సౌతాఫ్రికా- ‘ఎ’తో అనధికారిక రెండో టెస్టులో భారత్ -‘ఎ’ (IND A vs SA- Day 1) మెరుగైన స్కోరు సాధించింది. పర్యాటక జట్టు బౌలర్లు ఆది నుంచే చెలరేగి.. టాపార్డర్‌ను కుదేలు చేయగా.. ఆరో నంబర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) శతక్కొట్టి జట్టును ఆదుకున్నాడు. కాగా బెంగళూరు వేదికగా భారత్- ‘ఎ’- సౌతాఫ్రికా- ‘ఎ’ జట్లు రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్‌లో తలపడుతున్న విషయం తెలిసిందే.
టాస్ ఓడిన భారత్.. తొలుత బ్యాటింగ్
ఇందులో భాగంగా తొలి టెస్టులో రిషభ్ పంత్ (Rishabh Pant) కెప్టెన్సీలోని భారత జట్టు ప్రొటిస్ జట్టును మూడు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గురువారం రెండో టెస్టు మొదలైంది. బెంగళూరులో టాస్ గెలిచిన సౌతాఫ్రికా- ‘ఎ’ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్‌కు దిగింది.
కేఎల్ రాహుల్, పంత్ ఫెయిల్
ఇక ఈ మ్యాచ్‌తో జట్టులోకి వచ్చిన ఓపెనింగ్ బ్యాటర్లు కేఎల్ రాహుల్ (19), అభిమన్యు ఈశ్వరన్ (0) విఫలమయ్యారు. వన్‌డౌన్‌లో వచ్చిన సాయి సుదర్శన్ (17) నిరాశపరచగా.. దేవదత్ పడిక్కల్ (5) మరోసారి ఫెయిల్ అయ్యాడు.
ఇలాంటి దశలో ఐదో నంబర్ ఆటగాడు, కెప్టెన్ రిషభ్ పంత్ జట్టును ఆదుకునే క్రమంలో వేగంగా ఆడాడు. మొత్తంగా 20 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 24 పరుగులు చేసిన పంత్.. షెపో మొరేకి బౌలింగ్‌లో ఎంజే అకెర్‌మన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
సౌతాఫ్రికా ఆనందం ఆవిరి చేసిన జురెల్
దీంతో సౌతాఫ్రికా శిబిరం సంతోషంలో మునిగిపోయింది. హర్ష్ దూబే (14), ఆకాశ్ దీప్ (0)లను కూడా త్వరత్వరగా అవుట్ చేసింది. అయితే, వారి ప్రొటిస్ జట్టుకు ఆ ఆనందాన్ని ఎక్కువసేపు నిలవకుండా చేశాడు ధ్రువ్ జురెల్.
సహచర ఆటగాళ్లు విఫలమైన చోట జురెల్ అద్భుత శతకంతో మెరిశాడు. మొత్తంగా 175 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 132 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఖర్లో టెయిలెండర్లు కుల్దీప్ యాదవ్ (88 బంతుల్లో 20), మొహమ్మద్ సిరాజ్ (31 బంతుల్లో 15) వికెట్ పడకుండా జాగ్రత్తపడుతూ జురెల్‌కు సహకరించారు.
భారత్ ఆలౌట్.. స్కోరెంతంటే?
ఈ క్రమంలో 77.1 ఓవర్ వద్ద ప్రసిద్ కృష్ణ (0) పదో వికెట్‌గా వెనుదిరగడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసిపోయింది. తొలి రోజు పూర్తయ్యేసరికి77.1 ఓవర్లలో 255 పరుగులు చేసి భారత్ ఆలౌట్ అయింది. జురెల్ అద్భుత శతకం కారణంగా భారత జట్టుకు ఈ మేర మెరుగైన స్కోరు సాధ్యమైంది.
ఇక సఫారీ జట్టు బౌలర్లలో టియాన్ వాన్ వారెన్ నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. షెపో మొరేకి, ప్రెనేలన్ సుబ్రయాన్ చెరో రెండు, ఒకులే సిలీ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
భారత్- ‘ఎ’ వర్సెస్ సౌతాఫ్రికా -‘ఎ’ రెండో అనధికారిక టెస్టు తుదిజట్లు
భారత్
కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్ దేవ్‌దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, రిషభ్ పంత్ (కెప్టెన్/వికెట్ కీపర్), హర్ష్ దూబే, ఆకాశ్ దీప్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.
సౌతాఫ్రికా
జోర్డాన్ హెర్మాన్, లిసెగో సెనొక్‌వనే తెంబా బవుమా, జుబేర్ హంజా, మార్వ్కెస్ అకెర్‌మన్ (కెప్టెన్), కొనొర్ ఎస్తర్‌హుజీన్ (వికెట్ కీపర్), టియాన్ వాన్ వారెన్, కైలీ సైమండ్స్, ప్రెనేలన్ సుబ్రయాన్, షెపో మొరేకి, ఒకులే సిలీ.


