ఎల్‌ఎస్‌జీపై భారీ ట్రోలింగ్‌ | LSG: 22 players and 29 coaches still finished at the bottom of IPL 2026 | Sakshi
Sakshi News home page

ఎల్‌ఎస్‌జీపై భారీ ట్రోలింగ్‌

May 25 2026 7:19 PM | Updated on May 25 2026 7:33 PM

LSG: 22 players and 29 coaches still finished at the bottom of IPL 2026

ఐపీఎల్‌ 2026లో దారుణమైన ప్రదర్శన చేసి పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో నిలిచిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టు సోషల్‌మీడియా వేదికగా భారీ ట్రోలింగ్‌ను ఎదుర్కొంటుంది. ఈ సీజన్‌కు ముందు భారీ కొనుగోళ్లు చేసి ఈసారైనా టైటిల్‌ సాధించాలని పట్టుదలగా ఉండిన ఆ జట్టుకు మరోసారి చుక్కెదురైంది. జట్టు నిండా స్టార్ ప్లేయర్లు, జంబో కోచింగ్‌ బృందం ఉన్నా ఆ జట్టు ఏమీ సాధించలేకపోయింది. 14 మ్యాచ్‌ల్లో ఆ జట్టు గెలిచింది కేవలం నాలుగు మాత్రమే.

ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ (రూ. 27 కోట్లు) సహా విధ్వంసకర వీరుడిగా పేరున్న నికోలస్‌ పూరన్‌ (రూ. 21 కోట్లు), ఇంకా చాలా మంది ఖరీదైన ఆటగాళ్లు పూర్తిగా చేతులెత్తేశారు. ఆటగాళ్లలాగే కోచింగ్‌ బృందం కూడా అత్యంత ఖరీదైన స్టార్లతో నిండి ఉన్నా సాధించింది సున్నా.    కోట్లు కుమ్మరించి స్టార్లను అక్కున చేర్చుకున్నా, అత్యంత దారుణమైన ప్రదర్శన చేసిన లక్నోపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు, వ్యంగ్య వ్యాఖ్యలు వెల్లువెత్తాయి.

22 మంది ఖరీదైన స్టార్‌ ఆటగాళ్లు, 29 మంది ఖరీదైన స్టార్‌ కోచ్‌లు ఉన్నా,  పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో నిలిచింది అనే వ్యంగ్యాస్త్రంతో నెటిజన్లు ఎల్‌ఎస్‌జీని ట్రోల్‌ చేస్తున్నారు. ఈ జట్టు ఓనర్‌ సంజీవ్‌ గొయెంకా ఇలాంటి జట్టుపై కోట్టు కుమ్మరించి నిలువునా మునిగిపోయాడంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు పొగరుబోతైన గొయెంకాకు ఇలా జరగాల్సిందేనంటూ చరకలంటిస్తున్నారు.

వాస్తవానికి గొయెంకా సీజన్‌ ప్రారంభానికి ముందు భారీ ప్రక్షాళన చేశాడు. ఆటగాళ్ల రిటెన్షన్, కొత్త కొనుగోళ్లు, కోచింగ్ స్టాఫ్‌లో మార్పులు జట్టును బలంగా మారుస్తాయని  భావించాడు. ముఖ్యంగా మిడిలార్డర్‌ను బలోపేతం చేయడం, డెత్ ఓవర్ బౌలింగ్ మెరుగుపరచడం వంటి లక్ష్యాలతో జట్టు నిర్మాణం జరిగింది. అయితే ఈ మార్పులు సత్ఫలితాలు ఇవ్వలేకపోయాయి.

సీజన్ మొత్తం చూస్తే ఈ జట్టు ప్రధాన సమస్య స్థిరత్వం లేకపోవడం. ఓ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన బ్యాటింగ్ యూనిట్, తదుపరి మ్యాచ్‌లోనే పూర్తిగా విఫలమవడం తరచూ కనిపించింది. బౌలింగ్ విభాగం కీలక సందర్భాల్లో నియంత్రణ కోల్పోయింది. పవర్‌ప్లేలో వికెట్లు తీయలేకపోవడం, డెత్ ఓవర్లలో ఎక్కువ పరుగులు ఇవ్వడం జట్టును ఒత్తిడిలోకి నెట్టింది.

కెప్టెన్సీ నిర్ణయాలు కూడా చర్చనీయాంశంగా మారాయి. కీలక సమయాల్లో బౌలింగ్ మార్పులు, ఫీల్డ్ సెట్టింగ్స్ వంటి వ్యూహాత్మక నిర్ణయాలు ఫలితాన్ని మార్చలేకపోయాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. తరచుగా ప్లేయింగ్ XIలో మార్పులు చేయడం కూడా జట్టు సమతుల్యతను దెబ్బతీసిందని విమర్శలు వచ్చాయి. మొత్తంగా ఈ సీజన్‌లో ఎల్‌ఎస్‌జీ దారుణ వైఫల్యాలకు అందరూ కారణమయ్యారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement