ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (మే 10) రాత్రి జరిగిన రసవత్తర మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఆర్సీబీ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలను సుగమనం చేసుకోగా.. ముంబై ఇండియన్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. అలాగే మరో జట్టు కూడా పోటీ నుంచి వైదొలిగింది. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే చేతిలో చిత్తైన లక్నో సూపర్ జెయింట్స్ ముంబై ఇండియన్స్‌తో పాటు ఇంటికెళ్లింది. ఈ లెక్కన ఆర్సీబీ ఒకే దెబ్బతో రెండు జట్లను ఔట్ చేసింది.
ఎంఐ, లక్నో నిష్క్రమణతో ఇక ప్లే ఆఫ్స్ రేసులో 8 జట్లు మిగిలి ఉన్నాయి. వీటిలో నాలుగు మాత్రమే ప్లే ఆఫ్స్‌కు చేరతాయి. ప్రస్తుతం టాప్-3లో ఉన్న ఆర్సీబీ (14 పాయింట్లు), ఎస్‌ఆర్‌హెచ్ (14), గుజరాత్ (14) ఆడాల్సిన 3 మ్యాచ్‌ల్లో తలో మ్యాచ్ గెలిచినా నాకౌట్ బెర్త్‌లు ఖరారయ్యే అవకాశం ఉంది.
నాలుగో స్థానంలో ఉన్న పంజాబ్ ఇంకా 4 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. టాప్-3 జట్లతో పాటు ఈ జట్టుకు కూడా ప్లే ఆఫ్స్ అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. ఐదు, ఆరు స్థానాల్లో ఉన్న సీఎస్‌కే (12), రాజస్థాన్ (12) తలో 3 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
ఈ జట్లు నాకౌట్ బెర్త్‌లు దక్కించుకోవాలంటే కనీసం రెండు మ్యాచ్‌లైనా గెలవాలి. అప్పుడు కూడా ప్రస్తుతం టాప్-4లో ఉన్న జట్ల జయాపజయాలపై వీటి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ప్లే ఆఫ్స్ రేసులో మినుకుమినుమనే అవకాశాలు కలిగిన చివరి రెండు జట్లు కేకేఆర్ (9), ఢిల్లీ (8).
ఈ రెండు జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరడం దాదాపుగా అసాధ్యం. అయితే టెక్నికల్‌గా అవకాశాలు లేకపోలేదు. కేకేఆర్ తమ చివరి 4 మ్యాచ్‌ల్లో అన్నీ గెలిస్తే ప్లే ఆఫ్స్ అవకాశం ఉంటుంది. అలాగే డీసీ కూడా వారి చివరి 3 మ్యాచ్‌ల్లో తప్పక గెలవాలి. ఇలా జరిగితే ఈ రెండు జట్లకు కూడా ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉంటాయి.
ఓవరాల్‌గా చూస్తే.. పోటీ ప్రధానంగా ప్రస్తుతం టాప్-4లో ఉన్న నాలుగు జట్ల మధ్యే ఉంది. ఏదైనా అనూహ్యం జరిగితే సీఎస్‌కే, రాజస్థాన్ కూడా లైన్‌లోకి వస్తాయి. అద్భుతం జరిగితే కేకేఆర్, డీసీ కూడా రేసులో ఉంటాయి.
ఇవాళ మరో జట్టు భవిష్యత్తు కూడా తేలిపోతుంది. పంజాబ్ చేతిలో ఓడితే డీసీ కూడా ఇంటిముఖం పడుతుంది. అప్పుడు రేసులో ఏడు జట్లు మాత్రమే మిగిలి ఉంటాయి. ఏది జరిగినా ఆశ్చర్యపోవాల్సి అవసరం లేదు. ఎందుకంటే పోటీ చాలా రసవత్తరంగా ఉంది.
ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న జట్లు ఆడాల్సిన మిగిలిన మ్యాచ్‌లు..
ఆర్సీబీ- కేకేఆర్ (మే 13), పంజాబ్ (17), ఎస్‌ఆర్‌హెచ్ (22)
ఎస్‌ఆర్‌హెచ్- గుజరాత్ (12), సీఎస్‌కే (18), ఆర్సీబీ (22)
గుజరాత్- ఎస్‌ఆర్‌హెచ్ (12), కేకేఆర్ (16), సీఎస్‌కే (21)
పంజాబ్- డీసీ (11), ముంబై (14), ఆర్సీబీ (17), లక్నో (23)
సీఎస్‌కే- లక్నో (15), ఎస్‌ఆర్‌హెచ్ (18), గుజరాత్ (21)
రాజస్థాన్- డీసీ (17), లక్నో (19), ముంబై (24)
కేకేఆర్- ఆర్సీబీ (13), గుజరాత్ (16), ముంబై (20), డీసీ (24)
డీసీ- పంజాబ్ (11), రాజస్థాన్ (17), కేకేఆర్ (24)


