వీరంగం​ సృష్టించిన లివింగ్‌స్టోన్‌ | Livingstone Slams 85 Runs In 45 Balls In T20 Blast Quarter Final, Check Out Video And Match Highlights Inside | Sakshi
Sakshi News home page

వీరంగం​ సృష్టించిన లివింగ్‌స్టోన్‌

Sep 7 2025 10:14 AM | Updated on Sep 7 2025 10:39 AM

Livingstone Slams 85 Runs In 45 Balls In T20 Blast Quarter Final

టీ20 బ్లాస్ట్‌ 2025లో భాగంగా కెంట్‌తో నిన్న (సెప్టెంబర్‌ 6) జరిగిన మూడో క్వార్టర్‌ ఫైనల్లో లాంకాషైర్‌ ఆటగాడు లియామ్‌ లివింగ్‌స్టోన్‌ వీరంగం సృష్టించాడు.  తొలుత బౌలింగ్‌లో రాణించి (4-0-21-2), ఆతర్వాత బ్యాటింగ్‌లో (45 బంతుల్లో 85 నాటౌట్‌; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) చెలరేగిపోయాడు. లివింగ్‌స్టోన్‌ విధ్వంసం ధాటి​కి కెంట్‌ నిర్దేశించిన 154 పరుగుల సాధారణ లక్ష్యాన్ని లాంకాషైర్‌ మరో 9 బంతులు మిగిలుండగానే ఛేదించింది.

ఇటీవలికాలంలో లివింగ్‌స్టోన్‌ పెద్ద మ్యాచ్‌లనగానే చెలరేగిపోతున్నాడు. ఇంగ్లండ్‌ మెగా టీ20 టోర్నీ అయిన టీ20 బ్లాస్ట్‌లోనూ ఇదే జరిగింది. క్వార్టర్‌ ఫైనల్లో బంతితో, బ్యాట్‌తో సత్తా చాటిన లివింగ్‌స్టోన్‌ తన జట్టును ఒంటిచేత్తో సెమీఫైనల్‌కు చేర్చాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన కెంట్‌ 20 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేసి 153 పరుగులకు ఆలౌటైంది. లాంకాషైర్‌ బౌలర్లు కలిసికట్టుగా రాణించి కెంట్‌ను తక్కువ స్కోర్‌కే పరిమితం చేశారు. లూక్‌ వుడ్‌ 3, లివింగ్‌స్టోన్‌, థామస్‌ అస్పిన్‌వాల్‌ చెరో 2, జేమ్స్‌ ఆండర్సన్‌, బ్లాథర్‌విక్‌, టామ్‌ హార్ట్లీ తలో వికెట్‌ తీసి కెంట్‌ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. 

కెంట్‌ తరఫున 28 పరుగులు చేసిన జో డెన్లీ టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. జాక్‌ క్రాలే (27), జోయ్‌ ఎవిసన్‌ (27), స్టీవర్ట్‌ (25) 20కి పైగా పరుగులు చేశారు. ఇటీవలే హండ్రెడ్‌ లీగ్‌లో ఓవల్‌ ఇన్విన్సిబుల్స్‌ను ఛాంపియన్‌గా నిలిపిన సామ్‌ బిల్లింగ్స్‌ (కెంట్‌ కెప్టెన్‌) 2 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.

అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో లాం​కాషైర్‌ ఆదిలో తడబడినప్పటికీ (31 పరుగులకే 3 వికెట్లు).. లివింగ్‌స్టోన్‌ ఇన్నింగ్స్‌ కారణంగా ఆతర్వాత గెలుపు తీరాలు దాటింది. లివింగ్‌స్టోన్‌ సింగిల్‌ హ్యాండ్‌తో ఆ జట్టును గెలిపించాడు. అతనికి ఆస్టన్‌ టర్నర్‌ (22), మైఖేల్‌ జోన్స్‌ (28) సహకరించారు. ఓ పక్క వికెట్లు పడుతున్నా లివింగ్‌స్టోన్‌ తన బ్యాట్‌కు పని పెట్టి, టెయిలెండర్ల సాయంతో లాంకాషైర్‌ను విజయతీరాలు దాటించాడు. 

కెంట్‌ బౌలర్లలో ఫ్రెడ్‌ క్లాసెన్‌ (4-0-14-3), జోయ్‌ ఎవిసన్‌ (4-0-21-1) అద్బుతంగా బౌలింగ్‌ చేశారు. వీరిద్దరు ఓ దశలో లాంకాషైర్‌ చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకునేలా కనిపించారు. అయితే లివింగ్‌స్టోన్‌ తన జోరును ఏమాత్రం తగ్గించకుండా బ్యాటింగ్‌ చేసి లాంకాషైర్‌ను గెలిపించాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement