Sakshi News home page

Rohit Sharma: మార్క్‌ వుడ్‌ రాకాసి బౌన్సర్‌.. నీకేం కాలేదు కదా!

Published Thu, Feb 15 2024 1:18 PM

Ind Vs Eng 3rd Test: Wood Fiery Bouncer Hit Rohit Helmet What Happen Next - Sakshi

ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేస్తోంది. రాజ్‌కోట్‌ వేదికగా గురువారం మొదలైన ఈ మ్యాచ్‌లో భారత్‌కు శుభారంభం లభించలేదు. 

మూడో టెస్టుతో రీ ఎంట్రీ ఇచ్చిన ఇంగ్లండ్‌ వెటరన్‌ పేసర్‌ మార్క్‌ వుడ్‌ ఆదిలోనే టీమిండియాను దెబ్బకొట్టాడు. నాలుగో ఓవర్‌ ఐదో బంతికి ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌(10), ఆరో ఓవర్‌ నాలుగో బంతికి వన్‌డౌన్‌ బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌(0)ను పెవిలియన్‌కు పంపాడు.

ఆ తర్వాత స్పిన్నర్‌ టామ్‌ హార్లే బౌలింగ్‌లో(8.5 ఓవర్‌) రజత్‌ పాటిదార్‌(5) కూడా వెనుదిరిగాడు. ఈ క్రమంలో 33 వికెట్లకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియాను ఆదుకునే బాధ్యత కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై పడింది.

ఈ క్రమంలో ఆచితూచి ఆడుతున్న హిట్‌మ్యాన్‌కు 10వ ఓవర్‌లో ప్రమాదం తప్పింది. మార్క్‌ వుడ్‌ సంధించిన రాకాసి బౌన్సర్‌ రోహిత్‌ హెల్మెట్‌కు బలంగా తాకింది. రోహిత్‌ను ట్రాప్‌ చేసేందుకు ముగ్గురు ఫీల్డర్లను సెట్‌ చేసుకున్న వుడ్‌..  డీప్‌ బౌన్సర్‌ వేశాడు.

అయితే, రోహిత్‌ షాట్‌(పుల్‌) ఆడకుండా బంతిని వదిలేశాడు. అది అతడి హెల్మెట్‌ను బలంగా తాకడంతో కంగారుపడ్డ మార్క్‌ వుడ్‌.. ‘‘నీకైతే ఏం కాలేదు కదా!’’ అని క్షేమసమాచారం అడిగి తెలుసుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను క్రికెట్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు.

కాగా అర్ధ శతకం పూర్తి చేసుకున్న రోహిత్‌ శర్మ దానిని సెంచరీగా మలిచే ప్రయత్నం చేస్తున్నాడు. 39 ఓవర్లు ముగిసే సరికి రవీంద్ర జడేజా 41, రోహిత్‌ శర్మ 73 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement