
నేటినుంచి వెస్టిండీస్‌తో ఆఖరి టెస్టు
ఉ.గం.9.30 నుంచి ‘స్టార్‌స్పోర్ట్స్’, ‘జియో హాట్‌స్టార్’లలో ప్రసారం
న్యూఢిల్లీ: తొలిటెస్టును మూడే రోజుల్లో ముగించిన భారత జట్టు ఇప్పుడు రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసేందుకు సిద్ధమైంది. శుక్రవారం నుంచి వెస్టిండీస్‌తో జరిగే చివరి టెస్టులో ప్రత్యర్థిని వైట్‌వాష్ చేయడమే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతోంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో వరుసగా రెండుసార్లు ఫైనలిస్టుగా నిలిచిన భారత్... ప్రస్తుత ప్రత్యర్థి కరీబియన్ కంటే ఎన్నో రెట్టు మెరుగ్గావుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లతో పాటు సొంతగడ్డ అనుకూలతలు కూడా టీమిండియాను అజేయంగా నిలుపుతున్నాయి.
అహ్మదాబాద్‌లో జరిగిన మొదటి టెస్టులో ఏకంగా ముగ్గురు బ్యాటర్లు రాహుల్, ధ్రువ్ జురేల్, జడేజా శతకాల మోత మోగించారు. ఇక జట్టులో ఎవరైనా నిరూపించుకోవాలి అంటే అది సాయి సుదర్శన్ ఒక్కడే! గత మ్యాచ్‌లో అతను సింగిల్ (7) డిజిట్‌కే వికెట్ పారేసుకున్నాడు. ఈ నేపథ్యంలో బ్యాటర్లకు అచ్చొచ్చే ఇక్కడి అరుణ్ జైట్లీ స్టేడియంలో అతను ఫామ్‌లోకి రావాలని జట్టు మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది.
బౌలింగ్‌లో స్టార్ సీమర్లు బుమ్రా, సిరాజ్‌లతో పాటు స్పిన్నర్లు కుల్దీప్, జడేజా, వాషింగ్టన్ సుందర్‌లు అందరూ ఫామ్‌లో ఉన్నారు. తొలిటెస్టులో భారత బౌలింగ్ దళం ప్రత్యర్థిని రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఒక రోజు ఓవర్ల కోటా (90 ఓవర్లు)నైనా పూర్తిగా ఆడనివ్వకుండా ఆలౌట్ చేసింది. ఇలాంటి పటిష్టమైన జట్టుపై కరీబియన్ గెలవడమైతే అసాధ్యం. అయితే ఎన్ని రోజుల్లో ముగుస్తుందనేది ఇక్కడ ఆసక్తికరం.
ఢిల్లీ గతమిది...
సంప్రదాయ టెస్టుల్లో భారత్‌కు బాగా కలిసొచ్చే వేదిక ఏదైన ఉందంటే అది ఢిల్లీనే. 38 ఏళ్లుగా ఇక్కడ టీమిండియాకు ఓటమంటేనే తెలీదు. చివరిగా 1987లో అదికూడా విండీస్ చేతిలోనే ఓడిన భారత్ తర్వాత 24మ్యాచ్‌లాడినా... ఇందులో ఏ ఒక్క టెస్టులోనూ ఓడలేదు. 12 టెస్టుల్లో గెలిచిన భారత జట్టు, మరో 12 మ్యాచ్‌ల్ని డ్రాగా ముగించింది.
తుది జట్లు (అంచనా)
భారత్: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురేల్, జడేజా, నితీశ్ కుమార్‌రెడ్డి, సుందర్, కుల్దీప్, బుమ్రా, సిరాజ్.
వెస్టిండీస్: రోస్టన్ చేజ్ (కెప్టెన్), తేజ్ నారాయణ్, క్యాంప్‌బెల్, అతనేజ్, బ్రాండన్ కింగ్, షైహోప్, గ్రీవెస్, వారికన్, పియర్, జాన్ లేన్/బ్లేడ్స్, సీలెస్.
పిచ్–వాతావరణం
ఢిల్లీ భిన్నమైన వికెట్. తొలి రెండు రోజుల బ్యాటింగ్‌కు స్వర్గధామం. మూడో రోజు గడిచే కొద్ది పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుంది. మ్యాచ్ రోజుల్లో తేలికపాటి వర్షాలున్నా... మ్యాచ్‌ను పూర్తిగా ప్రభావితం చేసే స్థాయిలో లేవు.