
టీ20లకు, టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా దిగ్గజ బ్యాటర్లు, కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇకపై వన్డేల్లో మాత్రమే కనిపిస్తారు. ఈ ఇద్దరు 2027 ప్రపంచకప్ వరకు ఆడి 50 ఓవర్ల ఫార్మాట్ నుంచి కూడా తప్పుకుంటారని తెలుస్తుంది. అయితే ఈ మధ్యలో రోహిత్, కోహ్లి భారత్ తరఫున ఎన్ని వన్డేలు ఆడతారని క్రికెట్ అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు.
ఫ్యూచర్ టూర్ ప్రోగ్రాం ప్రకారం భారత్ 2027 వన్డే వరల్డ్‌కప్ వరకు 9 సిరీస్‌ల్లో 8 మంది ప్రత్యర్థులపై 27 మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఐపీఎల్-2025తో బిజీగా ఉన్న భారత ఆటగాళ్లు క్యాష్ రిచ్ లీగ్ ముగిసిన వెంటనే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరతారు.
అక్కడ ఆగస్ట్ వరకు 4 వరకు గడపనున్న భారత్.. అదే నెల 17వ తేదీ నుండి బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. ఇక్కడి నుండి టీమిండియా వన్డే క్రికెట్ షెడ్యూల్ మొదలుకానుంది.
బంగ్లాదేశ్ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు ఆడనుంది. రోహిత్, కోహ్లి ఈ సిరీస్‌లో చెలరేగే అవకాశం ఉంది. బంగ్లాదేశ్‌లో స్పిన్ ఫ్రెండ్లీ పిచ్‌లు ఉండటంతో రోకోను ఆపడం బంగ్లా బౌలర్లకు పెద్ద సవాలే అవుతుంది.
అనంతరం భారత్ అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు (5 టీ20లు కూడా ఆడుతుంది) ఆడనుంది.
ఈ ఏడాది చివర్లో టీమిండియా స్వదేశంలో సౌతాఫ్రికాతో ఆల్ ఫార్మాట్ సిరీస్‌లు ఆడనుంది. ఈ పర్యటనలో సౌతాఫ్రికా టీమిండియాతో రెండు టెస్ట్‌లు, 5 టీ20లు సహా మూడు వన్డేలు ఆడనుంది.
వచ్చే ఏడాది (2026) జనవరిలో భారత్ స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు వన్డేల్లో తలపడనుంది. ఈ సిరీస్‌లో కూడా విరాట్, రోహిత్ తమదైన మార్కును చూపించే అవకాశం ఉంది.
అనంతరం చాలా గ్యాప్ తర్వాత జూన్‌లో భారత్ స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడనుంది. ఈ పర్యటనలో ఆఫ్ఘన్లు టీమిండియాతో మూడు వన్డేలు ఆడనున్నారు. స్వదేశంలో ఆడబోయే సిరీస్ కావడంతో ఈ సిరీస్‌లో కూడా రోకో చెలరేగే అవకాశం ఉంది.
జూలైలో భారత్ ఇంగ్లండ్‌లో పర్యటించి మూడు వన్డేలు ఆడనుంది. ఈ పర్యటనలో రోహిత్, కోహ్లి సవాళ్లు ఎదుర్కొనే అవకాశం ఉంది.
సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో భారత్ స్వదేశంలో వెస్టిండీస్‌తో మూడు వన్డేలు ఆడనుంది.
అక్టోబర్, నవంబర్ మాసాల్లో టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు ఆడనుంది.
డిసెంబర్‌లో భారత్ స్వదేశంలో శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడుతుంది.
దీని తర్వాత భారత్ 2027లో సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమిచ్చే వన్డే వరల్డ్‌కప్‌లో పాల్గొంటుంది. ఈ మెగా టోర్నీ రోహిత్-కోహ్లిల జమానాకు చివరిదయ్యే అవకాశం ఉంది. ఈ మధ్యలో ఏవైనా వ్యక్తిగత ఇబ్బందులు ఎదురైతే తప్ప రోహిత్, కోహ్లి దాదాపుగా అన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. దిగ్గజాలు వన్డే వరల్డ్‌కప్‌తో తమ క్రికెట్ ప్రస్తానాన్ని ముగిస్తారేమో చూడాలి.