భారత్‌కు విజయ 'తిలకం' | India retains Asia Cup title | Sakshi
Sakshi News home page

భారత్‌కు విజయ 'తిలకం'

Sep 29 2025 4:01 AM | Updated on Sep 29 2025 6:32 AM

India retains Asia Cup title

ఆసియా కప్‌ టైటిల్‌ నిలబెట్టుకున్న భారత్‌

టీమిండియాను గెలిపించిన తిలక్‌ వర్మ 

ఫైనల్లో పాకిస్తాన్‌ చిత్తు

5 వికెట్లతో సూర్యకుమార్‌ బృందం ఘనవిజయం

కుల్దీప్‌ యాదవ్‌కు 4 వికెట్లు  

దాదాపు 18 ఏళ్ల క్రితం... టి20 వరల్డ్‌ కప్‌ ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి భారత్‌ జగజ్జేతగా నిలిచింది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మరోసారి చిరకాల ప్రత్యర్థితో ఆఖరి సమరంలో గెలిచే అవకాశం వచ్చింది... వరల్డ్‌ చాంపియన్‌గా తమ స్థాయికి తగిన అంచనాలతో భారత్‌ మరోసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. గత రెండు మ్యాచ్‌ల ఫలితాలు చూస్తే టీమిండియాకు విజయం అతి సులువు అనిపించింది. 

పాక్‌ బ్యాటింగ్‌ ముగిసిన తర్వాత లక్ష్యం మరీ చిన్నదిగా కనిపించింది. కానీ అనూహ్యంగా మ్యాచ్‌లో మలుపులు, ఉత్కంఠ, ఉద్వేగాలు... అన్నీ కలగలిసి మ్యాచ్‌ ఆఖరి ఓవర్‌ వరకు వెళ్లింది. సంజు సామ్సన్, శివమ్‌ దూబేలు తలా ఓ చేయి వేయగా... హైదరాబాద్‌ ఆటగాడు నంబూరి ఠాకూర్‌ తిలక్‌ వర్మ అసలైన హీరోగా అవతరించాడు.

ఒత్తిడిని అధిగమించి అద్భుత షాట్లతో చివరి వరకు నిలిచిన తిలక్‌ చిరస్మరణీయ ఆటతో భారత జట్టును ఆసియా కప్‌ విజేతగా నిలిపాడు. ఎన్ని టైటిల్స్‌ గెలిచినా ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి సాధించే ట్రోఫీలో కిక్కే వేరు అని మరోసారి రుజువైంది.  

దుబాయ్‌: ఆసియా కప్‌ టి20 టోర్నీలో భారత్‌ విజేతగా నిలిచింది. ఓవరాల్‌గా టోర్నీ చరిత్రలో 9వ సారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో భారత్‌ 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ 19.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. 

సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (38 బంతుల్లో 57; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా, ఫఖర్‌ జమాన్‌ (35 బంతుల్లో 46; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 58 బంతుల్లో 84 పరుగులు జోడించారు. పాక్‌ కేవలం 33 పరుగులకే చివరి 9 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ (4/30) ఆకట్టుకోగా... బుమ్రా, అక్షర్‌ పటేల్, వరుణ్‌ చక్రవర్తి తలా 2 వికెట్లు తీశారు. 

అనంతరం భారత్‌ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 150 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ తిలక్‌ వర్మ (53 బంతుల్లో 69 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ అర్ధ సెంచరీ సాధించగా... శివమ్‌ దూబే (22 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), సంజు సామ్సన్‌ (21 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్‌) అండగా నిలిచి విజయంలో కీలక పాత్ర పోషించారు.  

రాణించిన ఓపెనర్లు... 
భారత్‌తో ఆడిన సూపర్‌–4 మ్యాచ్‌ తరహాలోనే ఈసారి కూడా పాక్‌ ఇన్నింగ్స్‌ జోరుగా మొదలైంది. ఓపెనర్లు ఫర్హాన్, ఫఖర్‌ పదునైన షాట్లతో సరైన పునాది వేశారు. ముఖ్యంగా ఫర్హాన్‌ దూకుడు ప్రదర్శిస్తూ బుమ్రా ఓవర్లో ఫోర్, సిక్స్‌ కొట్టాడు. పవర్‌ప్లేలో 45 పరుగులు చేసిన జట్టు... తర్వాతి 4 ఓవర్లలో 42 పరుగులు రాబట్టడంతో 10 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 87 పరుగులకు చేరింది. 

గత మ్యాచ్‌లో భారత్‌పై పాక్‌ తొలి 10 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 91 పరుగులు సాధించింది. 35 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న ఫర్హాన్‌ను వరుణ్‌ను అవుట్‌ చేయడంతో పాక్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. మూడో స్థానంలో వచ్చిన సయీమ్‌ అయూబ్‌ (14) ఈసారి రెండంకెల స్కోరు చేయగలిగాడు. 12.4 ఓవర్లలో జట్టు స్కోరు 113/1 వద్ద నిలిచింది. ఈ దశలో మరో 44 బంతులు మిగిలి ఉండగా పాక్‌ భారీ స్కోరు సాధించడం ఖాయమనిపించింది. 

అయితే భారత బౌలర్లు చెలరేగడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. పాక్‌ బ్యాటర్లు ఎవరూ కనీసం క్రీజ్‌లో నిలవలేక చెత్త షాట్లతో వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. వరుసగా నాలుగు ఓవర్లలో ఒక్కో వికెట్‌ చొప్పున అయూబ్, హారిస్‌ (0), ఫఖర్, తలత్‌ (1) వెనుదిరిగారు. ఆ తర్వాత ఒకే ఓవర్లో మూడు వికెట్లతో కుల్దీప్‌ పాక్‌ పని పట్టాడు. అతడిని ఎదుర్కోలేక సల్మాన్‌ (8), అఫ్రిది (0), ఫహీమ్‌ (0) అవుటయ్యారు. మిగిలిన రెండు వికెట్లు తీసేందుకు భారత్‌కు ఎక్కువ సమయం పట్టలేదు. 39 బంతుల వ్యవధిలో పాక్‌ చివరి 9 వికెట్లు చేజార్చుకుంది!  

కీలక భాగస్వామ్యాలు... 
ఛేదనలో భారత్‌ ఆరంభంలో తడబడింది. అద్భుత ఫామ్‌లో ఉన్న అభిషేక్‌ శర్మ (5)ను నిలువరిచడంలో పాక్‌ సఫలం కాగా... కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్‌ (1), శుబ్‌మన్‌ గిల్‌ (12) కూడా విఫలమయ్యారు. దాంతో స్కోరు 20/3కి చేరింది. ఈ దశలో తిలక్, సామ్సన్‌ కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు చక్కటి షాట్లతో ఇన్నింగ్స్‌ను నడిపించారు. 

నాలుగో వికెట్‌కు 50 బంతుల్లో 57 పరుగులు జత చేసిన అనంతరం సామ్సన్‌ వెనుదిరిగాడు. అయితే తిలక్, దూబే భాగస్వామ్యంలో జట్టు గెలుపు దిశగా పయనించింది. వీరిద్దరు 40 బంతుల్లోనే 60 పరుగులు జోడించడంతో జట్టు విజయం దాదాపుగా ఖాయమైంది. విజయానికి 10 పరుగుల దూరంలో దూబే అవుటైనా... తిలక్, రింకూ సింగ్‌ (4 నాటౌట్‌) కలిసి మ్యాచ్‌ను ముగించారు. 

తిలక్‌ వర్మ
పరుగులు 69 
బంతులు 53 
1x 27 
2 x 3 
4 x 3 
6 x 4 
స్ట్రయిక్‌రేట్‌ 130.18  

బుమ్రా అలా... 
భారత్‌తో గత మ్యాచ్‌లో పాక్‌ బౌలర్‌ రవూఫ్‌ యుద్ధంలో భారత విమానాలు నేలకూలినట్లుగా సైగలు చేస్తూ తమ దుర్బుద్ధిని ప్రదర్శించాడు. దీనిపై అతనికి ఐసీసీ జరిమానా కూడా విధించింది. ఫైనల్లో చక్కటి బంతితో రవూఫ్‌ను బుమ్రా బౌల్డ్‌ చేశాడు. వెంటనే బుమ్రా కూడా అదే తరహాలో విమానం నేలను ఢీకొట్టినట్లుగా సైగ చేస్తూ రవూఫ్‌ను సాగనంపడంతో స్టేడియం హోరెత్తిపోయింది.  

రూ. 21 కోట్ల నజరానా
ఆసియా కప్‌ గెలిచిన టీమిండియాకు బీసీసీఐ భారీ ప్రోత్సాహకం ప్రకటించింది. జట్టు సభ్యులతో పాటు సహాయ సిబ్బందికి కలిపి రూ. 21 కోట్ల నజరానా ఇస్తున్నట్లు పేర్కొంది. ‘3 దెబ్బలు, 0 స్పందన, ఆసియా కప్‌ చాంపియన్స్, కావాల్సిన సందేశం అందించాం’ అని బీసీసీఐ ట్వీట్‌ చేసింది.  

ట్రోఫీని స్వీకరించని భారత జట్టు 
దుబాయ్‌: ఆసియా కప్‌ ఫైనల్‌ తర్వాత అనూహ్యం చోటు చేసుకుంది. మ్యాచ్‌ ముగిసి గంట సమయం దాటినా బహుమతి ప్రదానోత్సవం జరగలేదు. దాంతో ఏం జరిగిందనే అంశంపై చర్చ మొదలైంది. భారత జట్టు విజేత ట్రోఫీని స్వీకరించే విషయంలో వివాదం నెలకొనడమే అందుకు కారణమని తేలింది. 

ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు, పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు చైర్మన్‌ అయిన మొహసిన్‌ నఖ్వీ చేతుల మీదుగా కప్‌ను అందుకునేది లేదని టీమిండియా స్పష్టం చేసింది. చివరకు నఖ్వీ నుంచి మాత్రమే కాదు...తాము అసలు ట్రోఫీని తీసుకునేది లేదని సమాచారం ఇచ్చింది. దాంతో నిర్వాహకులు ట్రోఫీ ప్రదానోత్సవం లేకుండానే కార్యక్రమాన్ని ముగించారు. తిలక్, దూబే, అభిషేక్‌ మాత్రం తమ వ్యక్తిగత బహుమతులు అందుకున్నారు.  

‘క్రీడా మైదానంలో ఆపరేషన్‌ సిందూర్‌... ఫలితం మాత్రం ఒక్కటే... భారత్‌ విజయమే... మన క్రికెటర్లకుఅభినందనలు’.  –నరేంద్ర మోదీ, భారత ప్రధాని  

స్కోరు వివరాలు  
పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌: ఫర్హాన్‌ (సి) తిలక్‌ వర్మ (బి) వరుణ్‌ 57; ఫఖర్‌ (సి) కుల్దీప్‌ (బి) వరుణ్‌ 46; అయూబ్‌ (సి) బుమ్రా (బి) కుల్దీప్‌ 14; హారిస్‌ (సి) రింకూ (బి) అక్షర్‌ 0; సల్మాన్‌ (సి) సామ్సన్‌ (బి) కుల్దీప్‌ 8; తలత్‌ (సి) సామ్సన్‌ (బి) అక్షర్‌ 1; నవాజ్‌ (సి) రింకూ (బి) బుమ్రా 6; అఫ్రిది (ఎల్బీ) (బి) కుల్దీప్‌ 0; ఫహీమ్‌ (సి) తిలక్‌ వర్మ (బి) కుల్దీప్‌ 0; రవూఫ్‌ (బి) బుమ్రా 6; అబ్రార్‌ అహ్మద్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.1 ఓవర్లలో ఆలౌట్‌) 146. వికెట్ల పతనం: 1–84, 2–113, 3–114, 4–126, 5–131, 6–133, 7–134, 8–134, 9–141, 10–146. బౌలింగ్‌: శివమ్‌ దూబే 3–0–23–0, బుమ్రా 3.1–0–25–2, వరుణ్‌ చక్రవర్తి 4–0–30–2, అక్షర్‌ పటేల్‌ 4–0–26–2, కుల్దీప్‌ యాదవ్‌ 4–0–30–4, తిలక్‌ వర్మ 1–0–9–0.  

భారత్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ శర్మ (సి) రవూఫ్‌ (బి) ఫహీమ్‌ 5; గిల్‌ (సి) రవూఫ్‌ (బి) ఫహీమ్‌ 12; సూర్యకుమార్‌ (సి) సల్మాన్‌ (బి) అఫ్రిది 1; తిలక్‌ వర్మ (నాటౌట్‌) 69; సామ్సన్‌ (సి) ఫర్హాన్‌ (బి) అబ్రార్‌ 24; శివమ్‌ దూబే (సి) అఫ్రిది (బి) ఫహీమ్‌ 33; రింకూ సింగ్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (19.4 ఓవర్లలో 5 వికెట్లకు) 150. వికెట్ల పతనం: 1–7, 2–10, 3–20, 4–77, 5–137. బౌలింగ్‌: షాహిన్‌ అఫ్రిది 4–0–20–1, ఫహీమ్‌ 4–0–29–3, నవాజ్‌ 1–0–6–0, రవూఫ్‌ 3.4–0–50–0, అబ్రార్‌ 4–0–29–1, అయూబ్‌ 3–0–16–0.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement