Ind vs Ban: Umesh, Ashwin, Unadkat Shines, Bangladesh all out for 227 - Sakshi
Sakshi News home page

IND VS BAN 2nd Test: టీమిండియా బౌలర్ల విజృంభణ.. స్వల్ప స్కోర్‌కే కుప్పకూలిన బంగ్లాదేశ్‌

Published Thu, Dec 22 2022 3:49 PM

IND VS BAN 2nd Test: Umesh, Ashwin, Unadkat Shines, Bangladesh Collapse For 227 - Sakshi

ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో ఇవాళ (డిసెంబర్‌ 22) ప్రారంభమైన రెండో టెస్ట్‌లో టీమిండియా బౌలర్లు విజృంభించారు. టాస్‌ ఓడి తొలుత బౌలింగ్‌ చేసిన భారత్‌.. ఉమేశ్‌ యాదవ్‌ (4/25), రవిచంద్రన్‌ అశ్విన్‌ (4/71), జయదేవ్‌ ఉనద్కత్‌ (2/50) చెలరేగడంతో  బంగ్లాదేశ్‌ను 227 పరుగులకే (73.5 ఓవర్లలో) ఆలౌట్‌ చేసింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో మొమినుల్‌ హాక్‌ (84) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. నజ్ముల్‌ షాంటో (24), జకీర్‌ హసన్‌ (15), షకీబ్‌ (16), ముష్ఫికర్‌ రహీమ్‌ (26), లిటన్‌ దాస్‌ (25), మెహిది హసన్‌ (15), నురుల్‌ హసన్‌ (6), తస్కిన్‌ అహ్మద్‌ (1), ఖలీద్‌ అహ్మద్‌ (0) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. 

కాగా, ఈ మ్యాచ్‌ కోసం టీమిండియా మేనేజ్‌మెంట్‌ ఓ అనూహ్యమైన మార్పు చేసింది. తొలి టెస్ట్‌ మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు విన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ను పక్కకు పెట్టి సంచలన నిర్ణయం తీసుకుంది. అతని స్థానంలో 31 ఏళ్ల సౌరాష్ట్ర పేసర్‌ జయదేవ్‌ ఉనద్కత్‌కు అవకాశం కల్పించింది. 12 ఏళ్ల తర్వాత జట్టులో చోటు దక్కించుకున్న ఉనద్కత్‌.. మేనేజ్‌మెంట్‌ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా 2 వికెట్లతో రాణించాడు.

ఇదిలా ఉంటే, 2 మ్యాచ్‌ల ఈ టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 188 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అంతకుముందు ఇదే బంగ్లా పర్యటనలో జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్‌ 1-2 తేడాతో కోల్పోయింది. దీంతో టెస్ట్‌ సిరీస్‌ను ఎలాగైనా క్లీన్‌స్వీప్‌ చేసి, వన్డే సిరీస్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. అలాగే, ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరే అవకాశాలు కూడా మెరుగవుతాయి. ఈ నేపథ్యంలో టీమిండియా ఈ మ్యాచ్‌ను చాలా సిరీయస్‌గా తీసుకుంది. 


 

Advertisement
 
Advertisement