
శ్రీలంక విధ్వంసకర బ్యాటర్ కుసాల్ మెండిస్ పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025కు మధ్యలోనే గుడ్ బై చెప్పాడు. ఆ లీగ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న మెండిస్.. బట్లర్‌కు ప్రత్యామ్నాయంగా గుజరాత్ టైటాన్స్ నుంచి ఆఫర్ రావడంతో ఐపీఎల్‌కు వచ్చేశాడు. మెండిస్ నిన్ననే గుజరాత్ జట్టులో చేరిపోయాడు.
ఐపీఎల్‌లాగే పాకిస్తాన్ సూపర్ లీగ్ కూడా వాయిదా అనంతరం మే 17 నుంచి ప్రారంభం కానుంది. ఆ లీగ్‌లో కూడా ఐపీఎల్‌లాగే విదేశీ ఆటగాళ్లు స్వదేశాలకు వెళ్లిపోయారు. ఐపీఎల్‌లో దాదాపుగా అందరు విదేశీ ఆటగాళ్లు లీగ్ పునఃప్రారంభానికి అందుబాటులోకి వస్తుంటే.. పీఎస్‌ఎల్‌లో మాత్రం విదేశీ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు.
మెండిస్‌కు ముందు ఆస్ట్రేలియా బ్యాటర్ మిచెల్ ఓవెన్ కూడా పీఎస్‌ఎల్‌కు గుడ్ బై చెప్పి ఐపీఎల్‌లో చేరిపోయాడు. మిచెల్ ఓవెన్‌ను పంజాబ్ కింగ్స్ మ్యాక్స్‌వెల్‌కు ప్రత్యామ్నాయంగా ఎంపిక చేసుకుంది. ఓవెన్, మెండిస్ ఇద్దరూ పీఎస్‌ఎల్‌తో ఒప్పందం ఉన్నప్పటికీ దాన్ని తెంచుకుని ఐపీఎల్ పంచన చేరాడు. భద్రతా కారణాల వల్ల పీఎస్‌ఎల్‌లో ఆడలేనని మెండిస్ తాజాగా స్పష్టం చేశాడు.
అంతకుముందే ఓవెన్ తనకు ఐపీఎల్ ఆఫరే ముఖ్యమని పీఎస్‌ఎల్‌కు తేల్చి చెప్పాడు. వీరిద్దరిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చర్చలు తీసుకునే అవకాశం ఉంది. ఐపీఎల్ ప్రారంభానికి ముందు మరో విదేశీ ఆటగాడు కార్బిన్ బాష్ కూడా పీఎస్‌ఎల్‌కు హ్యాండిచ్చి ముంబై ఇండియన్స్‌లో చేరిపోయాడు. ఐపీఎల్ ఆఫర్ రావడం అదృష్టంగా భావించే విదేశీ ఆటగాళ్లు..పీఎస్‌ఎల్ లాంటి చిన్న లీగ్‌ను తృణప్రాయంగా వదిలేసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే, జాతీయ విధుల కారణంగా జోస్ బట్లర్ ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌కు అందుబాటులో ఉండడం లేదు. దీంతో గుజరాత్ అతనికి ప్రత్యామ్నాయంగా మెండిస్‌ను ఎంపిక చేసుకుంది. బట్లర్ మే 26 వరకు గుజరాత్‌కు అందుబాటులో ఉంటాడు. మెండిస్‌ను గుజరాత్ యాజమాన్యం రూ. 75 లక్షలకు సొంతం చేసుకుంది.
ఈ సీజన్‌లో భీకర ఫామ్‌లో ఉన్న బట్లర్ ప్లే ఆఫ్స్‌లో గుజరాత్‌కు అందుబాటులో లేకపోవడం ఆ జట్టు టైటిల్ విన్నింగ్ అవకాశాలను ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. ఈ సీజన్‌లో బట్లర్ 11 మ్యాచ్‌లు ఆడి 71.43 సగటుతో 500 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు.
బట్లర్ గుజరాత్ ఆడబోయే తదుపరి మూడు లీగ్ మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం ఉంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా గుజరాత్ ప్లే ఆఫ్స్ బెర్త్ అధికారికంగా ఖరారవుతుంది. గుజరాత్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో ఢిల్లీ (మే 18), లక్నో (మే 22), సీఎస్‌కేతో (మే 25) తలపడాల్సి ఉంది.