
ఆసియాకప్-2025ను టీమిండియా విజయంతో ఆరంభించిన సంగతి తెలిసిందే. దుబాయ్ వేదికగా జరిగిన తమ తొలి మ్యాచ్‌లో యూఏఈను 9 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ ప్లేయింగ్ ఎలెవన్ నుంచి అర్ష్‌దీప్ సింగ్‌ను తప్పించడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాశంగా మారింది.
గత కొన్నళ్లగా టీ20ల్లో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్న ఆర్ష్‌దీప్‌కు యూఏఈపై ఆడే అవకాశం లభించలేదు. టీమ్ మెనెజ్‌మెంట్ తీసుకున్న ఈ నిర్ణయం అందరిని ఆశ్చర్యపరిచింది. తొలి మ్యాచ్‌లో భారత్ కేవలం ఒకే ప్రధాన పేసర్ బరిలోకి దిగింది. బుమ్రాతో పాటు మీడియం పేస్ బౌలర్లు హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే బంతిని పంచుకున్నారు. దూబే మూడు వికెట్లు పడగొట్టగా.. బుమ్రా ఓ వికెట్ సాధించాడు. హార్దిక్ కేవలం ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు.
అర్ష్‌దీప్‌ను బెంచ్‌కే పరిమితం చేయడంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ లైనప్‌ను చూస్తుంటే భారత్ ఇంకా ఛాంపియన్స్ ట్రోఫీ హ్యాంగోవర్ లో ఉన్నట్లు ఉందని చోప్రా అభిప్రాయపడ్డాడు. కాగా ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్‌లను భారత్ దుబాయ్ వేదికగానే ఆడింది. ఫైనల్లో కివీస్‌ను చిత్తు చేసి టైటిల్‌ను మెన్ ఇన్ బ్లూ సొంతం చేసుకుంది.
అర్ష్‌దీప్ సింగ్ అద్బుతమైన ఫాస్ట్ బౌలర్. అతడికి టీ20ల్లో 99 వికెట్లు ఉన్నాయి. ఈ ఫార్మాట్‌లో అతడు భారత్ తరపున లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. టీ20 క్రికెట్‌లో జస్ప్రీత్ బుమ్రా కంటే అర్ష్‌దీప్ గణాంకాలు మెరుగ్గా ఉన్నాయి. ఈ ప్లేయింగ్ ఎలెవన్‌ను చూస్తుంటే భారత్ ఇంకా ఛాంపియన్స్ ట్రోఫీ హ్యాంగోవర్ నుంచి రానిట్లు అన్పిస్తోంది.
మార్చిలో ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది. ఆ సమయంలో వాతవారణం చాలా పొడిగా ఉంది. కాబట్టి అప్పుడు మీ వ్యహాలు పనిచేశాయి. కానీ ఇది సెప్టెంబర్. వాతారణ పరిస్థితులు మారాయి. అయినప్పటికి టీమ్ మెనెజ్‌మెంట్ అదే వ్యూహాంతో వెళ్లారు. ఫార్మాట్ మారిన భారత్ ప్లాన్ మారలేదు.
వన్డే ఫార్మాట్‌కు టీ20కు చాలా తేడా ఉంది. రాబోయే మ్యాచ్‌లలో కూడా ఇదే ఎలెవన్‌తో ఆడనున్నారా? ఏదేమైనప్పటికి అత్యుత్తమ జట్టును ఎంపిక చేయండి" తన యూట్యూబ్ ఛానల్‌లో చోప్రా పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది మార్చిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ నలుగురు స్పిన్నర్లతో ఆడింది. ఇప్పుడు ఫార్మాట్ మరినప్పటికి టీమిండియా అదే ప్రణాళికను అనుసరిస్తుందని చోప్రా విమర్శించాడు. కాగా ఈ మ్యాచ్‌లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో సత్తాచాటాడు.