
లుసానే: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) హాకీ ప్రొ లీగ్ కొత్త సీజన్ ఈ డిసెంబర్‌లోనే మొదలవుతుంది. 2025–26కు సంబంధించిన ప్రొ లీగ్ డిసెంబర్ 9 నుంచి అర్జెంటీనా, ఐర్లాండ్‌లలో జరుగుతుందని హాకీ వర్గాలు తెలిపాయి. ఈ సీజన్‌లో ఐర్లాండ్ మహిళల జట్టు, పాకిస్తాన్ పురుషుల జట్టు కొత్తగా చేరుతున్నాయి.
ఈ రెండు జట్లు నేషన్స్ కప్ హాకీ టోర్నమెంట్ నుంచి అర్హత సాధించినట్లు ఎఫ్‌ఐహెచ్ తెలిపింది. వచ్చే సీజన్ మొత్తం 10 దేశాల్లో జరుగనుంది. రికార్డుస్థాయిలో 144 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. భారత్‌లో ఫిబ్రవరి 10 నుంచి 15 వరకు జరుగుతాయి.
భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జూన్ 23 నుంచి 28 మధ్య ఇంగ్లండ్ వేదికగా రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ లీగ్‌లో విజేతగా నిలిచిన జట్లు 2028 ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాయి. డిసెంబర్ 9న జరిగే పురుషుల ఈవెంట్ తొలి మ్యాచ్‌లో జర్మనీతో బెల్జియం తలపడుతుంది.
దీంతో పాటు ఇంగ్లండ్ ఆడే మ్యాచ్‌లు కూడా ఐర్లాండ్‌లోనే జరుగుతాయి. అదే రోజు అర్జెంటీనాలో జరిగే మ్యాచ్‌లో ప్రస్తుత చాంపియన్ నెదర్లాండ్స్‌తో పాకిస్తాన్ ఢీకొంటుంది. అనంతరం చైనా, స్పెయిన్, ఆ్రస్టేలియా, భారత్, ఇంగ్లండ్, నెదర్లాండ్స్, బెల్జియం, జర్మనీలలో జూన్ 28 వరకు లీగ్ దశ మ్యాచ్‌లే జరుగుతాయి.