England Cricketer Reece Topley: ఇంగ్లండ్‌ స్టార్‌ రీస్‌ టాప్లీ.. ఐదేళ్ల క్రితం కథ వేరే

Intresting How Music-Micro-Economics Helped Reece Topley Returns Cricket - Sakshi

ఇంగ్లండ్‌ బౌలర్‌ రీస్‌ టాప్లీ.. టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో హీరో అయ్యాడు. తొలి వన్డేలో టీమిండియా స్పీడస్టర్‌ బుమ్రా బౌలింగ్‌లో మ్యాజిక్‌ చేసి జట్టును గెలిపిస్తే.. దాదాపు అదే రీతిలో బౌలింగ్‌ చేసిన టాప్లీ ఈసారి టీమిండియా ఓటమికి కారణమయ్యాడు. ఇంగ్లండ్‌ రెండో వన్డేలో గెలిచింది అంటే అదంతా టాప్లీ మాయే. ఆరు వికెట్లతో దుమ్మురేపిన టాప్లీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

టీమిండియాపై తన ప్రదర్శన కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌ అని రీస్‌ టాప్లీ మ్యాచ్‌ అనంతరం పేర్కొన్నాడు. బలహీన జట్టుపై వికెట్లు తీస్తే కిక్‌ ఉండదని.. పటిష్టమైన టీమిండియా లాంటి జట్టుపై మ్యాచ్‌ విన్నింగ్‌ బౌలింగ్‌ చేయడం ఎంతో కిక్‌ ఇచ్చిందని చెప్పుకొచ్చాడు. కీలక సమయంలో అద్బుత బౌలింగ్‌తో జట్టును గెలిపించడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు.

నిజానికి రీస్‌ టాప్లీ కథ ఐదేళ్ల క్రితం వేరుగా ఉంది. 21 ఏళ్ల వయసులోనే ఇంగ్లండ్‌ జట్టులో ఎంట్రీ ఇచ్చిన టాప్లీ నిలదొక్కుకోవడానికి దాదాపు ఐదు సంవత్సరాలు పట్టింది. ఈ ఐదేళ్ల కాలంలో మానసికంగానూ.. శారీరకంగానూ ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అవన్నీ ఎంతగానో బాధించాయి. ఒక దశలో ఇంగ్లండ్‌ జెర్సీని విసిరిపారేసిన సందర్భం కూడా వచ్చిందని టాప్లీ టెలిగ్రాఫ్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు. 


టాప్లీ మాట్లాడుతూ.. ''21 ఏళ్ల వయసులో ఇంగ్లండ్‌ జట్టులోకి అడుగుపెట్టాను. ఆరంభంలో వరుస అవకాశాలు వస్తుండడంతో నన్ను నేను నిరూపించుకుననే పనిలో పడ్డాను. కెరీర్‌ అంతా సాఫీగా సాగుతున్న దశలో గాయాలు వేధించాయి. అంతే ఇక కోలుకోలేకపోయా. ఒక దశలో రిటైర్మెంట్‌ అనే ఆలోచనకు వెళ్లిపోయా. నాలుగేళ్ల క్రితం నా పరిస్థితి మాటల్లో వర్ణించలేనిది. భరించలేని కడుపునొప్పి నన్ను కుంగదీస్తే.. ఇక వెన్నునొప్పి సమస్య గురించి చెప్పుకుంటే కన్నీళ్లే దిక్కు.  ఈ రెండింటిని అధిగమించేందుకు రోజు పొద్దునే పొత్తి కడుపు హార్మోన్‌ ఇంజెక్ట్‌ చేసుకోవడం.. నెలకోసారి లండన్‌కు వెళ్లి వెన్ను నొప్పికి చికిత్స చేయించుకొని అనస్థీషియా తీసుకోవడం లాంటివి జరిగేవి. ఇక ఆ తర్వాత రోజు గంటపాటు జిమ్‌లో కసరత్తులు చేస్తూ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాను.

ఈలోగా కరోనా పేరుతో ప్రపంచం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. అప్పటికి వయసు 25 ఏళ్లు.. అవకాశాలు లేకపోవడంతో రిటైర్మెంట్‌కు సమయం వచ్చేసిందని భావించా. సెలక్టర్లు కూడా నావైపు చూడకపోవడం.. కరోనా ఇలా ఒకదాని వెంట మరొకటి వెంటవెంటనే జరిగిపోయాయి. అప్పుడే ఇంగ్లండ్‌ జెర్సీని తీసిపారేయాల్సి వచ్చింది. నాకు ఇష్టమైన మ్యూజిక్‌ క్లాసులు నేర్చుకున్నాను. ఆ తర్వాత యునివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా నుంచి మైక్రో ఎకానమిక్స్‌ కోర్సులో సీటు సాధించి ఫస్ట్‌ లాక్‌డౌన్‌లో కాలం గడిపాను. మైక్రో ఎకానమిక్స్‌ కోర్సు తర్వాత నా మనసులో దైర్యం పెరిగింది. నాకు నేనుగా ఒక ఫిలాసఫీ పాఠాలు చెప్పడం నేర్చుకున్నా.


అందుకే వదిలేసిన క్రికెట్‌ను మళ్లీ ఆడాలనిపించింది. ఈలోగా కరోనా తగ్గుముఖం పట్టడం.. నా ఆరోగ్యం కూడా బాగుపడడం ఇవన్నీ చూస్తే నాకు మంచి రోజులు వచ్చాయనిపించింది. తిరిగి బౌలింగ్‌ చేయడం ఆరంభించాను. ఎంతో మంది కోచ్‌లను కలిసి బౌలింగ్‌లో మరిన్ని మెళుకువలు నేర్చుకున్నాను. నువ్వు మనసు పెట్టి బౌలింగ్‌ చేస్తే  ఒక యార్కర్‌ బాల్‌ను 110 శాతం పర్‌ఫెక్ట్‌గా చేయగలవు అంటూ దైర్యం చెప్పారు. వాళ్ల నుంచి ఏం నేర్చుకున్నానో ఇవాళ మ్యాచ్‌లో అదే ఆచరించా. ఈరోజు ఇంగ్లండ్‌కు కీలక సమయంలో విజయం సాధించేలా చేశాను'' అంటూ ముగించాడు.  ఇక రీస్‌ టప్లీ 2015లో ఇంగ్లండ్‌ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఏడేళ్ల కాలంలో టాప్లీ 15 వన్డేలు, 12 టి20 మ్యాచ్‌లు ఆడాడు.

చదవండి: IND vs ENG 2nd ODI Highlights: ‘టాప్‌’లీ లేపేశాడు...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top