ఐపీఎల్-2025 విజేత ఆర్సీబీ (PC: BCCI)
పద్దెమినిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గతేడాది తొలి ఐపీఎల్ టైటిల్ సాధించింది. ఆద్యంతం మెరుగైన ప్రదర్శన కనబరిచిన పాటిదార్ బృందం.. ఫైనల్లో పంజాబ్ కింగ్స్‌పై ఆరు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి చిరకాల కోరిక నెరవేర్చుకుంది.
రెండూ గెలిచింది
ఇక ఇదే జోరులో ఐపీఎల్-2026ను విజయంతో ఆరంభించిన ఆర్సీబీ.. ఇప్పటికి ఆడిన రెండు మ్యాచ్‌లలో రెండూ గెలిచింది. ఈ నేపథ్యంలో భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఆర్సీబీ.. ఈసారి కూడా విజేతగా నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని అభిప్రాయపడింది.
ANIతో మాట్లాడుతూ.. ‘‘ఆర్సీబీ కచ్చితంగా టైటిల్ నిలబెట్టుకోగలదు. గతంలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఈ పని చేశాయి. ఆర్సీబీ కూడా అదే బాటలో పయనిస్తోంది. ఈసారి కూడా నిలకడైన ఆటతో ముందుకు సాగుతోంది.
మరోసారి విజేతగా
ప్లే ఆఫ్స్ చేరడం వారి తొలి లక్ష్యం. అన్ని జట్లు ఇందుకోసం కృషి చేస్తాయి. ఈసారి కొత్త చాంపియన్ రావడం కాస్త కష్టమే. అయితే, ఆర్సీబీ మాత్రం కచ్చితంగా మరోసారి విజేతగా నిలిచే అవకాశాలను కొట్టిపారేయలేము. ఈసారి కూడా ఆ జట్టు కూర్పు ఎంతో బాగుంది’’ అని అంజుమ్ చోప్రా అభిప్రాయపడింది.
అదే విధంగా పంజాబ్ కింగ్స్ జట్టు కూడా బాగుందని.. వారికి కూడా గెలుపు అవకాశాలు ఉన్నాయని అంజుమ్ చోప్రా పేర్కొంది. కాగా పంజాబ్ ఈ సీజన్‌లో మూడు మ్యాచ్‌లు ఆడి రెండింట గెలవగా.. ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దైపోయింది.
చదవండి: చారిత్రక ద్వైపాక్షిక సిరీస్‌ను ప్రకటించిన పాకిస్తాన్


