RR సంచలనం.. రూ. 15 వేల కోట్లకు సొంతం! | IPL Franchise Rajasthan Royals Sold Rs 15000 Cr Huge Deal: Report | Sakshi
Sakshi News home page

RR సంచలనం.. రూ. 15 వేల కోట్లకు సొంతం!

Mar 24 2026 5:32 PM | Updated on Mar 24 2026 6:47 PM

IPL Franchise Rajasthan Royals Sold Rs 15000 Cr Huge Deal: Report

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) చరిత్రలో సరికొత్త సంచలనం.. ఆరంభ సీజన్‌-2008 విజేత రాజస్తాన్‌ రాయల్స్‌ (RR) రికార్డు ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం. రాజస్తాన్‌ ఫ్రాంఛైజీని అమెరికాకు చెందిన వ్యాపారవేత్త కల్‌ సోమాని నేతృత్వంలోని కన్సార్టియం సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

రూ. 15 వేల కోట్లకు సొంతం!
జాతీయ మీడియా కథనాల ప్రకారం.. దాదాపు 1.63 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల (భారత కరెన్సీలో సుమారుగా రూ. 15 వేల కోట్లు) మొత్తానికి ఈ కన్సార్టియం రాయల్స్‌ను కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికా వ్యాపారవేత్తలు.. వాల్‌మార్ట్‌ కుటుంబానికి చెందిన రాబ్‌ వాల్టన్‌, హ్యాంప్‌ కుటుంబం సోమానితో కలిసి ఈ డీల్‌లో భాగమైనట్లు తెలుస్తోంది.

ఐపీఎల్‌-2026 ముగిసిన తర్వాత పూర్తిస్థాయిలో రాజస్తాన్‌ రాయల్స్‌ యాజమాన్య మార్పు జరుగనున్నట్లు సమాచారం. కాగా మనోజ్‌ బదాలే సారథ్యంలోని ఎమర్జింగ్‌ మీడియా వెంచర్స్‌ రాజస్తాన్‌ రాయల్స్‌కు యజమానిగా ఉంది. రెడ్‌బర్డ్‌ క్యాపిటల్‌ పార్ట్‌నర్స్‌, లాచ్‌లాన్‌ ముర్దోచ్‌ తదితర సంస్థలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి.

అయితే, ఫ్రాంఛైజీని అమ్మేయాలని గతేడాది యాజమాన్యం నిర్ణయానికి రాగా.. ఆదిత్య బిర్లా గ్రూప్‌, అమెరికాకు చెందిన స్పోర్ట్స్‌ ఇన్వెస్టర్‌ డేవిడ్‌ బిల్ట్జర్‌ రాయల్స్‌ను కొనేందుకు పోటీపడ్డారు. అయితే, ఆఖరికి ఇది సోమాని నేతృత్వంలోని కన్సార్టియానికి సొంతమైనట్లు తెలుస్తోంది.

ఎవరీ కల్‌ సోమానీ?
ఎడ్‌ టెక్‌, కృత్రిమ మేధ, క్రీడా సాంకేతికత, సమాచార గోప్యత తదితర రంగాల్లో పదిహేనేళ్లకు పైగా అనుభవం ఉన్న అమెరికాకు చెందిన వ్యాపారవేత్త. అరిజోనాలోని సర్వీస్‌ సంస్థలు ఇంట్రాఎడ్జ్‌, ట్రూయో వంటి సంస్థలను సోమానీ స్థాపించినట్లు సమాచారం. 2021లోనే అతడు రాజస్తాన్‌ రాయల్స్‌లో పెట్టుబడి పెట్టాడు. ఇప్పుడు కన్సార్టియంతో కలిసి ఏకంగా ఫ్రాంఛైజీని సొంతం చేసుకున్నట్లు సమాచారం.

కాగా తాజాగా యాజమాన్యం మార్పు నేపథ్యంలో ఐపీఎల్‌ చరిత్రలో రాజస్తాన్‌ రాయల్స్‌ అత్యంత ఖరీదైన ఫ్రాంఛైజీగా నిలిచింది. అయితే, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ఈ రికార్డును బద్దలు కొట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆర్సీబీని కూడా అమ్మకానికి పెట్టగా.. దాదాపు రెండు బిలియన్ల యూఎస్‌ డాలర్లకు అమ్ముడయ్యే అవకాశాలు ఉన్నాయని వ్యాపార వర్గాల్లో చర్చ నడుస్తోంది.

చదవండి: అతడు టీమిండియాలో చోటుకు అర్హుడు: భారత స్పిన్‌ దిగ్గజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement