Arshdeep Singh: ఆ రాత్రి సరిగ్గా నిద్రపోలేదు.. ట్రోల్స్‌ గురించి కాదు! తను ఎక్కువగా బాధపడ్డది అందుకే!

Ind Vs Pak: Arshdeep Could Not Sleep That Night After Drop Catch Says His Coach - Sakshi

Asia Cup 2022- India vs Pakistan, Super Four Match: ‘‘ఆరోజు పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో క్యాచ్‌ నేలపాలు చేసిన కారణంగా తాను ఆ రాత్రి సరిగా నిద్ర కూడా పోలేదని అర్ష్‌దీప్‌ నాతో చెప్పాడు. అందరిలాగే తను కూడా కాస్త టెన్షన్‌ పడ్డాడు. కానీ మేము అతడికి నచ్చజెప్పాం. 

నిజానికి తను హార్డ్‌వర్కర్‌. ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోవద్దని తనతో అన్నాము’’ అని టీమిండియా యువ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ చిన్ననాటి కోచ్‌ జశ్వంత్‌ రాయ్‌ అన్నాడు. పాక్‌తో మ్యాచ్‌లో ఓటమిపాలైనందుకు అర్ష్‌దీప్‌ ఎంతగానో బాధపడ్డాడని చెప్పుకొచ్చాడు.

ఆ ఒక్క క్యాచ్‌ మిస్‌ కావడంతో..
ఆసియా కప్‌-2022 సూపర్‌-4లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. బ్యాటర్లు రాణించినా.. బౌలర్లు విఫలం కావడంతో దాయాది చేతిలో రోహిత్‌ సేనకు ఓటమి తప్పలేదు. 

ముఖ్యంగా 18వ ఓవర్లో రవి బిష్ణోయి బౌలింగ్‌లో అర్ష్‌దీప్‌.. పాక్‌ ఆటగాడు అసిఫ్‌ అలీ ఇచ్చిన క్యాచ్‌ను నేలపాలు చేయడంతో టీమిండియా భారీ మూల్యమే చెల్లించింది. ఈ క్యాచ్‌ మిస్‌ కావడంతో లైఫ్‌ పొందిన అలీ.. ఆ తర్వాతి ఓవర్లో భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌లో సిక్సర్‌, ఫోర్‌ బాది పాక్‌ విజయానికి బాటలు వేశాడు.

ఇక ఆఖరి ఓవర్‌ వేసిన అర్ష్‌దీప్‌.. నాలుగో బంతికి అసిఫ్‌ అలీని ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు పంపినా.. ఆ తర్వాతి బంతికి ఇఫ్తికర్‌ అహ్మద్‌ రెండు పరుగులు తీసి పాక్‌ను గెలిపించాడు. ఈ నేపథ్యంలో అర్ష్‌దీప్‌ సింగ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. 

భారీ స్థాయిలో ట్రోలింగ్‌
ఈ ఫాస్ట్‌బౌలర్‌పై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ జరిగింది. విపరీతపు కామెంట్లతో అతడిని అవమానించారు. అంతేకాకుండా అతడి వికీపీడియా పేజీని ఎడిట్‌ చేసి ఓ నిషేధిత సంస్థతో సంబంధం ఉందంటూ అనుచితంగా ప్రవర్తించారు కొందరు ఆకతాయిలు. దీంతో ఏకంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. 

ఈ విషయాల గురించి అర్ష్‌దీప్‌ సింగ్‌ కోచ్‌ జశ్వంత్‌ రాయ్‌ తాజాగా ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ నాడు(సెప్టెంబరు 4) ఈ యువ పేసర్‌ మానసిక పరిస్థితి ఎలా ఉందన్న అంశం గురించి చెప్పుకొచ్చాడు. ‘‘క్యాచ్‌ జారవిడిచిన తర్వాత తను చివరి ఓవర్లో కేవలం ఏడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. బాగానే బౌలింగ్‌ చేశాడు. కానీ అప్పటికే నష్టం జరిగింది. 

క్యాచ్‌ జారవిడిచిన దానికంటే అదే ఎక్కువ బాధించింది!
ఆ మ్యాచ్‌ తర్వాత నేను తనతో మాట్లాడాను. ఆ రాత్రి తను సరిగా నిద్రపోలేకపోయానని అర్ష్‌దీప్‌ నాతో అన్నాడు. తాను ట్రోల్స్‌ గురించి పెద్దగా పట్టించుకోనని చెప్పాడు. కేవలం ఆరోజు ఫుల్‌టాస్‌ను యార్కర్‌(19వ ఓవర్‌ ఐదో బంతి)గా ఎందుకు మలచలేకపోయానా అని తను తీవ్రంగా బాధపడినట్లు చెప్పాడు.

తన ప్రణాళిక అమలు అయి ఉంటే బాగుండేది. ఏదేమైనా టీ20 ప్రపంచకప్‌ ఈవెంట్‌ అనేది ఏ క్రికెటర్‌కైనా తనను తాను నిరూపించుకునే అవకాశం ఇచ్చే గొప్ప వేదిక. తప్పులు సరిదిద్దుకునే తత్వమే అర్ష్‌దీప్‌ను ఈ టోర్నీలో నిలబెడుతుంది.. టీమిండియాకు ప్రయోజనకరంగా మారుతుంది’’ అని పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి ఆరంభం కానున్న టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీ ఆడే భారత జట్టులో అర్ష్‌దీప్‌నకు చోటు దక్కిన విషయం తెలిసిందే.

చదవండి: శ్రీలంక కష్టమే! ఆసీస్‌ ముందంజలో! అదే జరిగితే ఫైనల్లో భారత్‌- పాకిస్తాన్‌!
సూర్యకుమార్‌లో మనకు తెలియని రొమాంటిక్‌ యాంగిల్‌..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top