యశ్ దయాళ్ (PC: BCCI)
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు కీలక ప్రకటన చేసింది. తమ పేసర్ యశ్ దయాళ్ ఐపీఎల్-2026లో పాల్గొనడం లేదని తెలిపింది. వ్యక్తిగత కారణాల వల్ల అతడిని పక్కనపెట్టామని.. అయితే, కాంట్రాక్టు మాత్రం కొనసాగిస్తామని వెల్లడించింది.
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆర్సీబీ తొలిసారి గతేడాది ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన విషయం తెలిసిందే. ఇందులో యశ్ దయాళ్ (Yash Dayal) కూడా తన వంతు పాత్ర పోషించాడు. సీజన్ మొత్తం కలిపి 13 వికెట్లతో రాణించి జట్టును చాంపియన్‌గా నిలపడంలో తోడ్పడ్డాడు.
సంచలన ఆరోపణలు
అయితే, అనూహ్య రీతిలో యశ్ దయాళ్‌పై సంచలన ఆరోపణలు వచ్చాయి. ఘజియాబాద్‌లోని ఇందిరాపురం పోలీస్ స్టేషన్‌లో గతేడాది జూలైలో అతడిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఐదేళ్లు తనతో రిలేషన్‌షిప్‌లో ఉండి.. పెళ్లి పేరిట మోసం చేశాడని ఓ అమ్మాయి ఫిర్యాదు చేసింది. శారీరకంగా, మానసికంగా తనను హింసించాడని.. లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది.
పోక్సో కేసు కూడా
ఆ తర్వాత ఓ టీనేజర్ తెరమీదకు వచ్చింది. 2023 నుంచి తనపై యశ్ దయాళ్ లైంగిక దాడికి పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేయగా.. పోక్సో చట్టం కింద జైపూర్‌లో మరో కేసు నమోదైంది. ఐపీఎల్-2025 సందర్భంగానూ హోటల్ గదిలో దయాళ్ తనపై అత్యాచారానికి ఒడిగట్టాడని సదరు టీనేజర్ ఆరోపించింది. క్రికెట్‌లో తనకు కెరీర్ ఆశ చూపి ఇలా చేశాడని వాపోయింది.
అయితే, మొదటి కేసులో అలహాబాద్ హైకోర్టు యశ్ దయాళ్ అరెస్టు కాకుండా స్టే విధించగా.. రెండోకేసులో జైపూర్‌లోని పోక్సో కోర్టు యాంటిసిపేటరీ బెయిల్‌ను 2025 డిసెంబరులో తిరస్కరించింది. ఇందుకు సంబంధించి విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఇటీవలే యశ్ దయాళ్ ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ను పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
అతడిని ఈ సీజన్‌లో ఆడించము.. కానీ
కాగా యశ్ దయాళ్‌ను కొనసాగించడంపై ఆర్సీబీపై విమర్శలు రాగా.. ఆర్సీబీ క్రికెట్ డైరెక్టర్ మొ బొబాట్ తాజాగా స్పందించాడు. ‘‘యశ్ దయాళ్ ఈసారి జట్టుతో చేరడం లేదు. వ్యక్తిగతంగా అతడు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటి వరకు మేము అతడికి మద్దతుగానే నిలబడ్డాము.
అతడిపై నమ్మకం ఉంది కాబట్టే రిటైన్ చేసుకున్నాము. అతడి కాంట్రాక్టు కొనసాగుతుంది. అతడితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నాము. ఈరోజు కూడా అతడిని సంప్రదించిన తర్వాతే జట్టుతో చేర్చకూడదనే నిర్ణయానికి వచ్చాము.
అతడితో పాటు జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాము. అతడికి మా మద్దతు ఉంటుంది’’ అని మొ బొబాట్ పేర్కొన్నాడు. కాగా మార్చి 28న ఐపీఎల్-2026 టోర్నీకి తెరలేవనుండగా.. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ- సన్‌రైజర్స్ తలపడతాయి. ఇందుకు చిన్నస్వామి స్టేడియం వేదిక.


