చెలరేగిన బౌలర్లు.. ఢిల్లీని చిత్తుగా ఓడించిన ఆర్సీబీ | IPL 2026: RCB beat DC by 9 Wickets | Sakshi
Sakshi News home page

చెలరేగిన బౌలర్లు.. ఢిల్లీని చిత్తుగా ఓడించిన ఆర్సీబీ

Apr 27 2026 10:05 PM | Updated on Apr 27 2026 10:05 PM

IPL 2026: RCB beat DC by 9 Wickets

ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 27) జరిగిన 39వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ.. ఆర్సీబీ పేసర్లు భువనేశ్వర్‌ కుమార్‌ (3-0-5-3), హాజిల్‌వుడ్‌ (3.3-0-12-4) చెలరేగడంతో 75 పరుగులకే కుప్పకూలింది. భువీ, హాజిల్‌కు రసిక్‌ (2-0-21-1), సుయాశ్‌ (4-1-7-1), కృనాల్‌ (2-0-9-1) తోడవడంతో ఢిల్లీ బ్యాటింగ్‌ లైనప్‌ పేకమేడలా కూలింది.

ఢిల్లీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగిందంటే అభిషేక్‌ పోరెల్‌ (30) పుణ్యమే. అతనితో పాటు డేవిడ్‌ మిల్లర్‌ (19), జేమీసన్‌ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా బ్యాటర్లలో సాహిల్ పరాఖ్‌, సమీర్‌ రిజ్వి, అక్షర్‌ పటేల్‌ డకౌట్లు కాగా.. కేఎల్‌ రాహుల్‌, నితీశ్‌ రాణా తలో పరుగు చేశారు. స్టబ్స్‌ 5, కుల్దీప్‌ 3 పరుగులు చేశారు.

అనంతరం ఢిల్లీ నిర్దేశించిన 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆర్సీబీ 6.3 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి ఊదేసింది. 20 పరుగులు చేసి జేకబ్‌ బేతెల్‌ ఔట్‌ కాగా.. పడిక్కల్‌ (34 నాటౌట్‌), విరాట్‌ కోహ్లి (23 నాటౌట్‌) ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు.బేతెల్‌ వికెట్‌ జేమీసన్‌కు దక్కింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement