
భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఆట తీరును టీమిండియా మాజీ హెడ్‌కోచ్ గ్రెగ్ చాపెల్ విమర్శించాడు. లార్డ్స్ టెస్టు (Lord's Test)లో జడ్డూ సింగిల్స్‌కే పరిమితం కావడం సరికాదని.. టెయిలెండర్లకు స్ట్రైక్ రొటేట్ చేయడం వల్ల వచ్చే లాభమేమీ ఉండదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కీలక సమయంలో సరైన వ్యూహంతో షాట్లు బాదితే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు.
టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఆతిథ్య జట్టుతో ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇప్పటికి మూడు మ్యాచ్‌లు పూర్తి కాగా.. రెండింట ఓడిన గిల్ సేన.. ఒకటి గెలిచింది. చివరగా లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టులో ఆఖరి వరకు పోరాడినప్పటికీ భారత జట్టుకు చేదు అనుభవమే మిగిలింది.
ఆశాకిరణంలా..
ఆఖరి రోజు ఆటలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన భారత్‌కు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆశాకిరణంలా కనిపించాడు. కీలక బ్యాటర్లు అవుటైనప్పటికీ టెయిలెండర్లు జస్‌ప్రీత్ బుమ్రా (54 బంతుల్లో 5), మహ్మద్ సిరాజ్ (30 బంతుల్లో 4)తో కలిసి జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేశాడు.
పోరాటం వృథా
ఇంగ్లండ్ విధించిన 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జడ్డూ 181 బంతుల్లో 61 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే, ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ బౌలింగ్‌లో సిరాజ్ అనూహ్య రీతిలో పదో వికెట్‌గా వెనుదిరగడంతో టీమిండియా ఓటమి ఖరారైంది. ఇంగ్లండ్ 22 పరుగుల తేడాతో గెలవడంతో జడ్డూ పోరాటం వృథాగా పోయింది.
ఈ నేపథ్యంలో జడ్డూ పోరాటపటిమను ప్రశంసిస్తూ హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌తో పాటు భారత మాజీ క్రికెటర్లు కామెంట్లు చేయగా.. గ్రెగ్ చాపెల్ మాత్రం భిన్నంగా స్పందించాడు. ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోకు రాసిన కాలమ్‌లో.. ‘‘అప్పటికి ప్రధాన బ్యాటర్‌గా జడేజా ఒక్కడే క్రీజులో ఉన్నాడు. టీమిండియా కచ్చితంగా స్వల్ప లక్ష్యాన్ని ఛేదించాలనే పట్టుదలతో ఉంది.
బంతుల్ని వదిలేస్తూ.. సింగిల్స్ తీస్తూ ఉంటే ఎలా?
అలాంటి సమయంలో అతడు కొన్ని వ్యూహాత్మకమైన రిస్కులు తీసుకోవాల్సింది. బంతుల్ని వదిలేస్తూ.. సింగిల్స్ తీస్తూ ఉంటే ఎలా?.. గెలవాల్సిన మ్యాచ్‌లో ఇలా ఎవరైనా ఆడతారా?
నిజానికి డ్రెసింగ్‌రూమ్ నుంచి అతడికి కచ్చితమైన సందేశం ఇచ్చి ఉండాల్సింది. ‘నువ్వే ఈ పని పూర్తి చేయాలి. టెయిలెండర్లు నీకు మద్దతుగా మాత్రమే నిలవగలరు. కానీ నువ్వే గెలిపించాలి’ అనే సందేశాన్ని కెప్టెన్ అతడికి అందించాల్సింది.
ఆ పరిస్థితిలో జడేజా స్పెషలిస్టు బ్యాటర్‌లా ఆలోచించి ఉండాల్సింది. టెయిలెండర్లకు స్ట్రైక్ రొటేట్ చేయడం వల్ల ఏం ప్రయోజనం?.. లార్డ్స్ పిచ్ మీద ఇది క్రమశిక్షణతో కూడిన ఇన్నింగ్సే. కానీ.. సరైందేనా? అంటే మాత్రం సమాధానం ఉండదు’’ అంటూ గ్రెగ్ చాపెల్ జడ్డూ ఆట తీరును విమర్శించాడు.
కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో నాలుగో టెస్టు (జూలై 23- 27) నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. తదుపరి ఇరుజట్ల మధ్య ఆఖరిదైన ఐదో టెస్టు (జూలై 31- ఆగష్టు 4)కు లండన్‌లోని కెన్నింగ్ ఓవల్ మైదానం వేదిక.