అత్యంత క్లిష్ట సమయం: బెన్‌ స్టోక్స్‌ కీలక వ్యాఖ్యలు | Hardest Period: Stokes Breaks Silence on Ashes debacle Post Goes Viral | Sakshi
Sakshi News home page

అత్యంత క్లిష్ట సమయం: బెన్‌ స్టోక్స్‌ కీలక వ్యాఖ్యలు.. పోస్ట్‌ వైరల్‌

Mar 24 2026 6:35 PM | Updated on Mar 24 2026 7:10 PM

Hardest Period: Stokes Breaks Silence on Ashes debacle Post Goes Viral

ఇంగ్లండ్‌ టెస్టు క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. గడిచిన మూడు నెలల కాలం తన కెప్టెన్సీ కెరీర్‌లో అత్యంత కష్టతరమైనదని పేర్కొన్నాడు. ఏదేమైనా తాము సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతామని.. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటామని అన్నాడు.

ఘోర పరాభవం
ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ 2025-26లో ఇంగ్లండ్‌కు ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. ఆతిథ్య జట్టు చేతిలో 4-1తో ఓడిపోయిన స్టోక్స్‌ బృందం.. ఈ కీలక టెస్టు సిరీస్‌ను ఆసీస్‌కు సమర్పించుకుంది. ఈ పర్యటనలో ఇంగ్లండ్‌కు ఊరటనిచ్చిన ఒకే ఒక్క అంశం మెల్‌బోర్న్‌ వేదికగా నాలుగో టెస్టు గెలవడం మాత్రమే.

 రాజీనామా డిమాండ్లూ
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ జట్టు ఆట తీరుపై.. ముఖ్యంగా బజ్‌బాల్‌ పేరిట టెస్టు క్రికెట్‌లోనూ దూకుడుగా ఆడటం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌, హెడ్‌కోచ్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌ రాజీనామా చేయాలనే డిమాండ్లూ వచ్చాయి. అయితే, ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ECB) మాత్రం వీరిపై నమ్మకం ఉంచింది.

అన్నిసార్లూ అదే సరైన మార్గం కాదు
ECB చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ రిచర్డ్‌ గుడ్‌ ఈ విషయం గురించి తాజాగా మాట్లాడుతూ.. ‘‘అంతర్గతంగా యాషెస్‌ వైఫల్యంపై సమీక్ష జరిపాము. కొన్నిసార్లు నాయకత్వ బృందాన్ని మార్చడం తేలికైన పని అనిపిస్తుంది. కానీ అన్నిసార్లూ అదే సరైన మార్గం కాదు.

అదృష్టవశాత్తూ మా నాయకత్వ బృందానికి అంకితభావం, లక్ష్య సాధనకై శ్రమించే తత్వం ఎక్కువ. యాషెస్‌ వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతారు’’ అని పేర్కొన్నాడు. 

అత్యంత క్లిష్టమైనది
ఈ మేరకు రిచర్డ్‌ వ్యాఖ్యలు చేసిన కాసేపటికి స్టోక్స్‌ సోషల్‌ మీడియా వేదికగా స్పందించాడు. ‘‘ఇంగ్లండ్‌ జట్టు కెప్టెన్‌గా ఉండటం అత్యంత గొప్ప గౌరవం. దీనిని నేను తేలికగా తీసుకోవడం లేదు. ఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపళ్లాలు ఉన్నాయి.

కొన్నిసార్లు నవ్వితే.. మరికొన్నిసార్లు వెక్కి వెక్కి ఏడ్చిన సందర్భాలు. గత మూడు నెలల కాలం నా కెప్టెన్సీ ప్రయాణంలో అత్యంత క్లిష్టమైనది. బజ్‌ (మెకల్లమ్‌), రాబ్‌ కీ (సెలక్టర్‌), నేను ఎంతో అంకితభావంతో పనిచేస్తున్నాము.

జట్టును విజయపథంలో నడిపించేందుకు మా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. మేము కొన్ని తప్పులు చేశామని మాకు తెలుసు. వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటాము. అపజయాలను విజయాలుగా మారుస్తాము. 

సమ్మర్‌ టెస్టు షెడ్యూల్‌తో జూన్‌లో మిమ్మల్ని కలసుకుంటాను’’ అని స్టోక్స్‌ అభిమానులను ఉద్దేశించి పోస్ట్‌ పెట్టాడు. ఈ సందర్భంగా బజ్, రాబ్‌తో ఉన్న ఫొటోను షేర్‌ చేశాడు.

చదవండి: PSL: బంగ్లాదేశ్‌ కీలక నిర్ణయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement