‘‘ఆరోజు నాకింకా గుర్తుంది. సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar)కు అదే తొలి ఆస్ట్రేలియా పర్యటన. నేను శతకం పూర్తి చేసుకున్నా. సచిన్ బ్యాటింగ్‌కు వచ్చాడు. వచ్చీరాగానే ‘వా’ (స్టీవ్ వా, మార్క్ వా) సోదరులు అతడిని స్లెడ్జ్ చేయడం మొదలుపెట్టారు.
నీ తల పగులగొడతా చూడు
అప్పుడు మైక్ విట్నీ ఫీల్డింగ్ కోసం 12th మ్యాన్‌గా వచ్చాడు. అప్పటికే నేను అలెన్ బోర్డర్‌తో పోటీ పడుతున్నా. ఇంతలో అతడు బంతి చేతులో పట్టుకుని నన్ను చూస్తూ.. ‘నువ్వైతే క్రీజులోకి వెళ్లు.. నీ తల పగులగొడతా చూడు’ అని నాతో అన్నాడు.
నేను వెంటనే వెనక్కి తిరిగి.. పిచ్ మధ్య వరకు వెళ్లి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ అంతా వినిపించేలా గట్టిగా అరిచాను. ‘హే మైక్.. బంతిని విసరడం కాదు.. అద్భుతంగా బౌలింగ్ చేస్తేనే లెక్క. నువ్వెప్పటికీ ఆస్ట్రేలియా 12th మ్యాన్‌వి కాలేవు’ అని అరిచాను.
నువ్వు నోరు మూసుకో
ఇంతలో సచిన్ నా దగ్గరికి వచ్చి.. తాను కూడా సెంచరీ చేసే ఆగమని చెప్పాడు. ఆ తర్వాత ఇద్దరం కలిసి వాళ్లకు వాళ్ల మాటల్ని తిరిగి ఇచ్చేద్దాం అన్నాడు. కానీ నేను మాత్రం.. ‘నువ్వు నోరు మూసుకో.. ఇప్పటికే చాలా అయింది. నీ బ్యాట్‌తో నువ్వు మాట్లాడు (పరుగులు రాబట్టు).. వాళ్ల సంగతి నేను చూసుకుంటా’ అని చెప్పాను’’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ రవిశాస్త్రి గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు.
దశాబ్దకాలానికి పైగా అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన రవిశాస్త్రి (Ravi Shastri).. ఆ తర్వాత హెడ్‌కోచ్‌గానూ సేవలు అందించాడు. ప్రస్తుతం కామెంటేటర్‌గా కొనసాగుతున్న రవిశాస్త్రి.. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌తో ముచ్చటిస్తూ.. 1992 నాటి ఆస్ట్రేలియా టూర్ జ్ఞాపకాలను ఇలా గుర్తు చేసుకున్నాడు.
పరుగుల మీదే దృష్టి పెట్టు
నాడు సిడ్నీలో జరిగిన మూడో టెస్టులో ఆసీస్ దిగ్గజం అలెన్ బోర్డర్ తమను స్లెడ్జ్ చేశాడని.. ఆ సమయంలో సచిన్‌కు కేవలం పరుగుల మీదే దృష్టి పెట్టాలని తాను సూచించినట్లు రవిశాస్త్రి తెలిపాడు. కాగా 1981- 1992 వరకు టీమిండియాకు ఆడిన రవిశాస్త్రి.. 80 టెస్టుల్లో 3830, 150 వన్డేల్లో 3108 పరుగులు సాధించాడు.
ఇక అత్యధిక పరుగుల వీరుడిగా ప్రపంచ రికార్డు సాధించిన సచిన్ టెండుల్కర్.. 200 టెస్టుల్లో 15921, 463 వన్డేల్లో 18426, ఒక టీ20లో 10 పరుగులు చేశాడు. అతడి ఖాతాలో వంద సెంచరీలు ఉన్నాయి. తద్వారా ప్రపంచంలో ఏకైక శతక శతకాల ధీరుడిగా సచిన్ కొనసాగుతున్నాడు.
చదవండి: హనుమాన్ టాటూ మీకెలా ఉపయోగపడింది?.. ప్రధాని మోదీ ప్రశ్నకు దీప్తి శర్మ జవాబు ఇదే


