IPL 2023: పెద్దగా పరిచయం లేని ఆటగాళ్లకు భారీ ధర.. అసలు ఎలా ఎంపిక చేస్తారు?

How IPL Franchises Identify and Spend Big Bucks on Unknown Players - Sakshi

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) ప్రపంచ ప్రాంఛైజీ క్రికెట్‌ లీగ్‌ల్లో నెం1. కాసుల వర్షం కురిపించే ఈ టోర్నీలో భాగం కావాలని ప్రతీ ఆటగాడు కలలు కంటాడు. ముఖ్యంగా ఎంతో మంది యువ ఆటగాళ్లను  క్రికెట్ ప్రపంచానికి ఐపీఎల్‌ పరిచయం చేసింది. విరాట్‌ కోహ్లి నుంచి ఉమ్రాన్‌ మాలిక్‌ వరకు అక్కడ సత్తా చాటి భారత జట్టులోకి వచ్చిన వారే.

అయితే వేలంలో మనకు పెద్దగా పరిచయం లేని ఆటగాళ్లపై ఫ్రాంఛైజీలు ఎక్కువ మొత్తం చెల్లించడం మనం ప్రతీ సారి చూస్తూ ఉంటాం. అయితే ఆటగాళ్ల ఎంపిక, భారీ మొత్తం చెల్లించడం వెనుక పెద్ద కథే ఉంది. ఐపీఎల్‌ -2023 మినీ వేలం నేపథ్యంలో ఈ ప్రత్యేక కథనం.

సెలక్షన్‌ ట్రయల్స్‌
ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలు వివిధ రాష్ట్ర క్రికెట్‌ అసోషియేషన్లను సంప్రదిస్తూ యువ ఆటగాళ్లను ట్రయల్స్‌కు ఆహ్వానిస్తాయి. ఈ ట్రయల్స్‌లో ఆయా ఫ్రాంఛైజీ టాలెంట్ స్కౌట్‌లు ఆటగాళ్లు సవాళ్లను, ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారు? మ్యాచ్‌ పరిస్థితులను ఏ విధంగా ఆర్ధం చేసుకుంటారో వంటివి నిశితంగా పరిశీలిస్తారు.

బ్యాటర్ల విషయానికి వస్తే.. పవర్‌ ప్లేలో, మిడిల్‌ ఓవర్లలో ఎలా రాణిస్తారో, ఫాస్ట్‌ బౌలర్లకు ఏ విధంగా ఎదుర్కొంటారో వంటివి గమినిస్తారు. బౌండరీలు బాదే పవర్‌ ఉందా లేదా.. మ్యాచ్‌ను ఫినిష్‌ చేసే సత్తా ఉందా లేదా అన్నవి చూస్తారు. ఇక బౌలర్ల ఎంపిక విషయంలో కూడా టాలెంట్‌ స్కౌట్‌లు కొన్ని ప్రామాణాలు పాటిస్తారు.

పవర్‌ ప్లేలో ఏ విధంగా బౌలింగ్‌ చేస్తారు, ఒత్తిడిని తట్టుకుని రాణించగలరా? డెత్‌ ఓవర్లలో పరుగులను కట్టడి చేయగలరా వంటివి ముఖ్యంగా చూస్తారు. ఒక వేళ ఈ సెలక్షన్‌ ట్రయల్స్‌లో ఎంపిక కాకపోతే బౌలర్లను తమ జట్టు నెట్‌ బౌలర్లగా నియమించకుంటాయి. కాగా ప్రతీ ఐపీఎల్‌ జట్టుకు ఇద్దరు నుంచి ముగ్గురు వరకు నెట్‌ బౌలర్లు ఉంటున్నారు.

దేశవాళీ టోర్నీలపై కన్ను
టాలెంట్ స్కౌట్‌లు ట్రయల్స్‌లో ఆటగాళ్ల ప్రతిభను మాత్రమే కాకుండా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్‌ హజారే ట్రోఫీ, రంజీ ట్రోఫీ వంటి దేశవాళీ టోర్నీల్లో ఆటతీరును కూడా చూస్తారు.  “మా టాలెంట్ స్కౌట్‌లు దేశవ్యాప్తంగా చాలా మంది క్రికెటర్లను సెలక్షన్‌ ట్రయల్స్‌కు పిలుస్తారు. ముఖ్యంగా వారు దేశవాళీ క్రికెట్‌లో ఏ విధంగా రాణిస్తాన్నారన్నది చూస్తారు.

వారిలో కొంతమంది తమిళనాడు క్రికెట్‌ ఆసోషియషన్‌కు చెందిన ఆటగాళ్లు కూడా ఉంటారు" అని చెన్నై సూపర్‌ కింగ్స్‌ సీఈవో కాశీ విశ్వనాథన్‌ గతంలో ఓ స్పోర్ట్స్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కాగా తిలక్‌ వర్మ, అభినవ్‌ మనోహర్‌, మయాంక్‌ యాదవ్‌ వంటి ఆటగాళ్లు సీఎస్‌కే ట్రయల్స్‌కు హాజరైనప్పటికీ వేరే ఫ్రాంఛైజీలు కొనుగోలు చేశాయి.

మాక్‌ వేలం
ఇక సెలక్షన్‌ ట్రయల్స్‌ పూర్తి అయ్యాక టాలెంట్ స్కౌట్‌లు కొంత మం‍ది ఆటగాళ్ల పేర్లను ఆయా ఫ్రాంచైజీలకు సూచిస్తారు. ఈ క్రమంలో ప్రధాన వేలంకు ముందు ఫ్రాంచైజీలు మాక్‌ వేలంను నిర్వహిస్తాయి. ఈ మాక్‌ వేలంలో ఏ ఆటగాడిపై ఎంత వెచ్చించాలో, ఇతర ఫ్రాంఛైజీలతో ఎంతవరకు పోటీ పడవచ్చు వంటి ఆంశాలపై దృష్టిసారిస్తాయి.

నెట్‌ బౌలర్ల నుంచి ప్రధాన బౌలర్లగా
టాలెంట్ స్కౌట్‌లు ఎంపిక చేసిన కొంత మంది బౌలర్లు  ఐపీఎల్‌ వేలంలో అమ్ముడుపోరు. అటువంటి వారిని ఆయా ఫ్రాంచైజీలు తమ జట్టు నెట్‌ బౌలర్లగా ఎంపిక చేస్తాయి. వారు నెట్స్‌లో అద్భుతంగా బౌలింగ్‌ చేసి ప్రాధాన జట్టులో చోటు దక్కించకున్న చాలా సందర్భాలు ఉన్నాయి. టి నటరాజన్‌, మహేశ్ తీక్షణ వంటి వారు నెట్‌బౌలర్లగా వచ్చి ఆయా జట్లలో ప్రధాన  బౌలర్లగా మారారు.  ఇక ఐపీఎల్‌-2023 మినీ వేలం కొచ్చి వేదికగా డిసెంబర్‌ 23న జరగనుంది.
చదవండి: PAK Vs ENG: టెస్టు సిరీస్‌.. 17 ఏళ్ల తర్వాత పాక్‌ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top