విశ్వ విజేతగా అవతరించిన భారత మహిళా క్రికెట్ జట్టుపై ప్రశంసల వర్షం కొనసాగుతోంది. నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించి ట్రోఫీని ముద్దాడిన హర్మన్ సేన విజయాన్ని భారతావని ఉత్సవంగా జరుపుకొంది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్ (ICC Women's World Cup) టోర్నమెంట్లో.. 2005, 2017లో రన్నరప్‌తోనే సరిపెట్టుకున్న భారత్.. ఈసారి మాత్రం ఆఖరి గండాన్ని అధిగమించింది.
గావస్కర్ వ్యాఖ్యలు వైరల్
నవీ ముంబై వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో సౌతాఫ్రికా (Ind Beat SA)ను 52 పరుగుల తేడాతో ఓడించి.. జగజ్జేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో భారత మహిళా జట్టుపై ప్రశంసలు కురిపిస్తూనే.. టీమిండియా దిగ్గజం, 1983 వరల్డ్‌కప్ విజేత సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
తొలిసారి గ్రూప్ దశ దాటడమే కాకుండా
స్పోర్ట్స్‌స్టార్‌కి రాసిన కాలమ్‌లో.. ‘‘కొంతమంది భారత పురుషుల క్రికెట్ జట్టు వన్డే వరల్డ్‌కప్- 1983 విజయాన్ని.. తాజాగా అమ్మాయిలు చాంపియన్‌గా నిలవడంతో పోలుస్తున్నారు. అయితే, 1983 ఎడిషన్ కంటే ముందు మెన్స్ టీమ్ ఒక్కసారి కూడా గ్రూప్ దశను దాటలేదు.
నాకౌట్‌లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మాకు అప్పుడు అస్సలు తెలియవు. అలాంటిది మేము తొలిసారి గ్రూప్ దశ దాటడమే కాకుండా విజేతలుగా నిలిచాము.
అందుకే అమ్మాయిల విజయాన్ని మాతో పోల్చకండి
అయితే మన మహిళా జట్టు ఇప్పటికే రెండుసార్లు ఫైనల్ ఆడింది. తర్వాత ఇలా అద్భుతమైన విజయంతో విజేతగా నిలిచింది’’ అని గావస్కర్.. తమ విజయాన్ని అమ్మాయిలతో పోల్చవద్దని స్పష్టం చేశాడు.
అదే విధంగా.. ‘‘83లో టీమిండియా సాధించిన విజయం భారత క్రికెట్ రూపురేఖలు మార్చింది. తల్లిదండ్రులు తమ పిల్లల్ని క్రికెట్ వైపు నడిపించేలా చేసింది. ఇక ఐపీఎల్ వచ్చిన తర్వాత భారత క్రికెట్ మరో స్థాయికి చేరుకుంది.
ఇప్పుడు భారత జట్టులో కేవలం మెట్రో నగరాల నుంచి వచ్చినవారే కాకుండా.. దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు’’ అని గావస్కర్ రాసుకొచ్చాడు. కాగా నవీ ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా సౌతాఫ్రికాతో ఫైనల్లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది.
సమిష్టి కృషితో
ఓపెనర్లు స్మృతి మంధాన (45), షఫాలి వర్మ (87) గట్టి పునాది వేయగా.. ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (58), వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ (34) ఇన్నింగ్స్ నిర్మించారు. జెమీమా రోడ్రిగ్స్ (24), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (20) స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయారు. అయితే, మంధాన, షఫాలి దీప్తి, రిచా రాణించడంతో భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 298 పరుగులు స్కోరు చేసింది.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికాకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. దీప్తి శర్మ ఐదు వికెట్లతో చెలరేగి ప్రొటిస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. షఫాలి వర్మ రెండు, నల్లపురెడ్డి శ్రీ చరణి ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. సఫారీ జట్టులో ఓపెనర్, కెప్టెన్ లారా వొల్వర్ట్ (101) శతకంతో పోరాడగా.. మిగతా వారి నుంచి ఆమెకు సహకారం అందలేదు.
మరో ఓపెనర్ తజ్మిన్ బ్రిట్స్ (23), సూనే లూస్ (25) అనిరె డెర్క్‌సెన (35) ఓ మోస్తరుగా రాణించారు. అయితే, భారత బౌలర్ల విజృంభణ ముందు నిలవలేకపోయిన సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో కేవలం 246 పరుగులే చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా 52 పరుగుల తేడాతో గెలిచిన భారత్.. సరికొత్త చాంపియన్‌గా అవతరించింది.
చదవండి: అందుకే అర్ష్‌దీప్‌ను తప్పించాం.. అతడికి అన్నీ తెలుసు: టీమిండియా కోచ్


