ఆస్ట్రేలియాతో నామమాత్రపు మూడో వన్డే (IND vs AUS 3rd ODI)లో భారత్ తమ తుదిజట్టులో కీలక మార్పులు చేసింది. గత రెండు వన్డేల్లోనూ పక్కన పెట్టిన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav)ను ఎట్టకేలకు ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకుంది.
పేసర్ అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో కుల్దీప్‌ను తుదిజట్టులోకి ఎంపిక చేసుకుంది. మరోవైపు.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) స్థానంలో యువ పేసర్ ప్రసిద్ కృష్ణ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు.
కారణం వెల్లడించిన బీసీసీఐ
కాగా నితీశ్ కుమార్ రెడ్డి మూడో వన్డేకు దూరం కావడానికి గల కారణాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తాజాగా వెల్లడించింది. గాయం కారణంగానే అతడిని పక్కనపెట్టినట్లు తెలిపింది. ఈ మేరకు ‘‘ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో జరిగిన రెండో వన్డేలో నితీశ్ కుమార్ రెడ్డి ఎడమవైపు గజ్జల్లో గాయంతో ఇబ్బంది పడ్డాడు.
అందుకే మూడో వన్డే సెలక్షన్‌కు అతడు అందుబాటులో లేకుండా పోయాడు. బీసీసీఐ వైద్య బృందం అతడి పరిస్థితిని పర్యవేక్షిస్తుంది’’ అని బీసీసీఐ కీలక అప్‌డేట్ అందించింది. ఒకవేళ నితీశ్ రెడ్డి త్వరగా కోలుకోకపోతే టీ20 సిరీస్ ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
సిరీస్ కోల్పోయిన భారత్
కాగా మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా తొలుత వన్డే సిరీస్ మొదలుకాగా.. పెర్త్‌లో ఏడు వికెట్ల తేడాతో ఓడిన గిల్ సేన.. అడిలైడ్‌లో రెండు వికెట్ల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది.
పరువు నిలుపుకోవాలని
ఫలితంగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆతిథ్య ఆస్ట్రేలియా సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శనివారం సిడ్నీ వేదికగా జరిగే నామమాత్రపు ఆఖరి వన్డేలోనైనా విజయం సాధించి పరువు నిలుపుకోవాలని పట్టుదలగా ఉంది.
ఈ నేపథ్యంలో కుల్దీప్ యాదవ్‌ను తుదిజట్టులోకి తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. కాగా రెండో వన్డేలో ఆసీస్ స్పిన్నర్ ఆడం జంపా నాలుగు వికెట్లతో చెలరేగి తమ జట్టుకు విజయం అందించగా.. కుల్దీప్‌ను పక్కనపెట్టడం ద్వారా టీమిండియా భారీ మూల్యమే చెల్లించిందంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మూడో వన్డే తుదిజట్లు
భారత్
రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.
ఆస్ట్రేలియా
మిచెల్ మార్ష్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, మ్యాట్ రెన్షా, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), కూపర్ కన్నోలీ, మిచెల్ ఓవెన్, నాథన్ ఎల్లిస్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్.
చదవండి: తెలివి తక్కువ నిర్ణయం: టీమిండియా మేనేజ్‌మెంట్‌పై అశూ ఫైర్


