భారత క్రికెట్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మాజీ సహచరుడు (కర్ణాటక) ఎస్‌ఎల్ అక్షయ్ గుండెపోటుతో కన్నుమూశాడు. 39 ఏళ్ల అక్షయ్ బెంగళూరులో స్థానిక డివిజన్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఛాతినొప్పితో కుప్పకూలగా.. ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు.
ఈ విషాద ఘటన మే 24న బెంగళూరులోని కేఆర్‌పురం ప్రాంతంలో జరిగింది. మూడో డివిజన్ క్రికెట్ మ్యాచ్‌లో పాల్గొంటున్న అక్షయ్‌కు మధ్యాహ్నం సమయంలో తీవ్ర అస్వస్థత కలిగింది. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా.. మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఆస్పత్రి వైద్యులు అక్షయ్ మరణించినట్లు నిర్ధారించారు.
అక్షయ్ మృతిపై కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అక్షయ్ కర్ణాటక తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో విశిష్ట సేవలు అందించాడు. ఆటగాడిగా మాత్రమే కాదు.. యువ క్రికెటర్లకు కోచ్‌గా కూడా వ్యవహరించాడు. అతడి సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి అని KSCA తమ ప్రకటనలో పేర్కొంది.
1987 ఏప్రిల్ 30న జన్మించిన అక్షయ్ 2011-12 సీజన్‌లో రంజీ అరంగేట్రం చేశాడు. ఆ సమయంలోనే కేఎల్ రాహుల్, రాబిన్ ఉతప్ప, వినయ్ కుమార్ వంటి ప్రముఖులతో కలిసి కర్ణాటక జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. కుడిచేతి ఫాస్ట్‌బౌలర్‌గా గుర్తింపు పొందిన అక్షయ్.. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 10 ఇన్నింగ్స్‌ల్లో 18 వికెట్లు తీశాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో 6 వికెట్లు, టీ20ల్లో 8 వికెట్లు సాధించాడు.
దీర్ఘకాలం ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో కొనసాగలేకపోయిన అక్షయ్.. రెండు, మూడు డివిజన్ లీగ్‌ల్లో ఆడుతూ కెరీర్‌ను కొనసాగించాడు. చివరివరకు ఆటను వదలకుండా స్థానిక క్రికెట్‌లో కొనసాగుతుండగానే ఈ విషాదం చోటు చేసుకుంది.
ఇటీవలికాలంలో యువ క్రీడాకారులు గుండెపోటులతో మరణించడం ఆందోళన కలిగిస్తోంది. ఫిబ్రవరిలో మహారాష్ట్రకు చెందిన 40 ఏళ్ల క్రికెటర్ ప్రవీణ్ బాబన్ పవార్ కూడా మ్యాచ్ ఆడుతుండగానే గుండెపోటుతో మరణించాడు.
అలాగే బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ కూడా 2025లో ఢాకా ప్రీమియర్ లీగ్ మ్యాచ్ సందర్భంగా గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే.
అక్షయ్ మృతి వార్తతో కర్ణాటక క్రికెట్ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మాజీ సహచరులు, అభిమానులు సోషల్‌మీడియా ద్వారా సంతాపం తెలుపుతున్నారు.


