Ranji Trophy 2022: రంజీలో సెంచరీ బాదిన క్రీడా మం‍త్రి.. సెమీఫైనల్‌కు బెంగాల్‌

Manoj Tiwary Scores Century Ranji Trophy 2022 Bengal Enters Semi Final - Sakshi

రంజీట్రోపీ 2022లో భాగంగా బెంగాల్‌, జార్ఖండ్‌ల మధ్య జరిగిన క్వారర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ శుక్రవారం డ్రాగా ముగిసింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించిన బెంగాల్‌ జట్టు సెమీఫైనల్లో అడుగుపెట్టింది. జూన్‌ 14-18 మధ్య జరగనున్న తొలి సెమీఫైనల్లో బెంగాల్‌, మధ్యప్రదేశ్‌లు అమితుమీ తేల్చుకోనున్నాయి. మరో సెమీఫైనల్లో ముంబై, ఉత్తర్‌ ప్రదేశ్‌ తలపడనున్నాయి.

కాగా ఆటకు శుక్రవారం ఆఖరి రోజు కాగా.. ఫలితం వచ్చేలా కనబడకపోవడంతో గంట ముందుగానే మ్యాచ్‌ను నిలిపివేశారు. ఇక ఆట ముగిసే సమయానికి బెంగాల్‌ రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. టీమిండియా క్రికెటర్‌.. బెంగాల్‌ క్రీడా మంత్రి మనోజ్‌ తివారి సూపర్‌ సెంచరీతో మెరిశాడు.129 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన బెంగాల్‌ను మనోజ్‌ తివారి తన ఇన్నింగ్స్‌తో నిలబెట్టాడు. 152 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్‌ సహాయంతో సెంచరీ మార్క్‌ అందుకున్నాడు. అభిషేక్‌ పోరెల్‌(34) పరుగులతో కలిసి ఐదో వికెట్‌కు అమూల్యమైన 92 పరుగులు జోడించాడు.

ఆ తర్వాత షాబాజ్‌ అహ్మద్‌(46 పరుగులు)తో కలిసి ఆరో వికెట్‌కు 96 పరుగులు జోడించాడు. ఓవరాల్‌గా మనోజ్‌ తివారి 185 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్సర్లతో 136 పరుగులు చేశాడు. అంతకముందు బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌ను 773 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేయగా.. జార్ఖండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 298 పరుగులకే కుప్పకూలింది. దీంతో బెంగాల్‌కు 475 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించినట్లయింది.

చదవండి: రంజీ చరిత్రలో ముంబై అతిపెద్ద విజయం.. ప్రపంచ రికార్డు బద్దలు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top