
దుబాయ్: ఆసియాకప్ టి20 టోర్నీ ‘సూపర్–4’ దశలో భాగంగా నేడు శ్రీలంకతో భారత జట్టు ఆడనుంది. ఈ టోర్నీ ఆరంభం నుంచి అజేయంగా సాగుతున్న టీమిండియా... గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో... ‘సూపర్–4’ దశ రెండు మ్యాచ్‌ల్లో గెలిచి ఇప్పటికే ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ బృందం తుదిపోరుకు ముందు శ్రీలంకతో మ్యాచ్‌ను ప్రాక్టీస్‌గా వినియోగించుకోనుంది.
ఈ టోర్నీలో ఇప్పటి వరకు భారత జట్టుకు గట్టి పోటీ ఎదురవలేదు. బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగుతుంటే ... బౌలింగ్‌లో కుల్దీప్, బుమ్రా రాణిస్తున్నారు. మిగిలిన వాళ్లు కూడా మంచి టచ్‌లో ఉండటంతో ప్రత్యర్థికి మరోసారి కష్టాలు తప్పకపోవచ్చు. గ్రూప్ దశలో మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన లంక... ‘సూపర్–4’ రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడి ఫైనల్‌కు దూరమైంది. రాత్రి 8 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.