ఆధిక్యమే లక్ష్యంగా... | India vs England third Test starts today | Sakshi
Sakshi News home page

ఆధిక్యమే లక్ష్యంగా...

Jul 10 2025 3:26 AM | Updated on Jul 10 2025 3:30 AM

India vs England third Test starts today

నేటి నుంచి భారత్, ఇంగ్లండ్‌ మూడో టెస్టు

జోరు కొనసాగించాలని టీమిండియా

కోలుకునే ప్రయత్నంలో ఇంగ్లండ్‌

బరిలో బుమ్రా, ఆర్చర్‌ 

మధ్యాహ్నం గం.3:30 నుంచి సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం  

భారత క్రికెట్‌ జట్టు ఇంగ్లండ్‌ గడ్డపై లార్డ్స్‌ గ్రౌండ్‌లోనే మూడు టెస్టులు గెలిచింది. ఇతర ఏ మైదానంలోనూ రెండుకు మించి విజయాలు సాధించలేదు. మనకు కలిసొచ్చిన వేదికపై ఇప్పుడు మరో సమరం. మ్యాచ్‌లో బుమ్రా పునరాగమనంతో పెరిగిన పేస్‌ బలం. గత టెస్టులో సాధించిన ఘన విజయం ఇచి్చన అంతులేని ఆత్మవిశ్వాసం. వెరసి కొత్త ఉత్సాహంతో భారత జట్టు మూడో టెస్టుకు సిద్ధమైంది. మరోవైపు బలహీనమైన ఆటతో రెండో టెస్టును కోల్పోయిన ఆతిథ్య ఇంగ్లండ్‌ కోలుకోవాలని ఆశిస్తోంది. ఇక్కడా ఆ జట్టు ఓడిందంటే సిరీస్‌ చేజారినట్లే!  

లండన్‌: భారత్, ఇంగ్లండ్‌ సుదీర్ఘ టెస్టు సమరంలో మరో పోరుకు రంగం సిద్ధమైంది. 1–1తో సిరీస్‌ సమంగా ఉన్న స్థితిలో నేడు ప్రతిష్టాత్మక లార్డ్స్‌ మైదానంలో ఇరు జట్ల మధ్య మూడో టెస్టు మొదలవుతుంది. భారత జట్టు బర్మింగ్‌హామ్‌ ప్రదర్శనను బట్టి చూస్తే అన్ని అస్త్రశ్రస్తాలతో ఎలాంటి లోపాలు లేకుండా జట్టు సన్నద్ధమైనట్లు కనిపిస్తోంది. ఇక్కడా విజయం సాధిస్తే 2–1తో దూసుకుపోయి ఆపై సిరీస్‌ గెలుచుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి గిల్‌ బృందం మరింత పట్టు బిగించాలని భావిస్తోంది. జట్టులో అక్కడక్కడా పూరించలేని లోపాలు కనిపిస్తున్న ఇంగ్లండ్‌ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరం. 

ప్రసిధ్‌ స్థానంలో బుమ్రా... 
సిరీస్‌లో రెండు టెస్టుల్లో భారత జట్టు బలమైన బ్యాటింగ్‌ ప్రదర్శనను కనబర్చించింది. టాప్‌–6లో కరుణ్‌ నాయర్‌ మినహా మిగతా వారంతా సెంచరీ లేదా కనీసం అర్ధసెంచరీలు నమోదు చేశారు. యశస్వి జైస్వాల్, కేఎల్‌ రాహుల్, గిల్, రిషభ్‌ పంత్‌ శతకాలు బాదగా... రవీంద్ర జడేజా ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ హాఫ్‌ సెంచరీలు చేసి తన బ్యాటింగ్‌ పదును చూపించాడు. ముఖ్యంగా అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్న గిల్‌ను ఇంగ్లండ్‌ బౌలర్లు నిలువరించలేకపోతున్నారు. వైఫల్యాలు ఉన్నా సరే, నాయర్‌కు సిరీస్‌లో మరో అవకాశం దక్కవచ్చు. 

కాబట్టి బ్యాటింగ్‌ బృందంలో ఎలాంటి మార్పూ ఉండదు. బౌలింగ్‌లో బుమ్రా ఆడటం ఖాయం కావడంతో ప్రసిధ్‌ కృష్ణ స్థానంలో అతను నేరుగా జట్టులోకి వస్తాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో చెలరేగిన ఆకాశ్‌దీప్, సిరాజ్‌లకు ఇప్పుడు బుమ్రా జత కలిస్తే బౌలింగ్‌కు తిరుగుండదు. అదనపు స్పిన్నర్‌ కావాలని భావిస్తే నితీశ్‌ కుమార్‌ రెడ్డి స్థానంలో కుల్దీప్‌ యాదవ్‌ వస్తాడు. స్పిన్‌ ఆల్‌రౌండర్లు జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌ మరోసారి కీలకం కానున్నారు.  

