అత‌డు ల‌క్కీ హ్యాండ్‌.. ఆ జ‌ట్టుదే ఐపీఎల్ టైటిల్‌! | Josh Hazlewood Luck Hand For RCB Played 5-T20 Finals-Never Lost | Sakshi
Sakshi News home page

అత‌డు ల‌క్కీ హ్యాండ్‌.. ఆ జ‌ట్టుదే ఐపీఎల్ టైటిల్‌!

May 30 2026 5:46 PM | Updated on May 30 2026 6:32 PM

Josh Hazlewood Luck Hand For RCB Played 5-T20 Finals-Never Lost

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఆర్సీబీ మ‌రోసారి చాంపియ‌న్‌గా నిల‌వ‌డానికి మ‌రో అడుగు దూరంలో ఉంది. ఆదివారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న మెగాటోర్నీ ఫైన‌ల్లో గుజ‌రాత్ టైటాన్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఈ సీజ‌న్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌పై ఆర్సీబీ ఆధిక్యంలో ఉంది. లీగ్ ద‌శలో చెరో మ్యాచ్ గెలిచిన‌ప్ప‌టికీ, క్వాలిఫ‌య‌ర్‌-1 పోరులో గుజ‌రాత్‌ను 92 ప‌రుగుల భారీ తేడాతో ఓడించి 2-1తో ఆధిక్యంలో నిలిచింది. 

అయితే ఈ సీజ‌న్‌లో ఆర్సీబీ విజేతగా నిల‌వనున్నట్లు, అందుకు జోష్ హాజిల్‌వుడ్ కార‌ణం కానున్న‌ట్లు ఒక వార్త చ‌క్క‌ర్లు కొడుతుంది. ఇప్ప‌టివ‌ర‌కు హాజిల్‌వుడ్ ఐదు టీ20 టోర్నీ ఫైన‌ల్స్ ఆడితే.. ప్ర‌తీసారి తాను ప్రాతినిధ్యం వ‌హించిన జ‌ట్టే చాంపియ‌న్‌గా నిలిచింది. ఐపీఎల్ 2021లో చెన్నై సూప‌ర్‌కింగ్స్ విజేతగా నిలిచింది. ఆ జ‌ట్టులో హాజిల్‌వుడ్ ఉన్నాడు. 

2012లో చాంపియ‌న్స్ లీగ్ టీ20 టోర్నీలో విజేత‌గా నిలిచిన సిడ్నీ సిక్స‌ర్‌కు, 2019 బీబీఎల్ విజేత సిడ్నీ సిక్స‌ర్స్‌, 2021 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ సాధించిన ఆస్ట్రేలియా జ‌ట్టు, 2021 ఐపీఎల్ సీజ‌న్ విజేత‌గా నిలిచిన సీఎస్‌కే, 2025 ఐపీఎల్ సీజ‌న్ విజేత‌గా నిలిచిన‌ ఆర్సీబీ జ‌ట్టులో హాజిల్‌వుడ్ స‌భ్యుడిగా ఉన్నాడు. అంతేకాదు 2015, 2023 వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్ గెలిచిన ఆస్ట్రేలియా జ‌ట్టులోనూ హాజిల్‌వుడ్ స‌భ్యుడిగా ఉండ‌డం విశేషం. 

దీంతో హాజిల్‌వుడ్ ల‌క్కీ హ్యాండ్ అని.. అత‌ను ఏ జ‌ట్టులో ఉంటే ఆ జ‌ట్టు చాంపియ‌న్‌గా నిలుస్తుంద‌ని అభిమానులు ఫ‌న్నీ కామెంట్లు చేస్తున్నారు. అత‌డు ల‌క్కీహ్యాండ్ మాత్ర‌మే కాదు, తాను ఆడిన ఐదు ఫైనల్స్‌లోనూ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. ఆడిన ఐదు ఫైన‌ల్స్‌ కలిపి 10 వికెట్లు ప‌డ‌గొట్టాడు. 

2021 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఫైనల్‌తో పాటు 2012 చాంపియ‌న్స్ లీగ్ టీ20 ఫైన‌ల్లో మూడు వికెట్లు తీసి బెస్ట్ ప్ర‌ద‌ర్శ‌న న‌మోదు చేశాడు. అయితే ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో ఆర్సీబీ చాంపియ‌న్‌గా నిల‌వ‌డంలో హాజిల్‌వుడ్ కీల‌క‌పాత్ర పోషించాడు. ఆ సీజ‌న్‌లో 12 ఇన్నింగ్స్‌ల్లో 22 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అయితే ఈ సీజ‌న్‌లో 12 ఇన్నింగ్స్‌ల్లో కేవ‌లం 13 వికెట్లు మాత్ర‌మే ప‌డ‌గొట్టాడు. అయితే భువ‌నేశ్వ‌ర్‌, ర‌సిక్ స‌లామ్‌లు రాణిస్తుండ‌డంతో హాజిల్‌వుడ్‌కు పెద్ద‌గా ఇబ్బంది ఎదుర్కోవ‌డం లేదు.

చదవండి: ‘ఈసారి హిట్‌ వికెటవ్వను.. విరుగుడు మంత్రమదే!’

Advertisement
 
Advertisement
Advertisement