గుజ‌రాత్ కొంప‌ముంచిన రబాడ.. లేదంటే నేరుగా ఫైనల్‌కే? | Kagiso Rabada puts down an easy catch of Rajat Patidar | Sakshi
Sakshi News home page

IPL 2026: గుజ‌రాత్ కొంప‌ముంచిన రబాడ.. లేదంటే నేరుగా ఫైనల్‌కే?

May 27 2026 1:05 PM | Updated on May 27 2026 1:18 PM

Kagiso Rabada puts down an easy catch of Rajat Patidar

ఐపీఎల్‌-2026లో భాగంగా ధర్మశాల వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన క్వాలిఫయర్‌-1లో 92 ప‌రుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఘోర ఓటమి చవిచూసింది. ఈ కీల‌క మ్యాచ్‌లో గుజ‌రాత్ బౌలింగ్‌, బ్యాటింగ్‌, ఫీల్డింగ్ మూడు విభాగాల్లోనూ విఫ‌ల‌మైంది. ముఖ్యంగా గుజ‌రాత్ ఓట‌మికి ఆ జ‌ట్టు స్టార్ పేస‌ర్ క‌గిసో ర‌బాడ ప‌రోక్షంగా కార‌ణ‌మ‌య్యాడు.

ర‌బాడ బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. బౌలింగ్‌లో రెండు వికెట్లు ప‌డ‌గొట్టిన‌ప్ప‌టికి త‌న నాలుగు ఓవ‌ర్ల కోటాలో ఏకంగా 54 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. ఫీల్డింగ్‌లో అయితే ర‌బాడ వ‌దిలిన క్యాచ్ మ్యాచ్ స్వ‌రూపాన్నే మార్చేసింది. గుజ‌రాత్ ఓట‌మిని శాసించిన ఆర్సీబీ కెప్టెన్ రజ‌త్ పాటిదార్‌ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను రబాడ జార‌విడిచాడు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి మంచి ఆరంభం ల‌భించింది.  విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్ దూకుడుగా ఆడ‌డంతో ఆర్సీబీ స్కోర్‌ పవర్‌ప్లేలోనే 76/1కు చేరింది. ప‌వ‌ర్‌ప్లే త‌ర్వాత గుజ‌రాత్ బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేసి మ్యాచ్‌ను తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. ముఖ్యంగా 9 ఓవ‌ర్ వేసిన జాస‌న్ హోల్డ‌ర్  కేవలం మూడు బంతుల వ్యవధిలో కోహ్లీ (43), పడిక్కల్ (30) ఇద్దరినీ అవుట్ చేసి ఆర్సీబీకి గట్టి షాక్ ఇచ్చాడు. ఆ త‌ర్వాత కుల్వంత్ ఖేజ్రోలియా, ర‌షీద్ ఖాన్ చక్క‌గా బౌలింగ్ చేయ‌డంతో ఆర్సీబీ స్కోర్ బోర్డు వేగం నెమ్మ‌దించింది.

దీంతో 13 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్‌ 128/3గా ఉండేది. అయితే సరిగ్గా ఇదే సమయంలో రబాడ చేసిన తప్పిదం గుజరాత్‌ టైటాన్స్‌ కొంపముంచింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌ 14 ఓవర్‌ వేసిన ప్రసిద్ద్‌ కృష్ణ బౌలింగ్‌లో మూడో బంతిని పాటిదార్‌ ఫుల్‌షాట్‌ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ షాట్‌ సరిగ్గా కనక్ట్‌ కాకపోవడంతో బంతి డీప్‌ స్క్వేర్ లెగ్‌ దిశగా గాల్లోకి లేచింది. 

అయితే  డీప్ స్క్వేర్ లెగ్‌లో ఉన్న రబాడ సులువైన క్యాచ్‌ను నేలపాలు చేశాడు. ఇందుకు గుజరాత్‌ టైటాన్స్‌ భారీ మూల్యం చెల్లించుకుంది. 20 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న పాటిదార్‌ ఆ తర్వాత విధ్వంసం సృష్టించాడు. కేవలం 33 బంతుల్లో 9 సిక్సర్లు, 5 ఫోర్లతో 93 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

అతడి సునామీ ఇన్నింగ్స్‌ ధాటికి ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 254 పరుగుల స్కోర్‌ నమోదు చేసింది. అనంతరం ఈ భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌ 19.3 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. మే 29న ఛండీఘర్‌ వేదికగా జరగనున్న క్వాలిఫయర్‌-2లో ఎస్‌ఆర్‌హెచ్‌ లేదా రాజస్తాన్‌ రాయల్స్‌తో గుజరాత్‌ తలపడనుంది.
చదవండి: ఇప్పట్లో అతడిని టెస్టులకు ఎంపిక చేయొద్దు: గంగూలీ

Advertisement
 
Advertisement
Advertisement