
దుబాయ్: ఆసియాకప్ టి20 టోర్నమెంట్ కోసం భారత జట్టు ముమ్మర సాధన చేస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ (యూఏఈ)లో మంగళవారం నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుండగా... బుధవారం ఆతిథ్య యూఏఈతో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. టోర్నీలో భాగంగా ఈ నెల 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనున్న భారత జట్టు... ఐసీసీ అకాడమీలో జోరుగా ప్రాక్టీస్‌లో పాల్గొంది.
ఫిట్‌నెస్ డ్రిల్స్ సందర్భంగా శుబ్‌మన్ గిల్ ఆకట్టుకోగా... సూర్యకుమార్ యాదవ్, సంజు సామ్సన్, జితేశ్ శర్మ, తిలక్ వర్మ, అభిõÙక్ శర్మ నెట్స్‌లో సుదీర్ఘంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. ఇంగ్లండ్ పర్యటన అనంతరం భారత జట్టు ఆడనున్న తొలి మ్యాచ్ ఇదే కాగా... భారత టెస్టు సారథి గిల్, స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్ దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ వంటి వాళ్లు కాస్త విరామం అనంతరం మైదానంలోకి అడుగుపెట్టారు.
గతేడాది టి20 ప్రపంచకప్ ఫైనల్ తర్వాత బుమ్రా ఈ ఫార్మాట్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. పేస్ ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, దూబే అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణను పర్యవేక్షించాడు. ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో భారత జట్టు ఎనిమిదిసార్లు ఆసియాకప్ ట్రోఫీ చేజిక్కించుకుంది.