ఫ్యాబ్‌-4: ఇద్ద‌రు పోయారు.. మ‌రో ఇద్ద‌రు మిగిలారు! | Kane Williamson-Kohli-Retires Fab-4 Becomes Fab-2 Modern-Test Cricket | Sakshi
Sakshi News home page

ఫ్యాబ్‌-4: ఇద్ద‌రు పోయారు.. మ‌రో ఇద్ద‌రు మిగిలారు!

Jun 12 2026 7:39 PM | Updated on Jun 12 2026 8:06 PM

Kane Williamson-Kohli-Retires Fab-4 Becomes Fab-2 Modern-Test Cricket

న్యూజిలాండ్ స్టార్ క్రికెట‌ర్ కేన్ విలియ‌మ్స‌న్ అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌ల‌క‌డం క్రికెట్ అభిమానులకు ఆశ్చ‌ర్యం క‌లిగించింది. అయితే కివీస్ క్రికెట‌ర్ల‌లో అత్యుత్త‌మ క్రికెట‌ర్‌గా పేరు పొందిన కేన్ విలియ‌మ్స‌న్ దాదాపు రెండు ద‌శాబ్దాల పాటు బ్లాక్‌క్యాప్స్ బ్యాటింగ్ లైన‌ప్‌కు వెన్నుముక‌లా నిలిచాడు. వివాద‌ర‌హితుడిగా పేరున్న విలియ‌మ్స‌న్ నిష్ర‌మ‌ణ స‌గ‌టు అభిమానిని బాధించే అంశం. 

అయితే టెస్టు క్రికెట్‌లో విరాట్ కోహ్లీ (టీమిండియా), జో రూట్ (ఇంగ్లండ్‌), స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా), కేన్ విలియమ్స‌న్ (న్యూజిలాండ్‌)ల‌ను 2014లో దివంగ‌త క్రికెట‌ర్ మార్టిన్ క్రో ముద్దుగా ఫ్యాబ్‌-4 అని అభివ‌ర్ణించారు. ఈ త‌రంలో ఈ న‌లుగురు అత్యంత గొప్ప టెస్టు క్రికెట‌ర్ల‌ని ఆయ‌న కొనియాడారు. అందుకు త‌గ్గ‌ట్లే ఈ ఫ్యాబ్‌-4 త‌మ ఆట‌తో అభిమానుల మ‌న‌సులు దోచుకున్నారు. 

అయితే ఫ్యాబ్‌-4 క్ర‌మంగా కూలిపోతోంది. తాజాగా విలియ‌మ్స‌న్ రిటైర్మెంట్‌తో ఈ ఫ్యాబ్‌-4 కాస్తా ఇప్పుడు ఫ్యాబ్‌-2గా మారిపోయింది. ఇప్ప‌టికే కోహ్లీ టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్ప‌గా, తాజాగా కేన్ మామ అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికాడు. మిగిలిన ఇద్ద‌రు క్రికెట‌ర్లు జో రూట్‌, స్టీవ్ స్మిత్ కూడా మ‌హా అయితే మ‌రో రెండేళ్లు ఆడే అవ‌కాశ‌ముంది. వీళ్లిద్ద‌రూ కూడా రిటైరైతే ఫ్యాబ్‌-4 క‌థ కంచికి చేరనుంది.

ఇక 16 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో మైలురాళ్ల‌ను అందుకున్న కేన్ విలియ‌మ్స‌న్ న్యూజిలాండ్ త‌ర‌ఫున 110 టెస్టులు, 175 వ‌న్డేలు, 91 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లు క‌లిపి 378 మ్యాచ్‌లాడిన కేన్ విలియ‌మ్స‌న్ 19,346 ప‌రుగులు సాధించాడు. ఇక కెప్టెన్‌గా కేన్ మామ కివీస్ త‌ర‌ఫున 40 టెస్టులు, 91 వ‌న్డేలు, 75 టీ20ల‌కు సార‌థ్యం వ‌హించాడు. 

కేన్ విలియ‌మ్స‌న్ సార‌థ్యంలో న్యూజిలాండ్ 2021 ఐసీసీ  టెస్టు చాంపియ‌న్‌షిప్ గెలుచుకుంది. అత‌డి సార‌థ్యంలోనే 2015 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌తో పాటు 2021 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఫైన‌ల్ చేరిన‌ప్ప‌టికీ, ర‌న్న‌ర‌ప్‌తోనే స‌రిపెట్టుకుంది.

చదవండి: జ‌స్పాల్ రాణా మృతి వెనుక అసలు కారణమిదే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement