వైభవ్ సూర్యవంశీ.. గతేడాది కాలంగా భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉన్న పేరు. దేశీ క్రికెట్, భారత్ అండర్-19 జట్టు తరఫున అదరగొట్టిన ఈ బిహారీ పిల్లాడు.. ఐపీఎల్-2026లోనూ సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు.
గతేడాది రాజస్తాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. గుజరాత్ టైటాన్స్‌పై 35 బంతుల్లోనే శతక్కొట్టాడు. తద్వారా ఐపీఎల్‌లో అత్యంత పిన్న వయసు (14 ఏళ్లు)లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.
ఆ తర్వాత ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా గడ్డపై ఫార్మాట్లకు అతీతంగా రాణించిన వైభవ్.. అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్లోనూ దుమ్ములేపాడు. కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు సాధించి భారత్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
36 బంతుల్లోనే శతకం
ఇక తాజాగా ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ తరఫున మరోసారి అదరగొడుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఇటీవల సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 36 బంతుల్లోనే శతకం సాధించాడు. తాజాగా మంగళవారం నాటి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై కేవలం 16 బంతుల్లోనే 43 పరుగులతో విధ్వంసం సృష్టించాడు.
ఆరెంజ్ క్యాప్
తద్వారా ఈ సీజన్‌లో ఇప్పటికి ఆడిన తొమ్మిది ఇన్నింగ్స్‌లో కలిపి 400 పరుగులు పూర్తి చేసుకున్నాడు వైభవ్. తద్వారా అత్యధిక పరుగుల వీరులకు ఇచ్చే ఆరెంజ్ క్యాప్ చేతులు మారి ఈ లెఫ్టాండర్‌కు చేరింది. దీంతో మరోసారి వైభవ్ సూర్యవంశీపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
The quicker they come, quicker they go off his bat! 👊💥 🎥 Vaibhav Sooryavanshi with another big blitz today 👏 Updates ▶️ https://t.co/fBbdVnF5Fx#TATAIPL | #KhelBindaas | #PBKSvRR pic.twitter.com/7UV22dKxHr — IndianPremierLeague (@IPL) April 28, 2026
అదే సమయంలో కొంతమంది ‘అభిమానుల’ ముసుగులో వైభవ్ సూర్యవంశీని తిట్టిపోయడం ఆశ్చర్యం కలిగించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో... టీమ్ బస్సులో వెళ్తున్న సమయంలో వైభవ్ ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ వింటున్నట్లు కనిపిస్తోంది.
విద్వేష విషం
ఆ సమయంలో కొంతమంది బస్సు బయట నిల్చుని వైభవ్‌ను ఫొటోలు, వీడియోలు తీయాలని అత్యుత్సాహం ప్రదర్శించారు. అయితే, వైభవ్ మాత్రం వారి వైపు చూడకుండా తన పనిలో తాను మునిగిపోయాడు. దీంతో.. ‘‘చాలా ఎక్కువైంది. ఒక్కసారైనా చూడవచ్చు కదా! ఇంత ఓవరాక్షన్ ఎందుకు?’’ అంటూ వైభవ్‌పై విద్వేష విషం చిమ్మారు.
Shameless how grown men are mocking a 15-year-old for 'attitude.' He’s just a kid trying to process the pressure of being a professional athlete. Let him breathe.💔 pic.twitter.com/HrDY6uY33D
— CSK Xtra (@Im_Kushall) April 28, 2026
సిగ్గులేకుండా..
అయితే, ఈ వీడియో చూసిన నెటిజన్లు వైభవ్ సూర్యవంశీకి మద్దతుగా నిలుస్తూ.. అక్కడున్న వాళ్లపై మండిపడుతున్నారు. ‘‘సిగ్గులేకుండా పదిహేనేళ్ల పిల్లాడిపై ఈ ‘పెద్ద మనుషులు’ విషం చిమ్ముతున్నారు. ఆటిట్యూడ్ చూపిస్తున్నాడంటూ పిల్లాడిని ఆడిపోసుకుంటూ వెక్కిరిస్తున్నారు.
ప్రపంచంలోనే భారీ క్రేజ్ ఉన్న ఐపీఎల్‌లో ఈ పిల్లాడు ఆడుతున్నాడు. వరల్డ్‌క్లాస్ బౌలర్లను ఎదుర్కొంటూ చితక్కొడుతున్నాడు. ఆ ఒత్తిడిని తగ్గించుకునే క్రమంలో కాస్త సేద తీరితే.. తమవైపు చూడలేదంటూ ఇంతకు దిగజారుతారా? మీకిదో వ్యసనంగా మారింది. పాపం పిల్లాడిని కాస్త ఊపిరిపీల్చుకోనివ్వండి’’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


