
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్ నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) కోచ్, భారత మాజీ క్రికెటర్ లాల్‌చంద్ రాజ్‌పుత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరని.. మ్యాచ్ రోజున బాగా ఆడిన వాళ్లనే విజయం వరిస్తుందని పేర్కొన్నాడు. కాగా పొట్టి క్రికెట్ ప్రేమికులను అలరించేందుకు ఆసియా కప్ టోర్నీ సిద్ధమైపోయింది.
టీమిండియా వర్సెస్ యూఏఈ
ఈసారి టీ20 ఫార్మాట్లో యూఏఈలో జరిగే ఈ ఖండాంతర టోర్నీలో ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్- ‘ఎ’ నుంచి భారత్ , పాకిస్తాన్‌లతో పాటు పసికూనలు యూఏఈ, ఒమన్.. గ్రూప్- ‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ పోటీ పడతాయి. సెప్టెంబరు 9న అఫ్గనిస్తాన్- హాంకాంగ్ మ్యాచ్‌తో టోర్నీకి తెరలేవనుండగా.. సెప్టెంబరు 10న యూఏఈ టీమిండియాను ఢీకొట్టనుంది.
మేము ఫియర్‌లెస్ క్రికెట్ ఆడతాము
ఈ నేపథ్యంలో యూఏఈ కోచ్ లాల్‌చంద్ రాజ్‌పుత్ మీడియాతో మాట్లాడాడు.. ‘‘టీమిండియా పటిష్ట జట్టు. గత టీ20 ప్రపంచకప్‌లో చాంపియన్. అలాంటి జట్టుతో ఆడే అవకాశం రావడం గొప్ప విషయం.
అయితే, టీ20 ఫార్మాట్లో మ్యాచ్ రోజున ఏ జట్టైతే బాగా ఆడుతుందో అదే గెలుస్తుంది. ఒక్క బ్యాటర్ లేదంటే బౌలర్ మ్యాచ్‌ను మలుపు తిప్పగలరు. మేము ఫియర్‌లెస్ క్రికెట్ ఆడతాము.
అన్నింటికీ సిద్ధంగా ఉన్నారు
మా జట్టు బ్యాటింగ్ విభాగం బలంగా ఉంది. బౌలింగ్ యూనిట్‌లో మంచి స్పిన్నర్లు ఉన్నారు. యూఏఈలో మ్యాచ్‌లు ఆడిన అనుభవం వారికి ఉంది. అయితే, పటిష్ట జట్టు అయిన టీమిండియాతో ఎలా ఆడతారో చూద్దాం.
ప్రతి ఒక్క జట్టుకు టీమిండియాతో ఆడాలని ఉంటుంది. మేము కూడా అంతే. అయితే, కాస్త ఆందోళనగానే ఉంది. ఏదేమైనా మా ఆటగాళ్లు అన్నింటికీ సిద్ధంగా ఉన్నారు’’ అని లాల్‌చంద్ రాజ్‌పుత్ పేర్కొన్నాడు. కాగా యూఏఈ జట్టు ఇటీవల పాకిస్తాన్- అఫ్గనిస్తాన్‌లతో కలిసి ముక్కోణపు టీ20 సిరీస్ ఆడింది. అయితే, ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేదు.
ఆసియా కప్-2025 టోర్నీకి యూఏఈ జట్టు:
ముహమ్మద్ వసీం (కెప్టెన్), అలిశాన్ షరాఫూ, ఆర్యాంశ్ శర్మ (వికెట్ కీపర్), ఆసిఫ్ ఖాన్, ధ్రువ్ పరాశర్, ఈథన్ డిసౌజా, హైదర్ అలీ, హర్షిత్ కౌశిక్, జునైద్ సిద్దిఖీ, మతీఉల్లా ఖాన్, ముహమ్మద్ ఫారూక్, ముహమ్మద్ జవాదుల్లా, ముహమ్మద్ జోహైబ్, రాహుల్ చోప్రా (వికెట్ కీపర్), రోహిద్ ఖాన్, సిమ్రన్‌జీత్ సింగ్, సాఘిర్ ఖాన్.
చదవండి: కుంబ్లేకి చెప్పి ఏడ్చాను.. అయినా పట్టించుకోలేదు.. కేఎల్ రాహుల్ కాల్ చేసి: క్రిస్ గేల్