’అతడు టీమిండియాలో అరంగేట్రానికి అర్హుడు’ | He actually deserves India call up: R Ashwin huge statement on PBKS Star | Sakshi
Sakshi News home page

అతడు టీమిండియాలో చోటుకు అర్హుడు: భారత స్పిన్‌ దిగ్గజం

Mar 24 2026 4:19 PM | Updated on Mar 24 2026 5:09 PM

He actually deserves India call up: R Ashwin huge statement on PBKS Star

ఆరంభ సీజన్‌ 2008 నుంచి ఐపీఎల్‌ టైటిల్‌ కోసం ఎదురుచూస్తున్న జట్లలో పంజాబ్‌ కింగ్స్‌ ఒకటి. అత్యుత్తమంగా 2014లో తొలిసారి ఫైనల్‌ చేరిన ఈ జట్టు.. సుదీర్ఘ విరామం తర్వాత గతేడాది మరోసారి టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. అయితే, ఆర్సీబీ చేతిలో ఆరు పరుగుల స్వల్ప తేడాతో ఓడి చాంపియన్‌గా నిలిచే సువర్ణావకాశాన్ని చేజార్చుకుంది.

మరోవైపు.. ఆర్సీబీ తొలిసారి ట్రోఫీని ముద్దాడి తమ ఖాతాలో తొలి టైటిల్‌ జమచేసుకుంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2026లో పంజాబ్‌ మార్చి 31న తమ తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడనుంది.

పటిష్టంగా మిడిలార్డర్‌
ఈ నేపథ్యంలో పంజాబ్‌ కింగ్స్‌ మిడిలార్డర్‌ గురించి టీమిండియా స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌, శశాంక్‌ సింగ్‌, నేహాల్‌ వధేరాలతో పంజాబ్‌ మిడిలార్డర్‌ పటిష్టంగా ఉందన్నాడు. వీరిలో శశాంక్‌ సింగ్‌ టీమిండియాలో చోటుకు అర్హుడని పేర్కొన్నాడు.

టీమిండియాలో అరంగేట్రానికి అతడు అర్హుడు
‘‘పంజాబ్‌ కింగ్స్‌ బ్యాటింగ్‌ విభాగంలో శశాంక్‌ సింగ్‌ కూడా ముఖ్య ఆటగాడు. కానీ అతడి గురించి అంతగా చర్చ జరగడం లేదు. నిజానికి టీమిండియాలో అరంగేట్రానికి అతడు అర్హుడు. ఎన్నోసార్లు అద్భుతమైన ప్రదర్శనలు కనబరిచాడు.

PC: PBKS
పంజాబ్‌ కింగ్స్‌ అతడిని ఎంచుకుని మంచి పనిచేసింది. రిటెన్షన్‌ జాబితాలో కూడా అతడు ఉన్నాడు. అతడు మంచి ఫినిషర్‌. శ్రేయస్‌ అయ్యర్‌, నేహాల్‌ వధేరాలతో కలిసి మిడిలార్డర్‌ను పటిష్టంగా మార్చాడు. పంజాబ్‌ కింగ్స్‌ ఈ ముగ్గురు ప్రధాన బలం’’ అని అశూ అభిప్రాయపడ్డాడు.

ముగ్గురూ ముగ్గురే
కాగా శశాంక్‌ సింగ్‌ గతేడాది 17 మ్యాచ్‌లలో కలిపి 350 పరుగులు చేయగా.. నేహాల్‌ వధేరా 16 మ్యాచ్‌లలో భాగమై 369 పరుగులు సాధించాడు. ఇక కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ 17 మ్యాచ్‌లలో కలిపి ఏకంగా 604 పరుగులతో దుమ్ములేపాడు. తొలి ప్రయత్నంలోనే పంజాబ్‌ కెప్టెన్‌గా జట్టును ఫైనల్‌కు చేర్చి సత్తా చాటాడు.

ఫామ్‌లేమి.. మరేం పర్లేదు
ఇదిలా ఉంటే.. శశాంక్‌ సింగ్‌ ఇటీవల ముగిసిన దేశీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో తీవ్రంగా నిరాశపరిచాడు. 34 ఏళ్ల ఈ ఛత్తీస్‌గఢ్‌ ఆటగాడు ఏడు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 101 పరుగులే చేశాడు. అయితే, హెడ్‌కోచ్‌ రిక్కీ పాంటింగ్‌ మార్గదర్శనంలో శశాంక్‌ ఐపీఎల్‌-2026లో ఫామ్‌ అందుకుని.. అదరగొట్టగలడని అశూ ధీమా వ్యక్తం చేశాడు.

చదవండి: IPL 2026: ఎస్ఆర్‌హెచ్ జ‌ట్టులోకి 300 వికెట్ల వీరుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement