ఆస్ట్రేలియా స్టార్, ముల్తాన్ సుల్తాన్స్ కెప్టెన్ ఆష్టన్ టర్నర్ పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) నిర్వాహకులపై కౌంటర్ వేశాడు. తమ జట్టులోని సభ్యులంతా ఓ దుప్పటి, దిండు వెంట తెచ్చుకుని ఉంటే బాగుండేందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తీరుపై అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే.. ఐపీఎల్‌తో పోటీపడి చేతులు కాల్చుకుంటున్నా పీసీబీ తీరు మారడం లేదు. ఐపీఎల్‌కు ధీటుగా టోర్నీని నిర్వహించాలనే ఆశతో మ్యాచ్‌లు షెడ్యూల్ చేస్తున్న పీసీబీకి గతంలో చేదు అనుభవాలే మిగిలాయి. క్రేజ్, ప్రసార హక్కుల విషయంలో ఐపీఎల్ అందనంత ఎత్తులో ఉండటం.. పీసీబీకి ప్రతికూల ఫలితాలు ఇచ్చింది.
అయినప్పటికీ ఈసారి కూడా పీసీబీ వెనక్కి తగ్గలేదు. ఐపీఎల్ కంటే రెండు రోజులు ముందుగా.. అనగా మార్చి 26న టోర్నీని ఆరంభించగా.. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల వల్ల కేవలం రెండు వేదికల్లోనే మ్యాచ్‌లు నిర్వహించాల్సిన దుస్థితి. ఇంధన సంక్షోభం, పెరిగిన ధరల భారం ఇందుకు కారణం.
మరోవైపు.. పీఎస్‌ఎల్ షెడ్యూల్ రూపకల్పనలోనూ పీసీబీ దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదు. ముల్తాన్ సుల్తాన్స్ జట్టు ఆదివారం లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో క్వెట్టా గ్లాడియేటర్స్‌తో తలపడింది. ఆ మరుసటి రోజు అంటే సోమవారం.. అదే వేదికపై రావల్పిండిజ్‌తో ముల్తాన్ సుల్తాన్స్ మ్యాచ్‌ను షెడ్యూల్ చేశారు.
ఈ నేపథ్యంలో ముల్తాన్ సుల్తాన్స్ కెప్టెన్ ఆష్టన్ టర్నర్ మాట్లాడుతూ.. ‘‘ఎక్కడికైనా వెళ్లి.. ఓ బ్లాంకెట్, దిండు తెచ్చుకుని ఇక్కడే నిద్రపోతే బాగుండేది. మా షెడ్యూల్ అలా ఉంది మరి’’ అని ఒకింత అసహనం వ్యక్తం చేశాడు. అయితే, తమ జట్టు అద్భుత ప్రదర్శనతో విజయాలు సాధించి అలసటను కాస్త మర్చిపోయిందని ఆష్టన్ టర్నర్ పేర్కొన్నాడు.
కాగా ఆదివారం నాటి మ్యాచ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించిన ముల్తాన్ సుల్తాన్స్.. రావల్పిండిజ్‌పై ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా ఇప్పటికి ఆడిన ఐదు మ్యాచ్‌లలో నాలుగు గెలిచిన టర్నర్ బృందం ఎనిమిది పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది.
చదవండి: అతడి గురించే మా చర్చ.. అస్సలు భయమేలేదు: హార్దిక్ పాండ్యా


