వెంకీ మామతో ముచ్చట!.. అతడిపై కావ్యా మారన్‌ ఫైర్‌! | Kavya Maran Reaction After Krunal Pandya Bowls Bouncer Goes Viral | Sakshi
Sakshi News home page

వెంకీ మామతో ముచ్చట!.. అతడిపై కావ్యా మారన్‌ ఫైర్‌!

May 23 2026 3:15 PM | Updated on May 23 2026 4:28 PM

Kavya Maran Reaction After Krunal Pandya Bowls Bouncer Goes Viral

సొంతగడ్డపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తమ ఆధిపత్యాన్ని కొనసాగించింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీపై)పై గెలుపుతో లీగ్‌ దశను ముగించింది. ఐపీఎల్‌-2026లో ఉప్పల్‌ స్టేడియంలో ఆడిన ఏడు మ్యాచ్‌లలో సన్‌రైజర్స్‌కు ఇది ఐదో విజయం కావడం విశేషం.

రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఈ పోరులో సన్‌రైజర్స్‌ 55 పరుగుల తేడాతో ఆర్సీబీని చిత్తు చేసింది. అయితే, టాప్‌-2లో వెళ్లాలన్న సన్‌రైజర్స్‌ ఆశయం మాత్రం నెరవేరలేదు. ఆర్సీబీ, గుజరాత్‌ టైటాన్స్‌లతో సమంగా 18 పాయింట్లు సాధించినప్పటికీ.. నెట్‌రన్‌రేటు పరంగా వెనుకబడింది. దీంతో మూడో స్థానంతో సరిపెట్టుకుంది.

ఆరెంజ్‌ ఆర్మీ దిల్‌ ఖుష్‌
ఏదేమైనా సొంతమైదానంలో సన్‌రైజర్స్‌ వరుస గెలుపుల నేపథ్యంలో ఆరెంజ్‌ ఆర్మీ మస్త్‌ ఖుషీ అయింది. జట్టు యజమాని కావ్యా మారన్‌ సైతం సంతోషం వ్యక్తం చేశారు. 

అయితే, సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ఆమె పలికించిన హావభావాలు వైరల్‌గా మారాయి. ఉప్పల్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది.

మూడు హాఫ్‌ సెంచరీలు
‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఇషాన్‌ కిషన్‌ (46 బంతుల్లో 79; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), అభిషేక్‌ శర్మ (22 బంతుల్లో 56; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), హెన్రిచ్‌ క్లాసెన్‌ (24 బంతుల్లో 51; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధసెంచరీలు సాధించారు. కిషన్, క్లాసెన్‌ మూడో వికెట్‌కు 48 బంతుల్లోనే 113 పరుగులు జోడించారు.

అనంతరం బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 200 పరుగులు చేసి ఓడింది. కెప్టెన్‌‌ రజత్‌ పాటీదార్‌ (39 బంతుల్లో 56; 6 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్‌ సెంచరీ చేయగా... వెంకటేశ్‌ అయ్యర్‌ (19 బంతుల్లో 44; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), కృనాల్‌ పాండ్యా (31 బంతుల్లో 41 నాటౌట్‌; 5 ఫోర్లు) రాణించారు.  

ఇదేం బౌలింగ్‌?.. ఇది చకింగ్‌ కదా?
అయితే, సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ సమయంలో ఆర్సీబీ స్టార్‌ కృనాల్‌ పాండ్యా బంతితో రంగంలోకి దిగిన సమయంలో కావ్యా మారన్‌ తీవ్ర అసహనానికి లోనయ్యారు. కృనాల్‌ బౌలింగ్‌ చేస్తున్నపుడు.. పక్కన ఉన్న టాలీవుడ్‌ సీనియర్‌ హీరో వెంకటేశ్‌తో.. ‘‘ఇదేం బౌలింగ్‌?.. ఇది చకింగ్‌ కదా?’’ అన్నట్లుగా కావ్యా ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చారు.

కృనాల్‌ బౌలింగ్‌ చేయకుండా.. కేవలం బంతిని విసురుతున్నాడన్నట్లుగా కావ్యా అభినయించి మరీ చూపించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 

కాగా కృనాల్‌ సైడ్‌  ఆర్మ్‌ యాక్షన్‌, బౌన్సర్లతో ఈ సీజన్లో బ్యాటర్లను బాగా ఇబ్బంది పెట్టాడు. ఇక.. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో కృనాల్‌ రెండు ఓవర్లు బౌలింగ్‌ చేసి 24 పరుగులు ఇచ్చి.. హెన్రిచ్‌ క్లాసెన్‌ (24 బంతుల్లో 51) రూపంలో కీలక వికెట్‌ దక్కించుకున్నాడు.

చదవండి: పక్కా ప్లాన్‌తోనే.. ఓడినా సన్‌రైజర్స్‌ను దెబ్బకొట్టిన ఆర్సీబీ!

Advertisement
 
Advertisement
Advertisement