నాలుగేళ్ల తర్వాత... 
ఎప్పటిలాగే ఇంగ్లండ్‌ మ్యాచ్‌కు ముందు రోజే తమ తుది జట్టును ప్రకటించింది. జోష్‌ టంగ్‌ స్థానంలో ఫాస్ట్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌కు చోటు కల్పించింది. అతని వేగం తమకు అదనపు బలంగా మారుతుందని జట్టు నమ్ముతోంది. అయితే ఆర్చర్‌ ఏకంగా నాలుగేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్‌లో బరిలోకి దిగుతున్నాడు. అతను ఏమాత్రం ప్రభావం చూపుతాడనే చెప్పలేం. 

మరో ఇద్దరు పేసర్లు వోక్స్, కార్స్‌ తమ స్థానాలు నిలబెట్టుకున్నారు. వీరిద్దరు సిరీస్‌లో పెద్దగా ప్రభావం చూపకపోయినా... ఈ టెస్టు కోసం ఎంపిక చేసిన అట్కిన్సన్‌ గాయంతో తప్పుకోవడంతో మరో ప్రత్యామ్నాయం లేకపోయింది. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 71 ఓవర్లలో 286 పరుగులు ఇచ్చినా స్పిన్నర్‌గా షోయబ్‌ బషీర్‌పైనే ఇంగ్లండ్‌ నమ్మకం ఉంచింది. అయితే ఈ మ్యాచ్‌లో గెలవాలంటే ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ పదునెక్కాల్సి ఉంది. 

బ్యాటింగ్‌కు మరీ అనుకూలం కాని లార్డ్స్‌ పిచ్‌పై ఆతిథ్య బ్యాటర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చాల్సి ఉంది. ఓపెనర్లు క్రాలీ, డకెట్‌ భారత పేసర్లను ఎలా ఎదుర్కొంటారనేది చూడాలి. ఒలీ పోప్‌తో పాటు జో రూట్‌ కూడా అంచనాలను అందుకోవాల్సి ఉంది. హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్‌ ఫామ్‌ సానుకూలాంశం కాగా, కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ బ్యాటింగ్‌ ఆందోళన రేకెత్తిస్తోంది. అతను ఒక మంచి ఇన్నింగ్స్‌ ఆడి చాలా కాలమైంది. ఇప్పుడైనా స్టోక్స్‌ తన బ్యాటింగ్‌ బలాన్ని చూపించడం జట్టుకు ఎంతో అవసరం.  

తుది జట్ల వివరాలు 
భారత్‌ (అంచనా): గిల్‌ (కెప్టెన్), జైస్వాల్, రాహుల్, నాయర్, పంత్, జడేజా, సుందర్, ఆకాశ్‌దీప్, సిరాజ్, బుమ్రా, కుల్దీప్‌. 
ఇంగ్లండ్‌: స్టోక్స్‌ (కెప్టెన్), క్రాలీ, డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్మిత్, వోక్స్, కార్స్, ఆర్చర్, బషీర్‌.

పిచ్, వాతావరణం
అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌కు సమాన అనుకూలతగా జీవం ఉన్న పిచ్‌ ఇది. ఆరంభంలోనే కాస్త పేస్‌కు అనుకూలిస్తుంది. ఆపై మంచి బ్యాటింగ్‌కు అవకాశం ఉంది. ఈసారి టాస్‌ గెలిచిన జట్టు బ్యాటింగ్‌ను ఎంచుకోవచ్చు. మ్యాచ్‌ రోజుల్లో వర్ష సూచన లేదు.

19  భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య లార్డ్స్‌ మైదానంలో జరిగిన టెస్టులు. 
3 టెస్టుల్లో భారత్,  12 టెస్టుల్లో ఇంగ్లండ్‌ గెలిచాయి. 4 టెస్టులు ‘డ్రా’గా ముగిశాయి.
148 లార్డ్స్‌ మైదానంలో ఇప్పటి వరకు జరిగిన టెస్టులు. 97 టెస్టుల్లో ఫలితాలు రాగా, 51 టెస్టులు ‘డ్రా’గా ముగిశాయి. ఈ వేదికపై ఇంగ్లండ్‌ 145 టెస్టులు ఆడింది. 59 టెస్టుల్లో నెగ్గి, 35 టెస్టుల్లో ఓడింది.  51 టెస్టులను ‘డ్రా’ చేసుకుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement