ఐపీఎల్‌లో గత రెండేళ్లుగా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) చెత్త ప్రదర్శన కొనసాగుతోంది. ఈ మాజీ చాంపియన్ 2025లో అత్యంత దారుణ ప్రదర్శనతో కేవలం నాలుగు మ్యాచ్‌లు గెలిచి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది.
ఈ నేపథ్యంలో 2026 వేలానికి ముందు సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను రాజస్తాన్ రాయల్స్‌కు ట్రేడ్ చేసిన చెన్నై.. అతడికి బదులు రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌ను తీసుకుంది. టీ20 ప్రపంచకప్-2026 ట్రోఫీని భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన సంజూ.. చెన్నై తరఫున ఆరంభంలో విఫలమయ్యాడు.
సంజూ ధనాధన్
అయితే, అనూహ్య రీతిలో పుంజుకుని రెండు శతకాల సాయంతో 14 మ్యాచ్‌లలో కలిపి 477 పరుగులు సాధించాడు సంజూ. తద్వారా సీఎస్‌కే తరఫున టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. కానీ.. జట్టు మాత్రం పేలవ ప్రదర్శనతో పద్నాలుగింట ఆరు మాత్రమే గెలిచి ఎనిమిదో స్థానంతో ముగించింది.
భారీ మార్పులకు ఆస్కారం
ఈ నేపథ్యంలో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. ఆటగాడిగానూ అతడు విఫలం కావడంతో వేటు వేస్తారా అనే సందేహాలు నెలకొన్నాయి. అదే విధంగా జట్టులో భారీ మార్పులకు ఆస్కారం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇలాంటి తరుణంలో సీఎస్‌కే మాజీ ఆటగాడు, భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సీఎస్‌కేలోకి వస్తాడనే అర్థంలో పోస్టు పెట్టాడు.
కాగా హార్దిక్ కెప్టెన్సీలో ముంబై ఈ ఏడాది చెత్త ప్రదర్శన కనబరిచింది. పద్నాలుగింట నాలుగే గెలిచి తొమ్మిదో స్థానంలో ముగించింది. ఇక నాలుగు మ్యాచ్‌లకు హార్దిక్ దూరం కాగా.. యాజమాన్యంతో విభేదాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నాడనే వార్తలు వచ్చాయి.
07:07 కథేంటి?
ఈ నేపథ్యంలో ఇటీవల హార్దిక్ ఇన్‌స్టాలో ఓ స్టోరీ షేర్ చేశాడు. ఇందులో.. ‘07:07’ అని తన ఫోన్‌లో టైమ్ చూపిస్తున్న ఫొటో పంచుకున్నాడు. దీంతో చెన్నై లెజెండ్ ధోని (జెర్సీ నంబర్)ని ఉద్దేశించే ఈ పోస్టు పెట్టాడని నెట్టింట చర్చ జరిగింది.
అశూ ఏమన్నాడు?
ఈ క్రమంలో ఓ నెటిజన్.. వచ్చే సీజన్‌లో చెన్నై జట్టులో మార్పుల గురించి అశూని అడుగగా.. ‘‘పతిరణ, 07:07, స్టోక్స్, దూబే, 07:07 మిడిలార్డర్/ఫినిషింగ్, ఓవర్టన్, స్టోక్స్ బ్యాలెన్స్’’ అని సమాధానం ఇచ్చాడు. దీంతో హార్దిక్ గురించే అశూ చెప్పాడనే చర్చ నడుస్తోంది.
కాగా పతిరణను గతేడాది సీఎస్‌కే రిలీజ్ చేయగా.. కోల్‌కతా కొనుక్కుంది. కానీ గాయం వల్ల అతడు ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. దీంతో కోల్‌కతా అతడిని రిలీజ్ చేయనుందనే వార్తలు రాగా.. పతిరణ తిరిగి మళ్లీ సీఎస్‌కేలోకే వస్తాడనే ప్రచారం ఊపందుకుంది.
ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌లో చెరో ఐదుసార్లు ముంబై, చెన్నై చాంపియన్లుగా నిలిచాయి. ఈ రెండు జట్లను అభిమానులు చిరకాల ప్రత్యర్థులుగా పరిగణిస్తారు. అలాంటిది ఊహించని రీతిలో హార్దిక్ ముంబైని వీడి ఐపీఎల్-2027 సందర్భంగా చెన్నైలో చేరతాడనే ప్రచారం ఆసక్తికరంగా మారింది.
Pathirana, 07:07 & Stokes !
Opening✅
Dube & 07:07 MiddleOrder/Finishing✅
Overton & Stokes Balance✅ https://t.co/kSALlKQDCp— Ashwin 🇮🇳 (@ashwinravi99) May 26, 2026


