
2–2 గోల్స్‌తో స్కోర్లు సమం
ఆసియా కప్ మహిళల హాకీ టోర్నీ
హాంగ్జౌ (చైనా): ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్‌లో భారీ విజయంతో శుభారంభం చేసిన భారత జట్టు... డిఫెండింగ్ చాంపియన్ జపాన్‌తో రెండో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. తొలి మ్యాచ్‌లో 11–0 గోల్స్ తేడాతో థాయ్‌లాండ్‌ను చిత్తుచేసిన సలీమా టెటె సారథ్యంలోని టీమిండియా... శనివారం జపాన్‌తో రెండో మ్యాచ్‌ను 2–2తో ‘డ్రా’గా ముగించింది. పూల్ ‘బి’లో భాగంగా జరిగిన ఈ పోరులో చివరి క్షణాల్లో నవ్‌నీత్ కౌర్ గోల్ చేసి జట్టును గట్టెక్కించింది.
భారత్ తరఫున రుతుజ (30వ నిమిషంలో), నవ్‌నీత్ కౌర్ (60వ నిమిషంలో) చెరో గోల్ సాధించగా... జపాన్ తరఫున హిరోకా మురయామా (10వ నిమిషంలో), చికో ఫుజిబయాషి (58వ నిమిషంలో) ఒక్కో గోల్ నమోదు చేసుకున్నారు. పూల్ ‘బి’లో భాగంగా శనివారమే జరిగిన మరో మ్యాచ్‌లో థాయ్‌లాండ్ 2–1 గోల్స్ తేడాతో సింగపూర్‌పై విజయం సాధించింది. లీగ్ దశలో చివరి మ్యాచ్‌లో సోమవారం సింగపూర్‌తో భారత్ తలపడనుంది.
ఈ టోర్నమెంట్‌లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటుండగా... ఒక్కో పూల్ నుంచి ఉత్తమ ప్రదర్శన చేసిన రెండు జట్లు... సూపర్–4 దశకు అర్హత సాధించనున్నాయి. అందులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఈ నెల 14న ఫైనల్ జరుగుతుంది. అందులో గెలిచిన జట్టు వచ్చే ఏడాది బెల్జియం, నెదర్లాండ్స్ వేదికగా జరగనున్న మహిళల వరల్డ్‌కప్‌నకు నేరుగా అర్హత సాధించనుంది.