
ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) అద్భుత ప్రదర్శనతో దుమ్ములేపుతున్నాడు. తొలిరోజే శతకం పూర్తి చేసుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. గురువారం నాటి రెండో రోజు ఆటలో 150 పరుగుల మార్కు అందుకున్నాడు. 263 బంతుల్లో 17 ఫోర్ల సాయంతో గిల్ ఈ మేర స్కోరు చేశాడు.
తద్వారా టీమిండియా దిగ్గజ బ్యాటర్, కెప్టెన్ విరాట్ కోహ్లి (Virat Kohli) పేరిట ఉన్న రికార్డును గిల్ బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత క్రికెటర్‌గా అవతరించాడు.
ఇంతకు ముందు 2018 నాటి టెస్టు మ్యాచ్‌లో కోహ్లి ఇదే వేదికపై 149 పరుగులు స్కోరు చేశాడు. తాజాగా గిల్ కోహ్లిని అధిగమించి ఎడ్జ్‌బాస్టన్‌లో చరిత్ర తిరగరాశాడు. ఇక టెస్టుల్లో గిల్ 150 పరుగుల మార్కుకు చేరుకోవడం ఇదే తొలిసారి.
భారత రెండో కెప్టెన్‌గా..
ఇంగ్లండ్ గడ్డ మీద ఓ టెస్టు మ్యాచ్ ఇన్నింగ్స్‌లో నూట యాభైకి పైగా వ్యక్తిగత స్కోరు సాధించిన టీమిండియా రెండో కెప్టెన్‌గానూ గిల్ నిలిచాడు. 1990లో ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో మహ్మద్ అజారుద్దీన్ కెప్టెన్ హోదాలో 179 పరుగులు సాధించాడు.
మూడో సారథిగా..
అదే విధంగా.. 26వ పడిలో అడుగుపెట్టక ముందే టెస్టు ఇన్నింగ్స్‌లో 150 పరుగుల మార్కు దాటిన భారత మూడో కెప్టెన్‌గానూ గిల్ చరిత్రకెక్కాడు. అతడి కంటే ముందు మన్సూర్ అలీఖాన్ పటౌడీ రెండుసార్లు ఈ ఘనత సాధించగా.. సచిన్ టెండుల్కర్ కూడా ఈ ఫీట్ నమోదు చేశాడు.
కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడే నిమిత్తం భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. ఈ సిరీస్‌తో గిల్ భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా తన ప్రయాణం మొదలుపెట్టాడు. ఇక లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఐదు వికెట్లు తేడాతో ఓటమిపాలైంది.
జడేజాతో కలిసి 200 పరుగుల భాగస్వామ్యం
ఈ క్రమంలో బుధవారం (జూలై 2) నుంచి ఎడ్జ్‌బాస్టన్ వేదికగా రెండో టెస్టు మొదలు కాగా.. టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. తొలి రోజు ఆట ముగిసే సరికి ఐదు వికెట్లు నష్టపోయి 310 పరుగులు చేసిన భారత్.. గురువారం నాటి రెండో రోజు 400 పరుగుల మార్కు దాటింది.
107 ఓవర్లుముగిసే సరికి గిల్ 164, జడేజా 88 పరుగులతో ఉన్నారు. ఇద్దరూ కలిసి 200 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి జట్టును ఆదుకున్నారు. అయితే, తన స్కోరుకు మరో పరుగు జతచేసిన తర్వాత జడ్డూ జోష్ టంగ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ జేమీ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి 89 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు.
లంచ్ బ్రేక్ సమయానికి స్కోరు ఎంతంటే?
గురువారం భోజన విరామ సమయానికి టీమిండియా స్కోరు: 419/6 (110). గిల్ 168, వాషింగ్టన్ సుందర్ ఒక పరుగుతో ఉన్నారు.