Ind Vs NZ: అసలేం చేస్తున్నారు.. టీమిండియాను భ్రష్టు పట్టించకండి: నెహ్రా ఘాటు వ్యాఖ్యలు! కోచ్‌గా లక్ష్మణ్‌..

Ind Vs NZ: Ashish Nehra Baffled Over Selection Tactics Slams Management - Sakshi

India tour of New Zealand, 2022 : న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో భారత జట్టు కూర్పుపై టీమిండియా మాజీ పేసర్‌ ఆశిష్‌ నెహ్రా విస్మయం వ్యక్తం చేశాడు. మేనేజ్‌మెంట్‌ అసలేం ఆలోచిస్తుందో అర్థం కావడం లేదని.. ఒక్క మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన ఆటగాళ్లను పక్కనపెట్టడం సరికాదని విమర్శించాడు. తప్పుడు నిర్ణయాలతో జట్టును భ్రష్టు పట్టించవద్దని ఘాటు విమర్శలు చేశాడు.

దీపక్‌ బౌలింగ్‌ ఆప్షన్‌ కాదు!
కాగా కివీస్‌తో మొదటి వన్డేలో చోటు దక్కించుకున్న బ్యాటర్‌ సంజూ శాంసన్‌, బౌలర్‌ శార్దూల్‌ ఠాకూర్‌లను ఆదివారం నాటి రెండో మ్యాచ్‌లో పక్కనపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంజూ స్థానంలో దీపక్‌ హుడా, శార్దూల్‌ స్థానంలో దీపక్‌ చహర్‌ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ క్రమంలో మ్యాచ్‌ బ్రాడ్‌కాస్టర్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో చర్చలో పాల్గొన్న ఆశిష్‌ నెహ్రా కీలక వ్యాఖ్యలు చేశాడు.

‘‘ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగడం మనం చూశాం. దీపక్‌ హుడాను బౌలింగ్‌ ఆప్షన్‌గా తీసుకున్నారని నేనైతే అనుకోవడం లేదు. నిజానికి అతడు వరల్డ్‌కప్‌ టోర్నీలో వికెట్లు తీసి ఉండవచ్చు. అయితే, ఇప్పుడు జట్టులో వాషింగ్టన్‌ సుందర్‌ ఉన్నాడు కదా! నిజానికి వాళ్లకు దీపక్‌ హుడా ఆరో బౌలింగ్‌ ఆప్షన్‌ కావొచ్చు. కానీ మరీ అంత గొప్ప ఆల్‌రౌండర్‌ ఏమీ కాదు.

చహర్‌ బెటర్‌.. అయినా
శార్దూల్‌ ఠాకూర్‌ గత మ్యాచ్‌లో బాగా ఆడలేదని కాదు.. అయితే తనకంటే దీపక్‌ చహర్‌ బెటర్‌. అయినా మొదటి మ్యాచ్‌లో చహర్‌ను కాదని ఠాకూర్‌ను ఆడించారు. కానీ.. ఆ మరుసటి మ్యాచ్‌కే ఠాకూర్‌ను తప్పించారు. ఇది సరికాదు’’ అని నెహ్రా అభిప్రాయపడ్డాడు. ఇక సంజూ శాంసన్‌ గురించి స్పందిస్తూ.. ‘‘ఒకవేళ నేను సెలక్టర్‌గా ఉంటే.. సంజూను కాదని హుడానే ఆడించేవాడిని.

హుడా కోసం సంజూను బలి చేయాలా?
అయితే, ఆరో బౌలింగ్‌ ఆప్షన్‌గా మాత్రం కాదు’’ అంటూ హుడాకు మద్దతుగా నిలవడం గమనార్హం. అయితే, చర్చలో భాగంగా ఇందుకు స్పందించిన మరో మాజీ క్రికెటర్‌ మురళీ కార్తిక్‌.. ‘‘ఆశిష్‌ అన్నట్లు హుడాను బ్యాటర్‌గా ఎంపిక చేయడం వరకు ఒకే! బౌలింగ్‌ ఆప్షన్‌గా కూడా వాడుకోవడం మంచి విషయమే. 

హుడా తుది జట్టులోకి రావడం కోసం మరొకరిని పక్కన పెట్టడం సరికాదు. నిజానికి, సంజూ శాంసన్‌ గత కొంతకాలంగా మెరుగైన ప్రదర్శన కనబరస్తున్నప్పటికీ అతడికి పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఇప్పుడేమో ఇలా ఒక్క మ్యాచ్‌ తర్వాత మళ్లీ పక్కన పెట్టారు’’ అని సంజూకు అండగా నిలబడ్డాడు. అయితే, తాత్కాలిక కోచ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నీ ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని కార్తిక్‌ అభిప్రాయపడ్డాడు.

కావాలనే చేశారు! అదేం కాదు..
మొదటి వన్డేలో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సంజూ శాంసన్‌ 36 పరుగులతో రాణించాడు. అయితే, గత కొంతకాలంగా విఫలమవుతున్న మరో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ మాత్రం మరోసారి తక్కువ స్కోరు(15)కే పెవిలియన్‌ చేరాడు. దీంతో సంజూను వివక్షపూరితంగానే పక్కన పెట్టారంటూ అతడి ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున బీసీసీఐని ట్రోల్‌ చేశారు.

ఇక ఈ మ్యాచ్‌ వర్షార్పణమైన తర్వాత కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ మాట్లాడుతూ.. ఆరో బౌలర్‌ అవసరమైనందు వల్లే సంజూకు బదులు హుడాను తీసుకున్నామని తెలిపాడు.  అదే విధంగా పిచ్‌ స్వింగ్‌కు అనుకూలంగా ఉంటుందని భావించి ఠాకూర్‌ను తప్పించి చహర్‌కు ఛాన్స్‌ ఇచ్చినట్లు వెల్లడించాడు.

ఈ నేపథ్యంలో ఆశిష్‌ నెహ్రా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు.. సంజూ అభిమానులు మాత్రం స్పిన్‌ బౌలింగ్‌ చేయగల హుడాను తీసుకున్నప్పటికీ.. వికెట్‌ కీపర్‌గా పంత్‌ను కాదని శాంసన్‌కు అవకాశం ఇవ్వొచ్చు కదా అని కామెంట్‌ చేస్తున్నారు. 

చదవండి: గిన్నిస్‌ రికార్డుల్లోకెక్కిన ఐపీఎల్‌ 2022 ఫైనల్‌.. ఎందుకంటే..?
IPL 2023: పెద్దగా పరిచయం లేని ఆటగాళ్లకు భారీ ధర.. అసలు ఎలా ఎంపిక చేస్తారు?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top