
కెప్టెన్‌గా టీమిండియాకు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఘనత రోహిత్ శర్మ (Rohit Sharma) సొంతం. 2024లో టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్‌ను చాంపియన్‌గా నిలిపిన హిట్‌మ్యాన్.. 2025లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ రూపంలో మరో టైటిల్ సాధించాడు.
అంతర్జాతీయ టీ20లకు, టెస్టులకు రిటైర్మెంట్
తద్వారా మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni- 3) తర్వాత భారత్‌కు అత్యధిక ఐసీసీ టైటిళ్లు అందించిన సారథిగా రోహిత్ చరిత్రకెక్కాడు. ఇక 2024లో వరల్డ్‌కప్ ట్రోఫీ గెలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ.. ఇటీవలే టెస్టులకు కూడా గుడ్‌బై చెప్పాడు.
ప్రస్తుతం వన్డేల్లో కెప్టెన్ కొనసాగుతున్న 38 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కాగా పదిహేనేళ్లకు పైగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న రోహిత్ శర్మ గురించి టీమిండియా యువ పేసర్ ఖలీల్ అహ్మద్ (Khaleel Ahmed) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
రోహిత్ శర్మ ఇంకో పదేళ్లు క్రికెట్ ఆడాలి
‘‘భారత క్రికెట్ మంచి కోసం రోహిత్ శర్మ ఇంకో పదేళ్లు క్రికెట్ ఆడాలి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. 2019లో మేము రాజ్‌కోట్ వేదికగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ఆడుతున్నపుడు.. నేను సరిగ్గా బౌల్ చేయలేకపోయాను. కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీయగలిగాను.
అప్పుడు డ్రెసింగ్‌రూమ్‌లో రోహిత్ భయ్యా నాతో ప్రత్యేకంగా మాట్లాడాడు. జట్టులోని సభ్యులంతా వెళ్లిపోయిన తర్వాత.. నా దగ్గరికి వచ్చి.. నేనెలా ఆడాలో చెప్పాడు. నాలో ఉన్న నైపుణ్యాల గురించి నాకంటే ఎవరికీ ఎక్కువగా తెలియదని.. నా సామర్థ్యాలను నేనే బయపెట్టాలని చెప్పాడు.

ఇలాంటి కెప్టెన్లు అరుదు
మేము స్టేడియం వీడి వెళ్తున్నపుడు అభిమానులంతా రోహిత్ భయ్యాను చూసి సంతోషంతో కేకలు వేస్తుంటే.. ‘ఏదో ఒకరోజు నీకు కూడా ఇలాంటి ఆనందకర సమయం వస్తుంది’ అని నాతో అన్నాడు. ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండాలని చెప్పాడు.
ఇలాంటి కెప్టెన్లు అరుదు. ప్రతి మ్యాచ్ తర్వాత భాయ్ నాతో మాట్లాడుతూ.. నా తప్పొప్పులను ఓపికగా వివరించాడు. ఇంత మంచి మనసు ఉన్నవాళ్లు కూడా ఇక్కడ ఉంటారా? అనిపించింది. రిషభ్ పంత్‌తో కూడా భయ్యా ఇలాగే ఉంటాడు.
పూర్తి ఫిట్‌గా
వ్యక్తిగా, కెప్టెన్‌గా ఆయనకు ఆయనే సాటి. నిజంగా ఆరోజు రోహిత్ భయ్యా స్థానంలో వేరే వాళ్లుంటే అంత ఓపికగా నాతో మాట్లాడేవారే కాదు. ఈ మధ్య జాతీయ క్రికెట్ అకాడమీలో భయ్యాను కలిశాను. ఆయన పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. నిజంగా ఇలాంటి కెప్టెన్లు టీమిండియాకు అవసరం. ఆయన ఇంకో పదేళ్లు ఆడితే బాగుంటుంది’’ అని ఖలీల్ అహ్మద్ రెవ్‌స్పోర్ట్స్‌తో పేర్కొన్నాడు.
రోహిత్ కెప్టెన్సీలో అరంగేట్రం
కాగా 2018లో మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు నాటి కెప్టెన్ విరాట్ కోహ్లి విశ్రాంతి తీసుకోగా.. అతడి స్థానంలో రోహిత్ శర్మ ఆసియా వన్డే కప్ టోర్నీలో టీమిండియా సారథిగా వ్యవహరించాడు.
అప్పుడే ఖలీల్ అహ్మద్ టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 11 వన్డేలు, 18 టీ20లు ఆడిన ఖలీల్ అహ్మద్.. ఆయా ఫార్మాట్లలో 15, 16 వికెట్లు తీశాడు. ఈ లెఫ్టార్మ్ పేసర్ గతేడాది చివరగా టీమిండియాకు ఆడాడు.
చదవండి: అవకాశం రాకుంటే.. నేనూ యూఎస్‌కు వెళ్లిపోయేవాడిని: టీమిండియా స్టార్