రిజ్వాన్‌ మెరుపులు వృథా.. ప్రీతి జింటా టీమ్‌ చేతిలో ఓటమి | Mohammad Rizwan's maiden CPL fifty goes in vain as Preity Zinta's team | Sakshi
Sakshi News home page

CPL 2025: రిజ్వాన్‌ మెరుపులు వృథా.. ప్రీతి జింటా టీమ్‌ చేతిలో ఓటమి

Aug 29 2025 1:44 PM | Updated on Aug 29 2025 1:48 PM

Mohammad Rizwan's maiden CPL fifty goes in vain as Preity Zinta's team

పాకిస్తాన్‌ వన్డే కెప్టెన్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ ఎట్టకేలకు తన బ్యాట్‌కు పనిచెప్పాడు. కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2025లో సెయింట్ కిట్స్ అండ్‌ నెవిస్ పేట్రియాట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రిజ్వాన్‌.. గురువారం సెయింట్‌ లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. 

రివర్స్‌ స్వీప్‌ షాట్లు ఆడుతూ పాత రిజ్వాన్‌ను గుర్తు చేశాడు. 41 బంతులు ఎదుర్కొన్న రిజ్వాన్‌.. 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 60 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. రిజ్వాన్‌కు ఇదే తొలి సీపీఎల్‌ హాఫ్‌ సెంచరీ. అతడితో పాటు ఆండ్రీ ఫ్లెచర్‌(37), మైర్స్‌(27), హోల్డర్‌(21) రాణించారు.

దీంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన సెయింట్‌ కిట్స్‌ అండ్‌  నెవిస్ పేట్రియాట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. లూసియా కింగ్స్‌ బౌలర్లలో షమ్సీ రెండు వికెట్లు పడగొట్టగా.. ఛేజ్‌ ఒక్క వికెట్‌ సాధించాడు.

అనంతరం 178 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్‌ కింగ్స్‌ సిస్టర్‌ ఫ్రాంచైజీ అయిన సెయింట్‌ లూసియా కింగ్స్‌ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 17 ఓవర్లలోనే చేధించింది. కింగ్స్‌ బ్యాటర్లలో ఓపెనర్లు టిమ్‌ సీఫర్ట్‌(45 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 68), జాన్సన్‌ చార్లస్‌(17 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 47) విధ్వంసం సృష్టించారు. 

అనంతరం చేజ్‌(15 నాటౌట్‌), టిమ్‌ డేవిడ్‌(16 నాటౌట్‌) మ్యాచ్‌ను ఫినిష్‌ చేశారు. నేవిస్ పేట్రియాట్స్‌ బౌలర్లలో నసీం షా రెండు వికెట్లు పడగొట్టగా.. వకార్ సలాంఖైల్ ఒక్క వికెట్‌ సాధించారు. మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు.

కాగా పేలవ ఫామ్‌ కారణంగా రిజ్వాన్‌ను ఆసియాకప్‌ జట్టునుంచి పాక్‌ సెలక్టర్లు తప్పించారు. అతడితో పాటు స్టార్‌ ప్లేయర్లు బాబర్‌ ఆజం, నసీం షాపై కూడా వేటు వేశారు. దీంతో రిజ్వాన్‌, నసీంలు కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగమయ్యారు.


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement