రోహిత్‌ – కోహ్లి సూపర్‌హిట్‌ | India win by 9 wickets in the third ODI | Sakshi
Sakshi News home page

రోహిత్‌ – కోహ్లి సూపర్‌హిట్‌

Oct 26 2025 4:09 AM | Updated on Oct 26 2025 4:09 AM

India win by 9 wickets in the third ODI

మూడో వన్డేలో 9 వికెట్లతో భారత్‌ ఘన విజయం

సత్తా చాటిన సీనియర్‌ బ్యాటర్లు 

రోహిత్‌ కెరీర్‌లో 33వ సెంచరీ 

2–1తో సిరీస్‌ ఆసీస్‌ సొంతం

‘సినిమా ఇంకా మిగిలే ఉంది’... ఆ్రస్టేలియాతో చివరి వన్డేలో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి ఆట చూస్తే అభిమానులందరికీ ఇదే అనిపిస్తుంది. సిరీస్‌ ఆరంభానికి ముందు వారి బ్యాటింగ్‌పై సందేహాలు, జట్టులో చోటుపై చర్చ... తొలి మ్యాచ్‌లో వైఫల్యం తర్వాత రోహిత్‌పై ఒత్తిడి పెరగగా, వరుసగా రెండు డకౌట్లు కోహ్లి సత్తాపై సందేహాలు రేకెత్తించాయి. కానీ వన్డే క్రికెట్‌ దిగ్గజాలుగా తమ అసలు స్థాయి ఏమిటో వారు ఇప్పుడు చూపించారు.

మరికొంత కాలం తమ స్థానం గురించి ఎవరూ మాట్లాడకుండా చేశారు... అలవోకగా పరుగులు సాధించి తమ బ్యాటింగ్‌లో పదును తగ్గలేదని నిరూపించారు. ఆస్ట్రేలియా గడ్డపై చివరి సారిగా ఆడిన రోహిత్, కోహ్లి సిడ్నీ మైదానంలోని 40,587 మంది ప్రేక్షకులను చక్కటి షాట్లతో అలరించారు. రోహిత్‌ శతకంతో చెలరేగగా, కోహ్లి దీటైన ఇన్నింగ్స్‌ ఆడాడు. వన్డేల్లో రికార్డు స్థాయిలో 5483 పరుగులు జోడించిన ఈ జంట తమ జుగల్‌బందీతో మరో మ్యాచ్‌ను గెలిపించి ఫ్యాన్స్‌కు జోష్‌ను అందించింది.  

సిడ్నీ: ఆ్రస్టేలియాతో వన్డే సిరీస్‌ను భారత్‌ విజయంతో ముగించింది. ఇప్పటికే సిరీస్‌ కోల్పోయినా... చివరి మ్యాచ్‌ టీమిండియాకు ఆనందాన్ని పంచింది. శనివారం జరిగిన మూడో వన్డేలో భారత్‌ 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా 46.4 ఓవర్లలో 236 పరుగులకే ఆలౌటైంది. మాట్‌ రెన్‌షా (58 బంతుల్లో 56; 2 ఫోర్లు) అర్ధ సెంచరీతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో హర్షిత్‌ రాణా 4 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్‌ 38.3 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 237 పరుగులు సాధించింది.

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రోహిత్‌ శర్మ (124 బంతుల్లో 121 నాటౌట్‌; 13 ఫోర్లు, 3 సిక్స్‌లు) కెరీర్‌లో 33వ సెంచరీ సాధించగా, విరాట్‌ కోహ్లి (81 బంతుల్లో 74; 7 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 170 బంతుల్లో అభేద్యంగా 168 పరుగులు జోడించడంతో మరో 11.3 ఓవర్లు ఉండగానే భారత్‌ విజయం ఖాయమైంది. తొలి రెండు వన్డేలు నెగ్గిన ఆసీస్‌ 2–1తో సిరీస్‌ సొంతం చేసుకోగా, మొత్తంగా 202 పరుగులు చేసిన రోహిత్‌కే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య బుధవారం నుంచి ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ మొదలవుతుంది.  

హర్షిత్‌ రాణాకు 4 వికెట్లు... 
ఆ్రస్టేలియా ఇన్నింగ్స్‌లో టాప్‌–6 బ్యాటర్లు మెరుగ్గా ఆరంభించినా, ఒక్కరూ కూడా దానిని భారీ స్కోరుగా మలచలేకపోయారు. ఓపెనర్లు మిచెల్‌ మార్ష్(50 బంతుల్లో 41; 5 ఫోర్లు, 1 సిక్స్‌), ట్రవిస్‌ హెడ్‌ (25 బంతుల్లో 29; 6 ఫోర్లు) తొలి వికెట్‌కు 56 బంతుల్లోనే 61 పరుగులు జోడించారు. ఆ తర్వాత మాథ్యూ షార్ట్‌ (41 బంతుల్లో 30; 2 ఫోర్లు), రెన్‌షా కూడా ఫర్వాలేదనిపించడంతో ఒక దశలో స్కోరు 183/3 వద్ద నిలిచింది. అయితే శ్రేయస్‌ అద్భుత క్యాచ్‌తో అలెక్స్‌ క్యారీ (24)ని అవుట్‌ చేయడంతో ఆసీస్‌ పతనం మొదలైంది. 

