తో ఇవాళ (సెప్టెంబర్ 15) జరుగుతున్న మ్యాచ్‌లో వసీం పై రెండు ఘనతలు సాధించాడు. ఈ మ్యాచ్‌లో వసీం 54 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 69 పరుగులు చేశాడు. వసీంకు జతగా మరో ఓపెనర్ అలీషాన్ షరాఫు (38 బంతుల్లో 51; 7 ఫోర్లు, సిక్స్) కూడా అర్ద సెంచరీతో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.
అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో ఒమన్ తడబడుతుంది. ఆ జట్టు 6.1 ఓవర్ల తర్వాత 4 వికెట్లు కోల్పోయి 48 పరుగులు చేసింది. షా ఫైసల్ (8), ఆర్యన్ బిస్త్ (5) క్రీజ్‌లో ఉన్నారు. ఈ టోర్నీలో యూఏఈ భారత్, పాక్, ఒమన్‌తో కలిసి గ్రూప్-ఏలో ఉంది. కొద్ది రోజుల కింద భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ జట్టు చిత్తుగా ఓడింది.