గత మ్యాచ్‌ గెలిపించిన కూపర్‌ కలోనీ (23)తో పాటు ఇతర బ్యాటర్లెవరూ క్రీజ్‌లో నిలబడలేకపోయారు. ఫలితంగా 53 పరుగుల వ్యవధిలో ఆసీస్‌ 7 వికెట్లు కోల్పోయింది. మరో 3.2 ఓవర్లు మిగిలి ఉండగానే జట్టు ఆలౌట్‌ అయింది. క్యారీ క్యాచ్‌ పట్టే క్రమంలో శ్రేయస్‌ పక్కటెముకలకు తీవ్ర గాయమైంది. దీంతో అతడు కనీసం మూడు వారాల పాటు ఆటకు దూరం అయ్యే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌ కోసం భారత్‌ రెండు మార్పులు చేసింది. నితీశ్‌ రెడ్డి, అర్ష్ దీప్‌ స్థానాల్లో కుల్దీప్, ప్రసిధ్‌ కృష్ణలకు చోటు కల్పించింది.   

భారీ భాగస్వామ్యం... 
ఛేదనలో భారత్‌కు ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. రోహిత్, శుబ్‌మన్‌ గిల్‌ (24) చకచకా 62 బంతుల్లోనే 69 పరుగులు జత చేశారు. గిల్‌ వెనుదిరిగిన తర్వాత ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య కోహ్లి బరిలోకి దిగాడు. తన తొలి బంతికే సింగిల్‌ తీయడంతో స్టేడియం హోరెత్తిపోగా, కోహ్లి కూడా నవ్వుతూ వారికి అభివాదం చేయడం విశేషం! రోహిత్, కోహ్లి జోడి ఎదురు లేకుండా దూసుకుపోయింది. రోహిత్‌ దూకుడు ప్రదర్శించగా, కోహ్లి తనదైన శైలిలో చూడచక్కటి షాట్లు ఆడాడు. 

జంపా బౌలింగ్‌లో లాంగాఫ్‌ మీదుగా రోహిత్‌ కొట్టిన ‘ఇన్‌సైడ్‌ అవుట్‌’ సిక్స్‌ హైలైట్‌గా నిలిచింది. ముందుగా 63 బంతుల్లో రోహిత్, ఆ తర్వాత 56 బంతుల్లో కోహ్లి అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆసీస్‌ బౌలర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా వికెట్‌ తీయడంలో విఫలమయ్యారు. జంపా బౌలింగ్‌లో సింగిల్‌తో సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్‌ ఎలాంటి సంబరాలు చేసుకోకపోగా, భారత్‌ స్కోరు 200 పరుగులకు చేరింది. ఆ తర్వాత మరో 33 బంతుల్లో జట్టు మ్యాచ్‌ను ముగించింది.  

14,255 వన్డేల్లో కోహ్లి పరుగుల సంఖ్య. సంగక్కర (14,234)ను అధిగమించిన అతను సచిన్‌ (18,426) తర్వాత రెండో స్థానానికి చేరుకున్నాడు.

9 ఆస్ట్రేలియాపై రోహిత్‌ సెంచరీల సంఖ్య. సచిన్‌ (9)తో అతను సమంగా నిలిచాడు.

50 అన్ని ఫార్మాట్‌లు కలిపి రోహిత్‌ సెంచరీల సంఖ్య. మరో 9 మంది బ్యాటర్లు మాత్రమే ఈ ఘనత సాధించారు.

స్కోరు వివరాలు  
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: మార్ష్(బి) అక్షర్‌ 41; హెడ్‌ (సి) ప్రసిధ్‌ (బి) సిరాజ్‌ 29; షార్ట్‌ (సి) కోహ్లి (బి) సుందర్‌ 30; రెన్‌షా (ఎల్బీ) (బి) సుందర్‌ 56; క్యారీ (సి) అయ్యర్‌ (బి) రాణా 24; కనోలీ (సి) కోహ్లి (బి) రాణా 23; ఒవెన్‌ (సి) రోహిత్‌ (బి) రాణా 1; స్టార్క్‌ (బి) కుల్దీప్‌ 2; ఎలిస్‌ (సి) రోహిత్‌ (బి) ప్రసిధ్‌ 16; జంపా (నాటౌట్‌) 2; హాజల్‌వుడ్‌ (బి) రాణా 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (46.4 ఓవర్లలో ఆలౌట్‌) 236.  వికెట్ల పతనం: 1–61, 2–88, 3–124, 4–183, 5–195, 6–198, 7–201, 8–223, 9–236, 10–236. బౌలింగ్‌: సిరాజ్‌ 5–1–24–1, రాణా 8.4–0–39–4, ప్రసిధ్‌ 7–0–52–1, కుల్దీప్‌ 10–0–50–1, అక్షర్‌ 6–0–18–1, సుందర్‌ 10–0–44–2.  

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (నాటౌట్‌) 121, గిల్‌ (సి) క్యారీ (బి) హాజల్‌వుడ్‌ 24; కోహ్లి (నాటౌట్‌) 74; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (38.3 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 237. వికెట్ల పతనం: 1–69. బౌలింగ్‌: స్టార్క్‌ 5–0–31–0, హాజల్‌వుడ్‌ 6–1–23–1, ఎలిస్‌ 7.3–0–60–0, కనోలీ 5–0–36–0, జంపా 10–0–50–0, ఒవెన్‌ 1–0–2–0, షార్ట్‌ 4–0–29–0.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement